శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సీఎస్ఐఆర్ వేసవి పరిశోధన శిక్షణా కార్యక్రమానికి 16,000 దరఖాస్తులు

Posted On: 19 JUN 2020 2:25PM by PIB Hyderabad

'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌' (సీఎస్ఐఆర్) వేసవి పరిశోధన శిక్షణా కార్యక్రమానికి (సీఎస్ఐఆర్-ఎస్ఆర్‌టీపీ) అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా 16,000ల‌కు పైగా దరఖాస్తుల‌తో మేటి స్పందన ల‌భించింది. అస్సాంలోని జోర్హాట్ కేంద్రంగా పని చేస్తున్న సీఎస్ఐఆర్ - నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (నీస్ట్) డైరెక్టర్ డాక్టర్ జి. నరహరి శాస్త్రి ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఈ ప్రోగ్రామ్‌
స‌మ‌న్వ‌య‌క‌ర్త అయిన‌ సీఎస్ఐఆర్‌-ఎన్ఈఐఎస్‌టీ ఏర్పాటు చేసిన సీఎస్ఐఆర్‌- ఎస్ఆర్‌టీపీ (2020) ప‌రిచ‌య‌పు కార్య‌క్ర‌మంలో డాక్టర్ శాస్త్రి ప్రసంగించారు.
ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో సీఎస్‌ఐఆర్ సంస్థ డైరెక్టర్ జనరల్ (డీజీ), భారత ప్రభుత్వ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన విభాగ‌ (డీఎస్‌ఐఆర్) కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి. మాండే ప్రారంభించారు.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంకురార్ప‌ణ‌..
"ఈ ఆన్‌లైన్ సమ్మర్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క భావన కోవిడ్ -19 ‌ మహమ్మారి కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్ స‌మ‌యంలో అంకురార్ప‌ణ జ‌రిగింది. లాక్‌డౌన్  దేశవ్యాప్తంగా విద్యా దృశ్యాలను మందకొడి ద‌శ‌కి తోసిన స‌మ‌యంలో ఆన్‌లైన్ అలోచ‌న ముందుకు వ‌చ్చింది. దేశ విద్యావేత్తలలో ఈ మహమ్మారి సృష్టించిన పెను మచ్చను తొల‌గించ‌డానికి మరియు దేశంలోని విద్యార్థులలో సోదర భావ‌ముతో  నిర్మాణాత్మక స్ఫూర్తిని పెంపొందించేందుకు డాక్టర్ శేఖర్ సి. మాండే ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టాల‌ని సీఎస్ఐఆర్‌-ఎన్ఈఐఎస్‌టీని ఆదేశించారు. ప్ర‌స్తుతం ఇది ఆచ‌ర‌ణ‌రూపం దాలుస్తోంది. భారత విద్యా చరిత్రలోనే ఇది మొదటిసారి” అని డాక్టర్ జి. నరహరి శాస్త్రి అన్నారు.
కోవిడ్ సైన్స్‌కు ఒక స‌వాలు..
ఈ కార్య‌క్ర‌మానికి దరఖాస్తులను స్వీకరించేందుకు చివరి తేదీని ఈ నెల 5వ తేదీ నుండి 8కి పొడిగించారు. రెండు రోజుల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులు త‌గు విధంగా ప్రాసెస్ చేసి ఈ నెల 10వ తేదీ నాటికి షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల జాబితా రూపొందించేందుకు గాను అంకిత భావంతో కృషి చేసిన సీఎస్ఐఆర్- ఎన్ఈఐఎస్‌టీ యొక్క ప్రత్యేక బృందాన్ని డీజీ డాక్టర్ శాస్త్రి ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు. శాస్త్ర మ‌రియు సాంకేతిక రంగాల‌లో ఉత్తమ ఆవిష్కరణలు యుద్ధాలు, వివిధ మహమ్మారులు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభ‌వించిన సమయంలో వెలుగులోకి వ‌చ్చాయ‌ని డాక్టర్ శాస్త్రి ఈ స‌మావేశంలో వివ‌రించారు. ప్ర‌స్తుత కోవిడ్ మహమ్మారి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక సవాలును విసురుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీతో ఉత్త‌మ ప‌రిష్కార మార్గాన్ని కనుగొనే అవ‌కాశాన్ని వెద‌జ‌ల్లింద‌ని ఆయ‌న అన్నారు.

                                                                                           *****


 



(Release ID: 1632806) Visitor Counter : 170