ప్రధాన మంత్రి కార్యాలయం

అస్సాంలోని చమురు బావిలో బ్లోఅవుట్ మరియు అగ్ని ప్రమాదం అనంతర పరిస్థితిని సమీక్షించిన - ప్రధానమంత్రి.

Posted On: 18 JUN 2020 8:51PM by PIB Hyderabad

అస్సాంలోని టిన్సుకియా జిల్లా లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన చమురు బావి నంబర్ బాగ్జన్-5 లో బ్లోఅవుట్ మరియు అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన పరిస్థితిని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో హోంమంత్రి శ్రీ అమిత్ షా, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఇతర కేంద్ర మంత్రులతో పాటు భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ బావి నుండి అనియంత్రిత వాయువు 2020 మే 27వ తేదీన లీక్ అవడం ప్రారంభమైంది.  ఆ తరువాత లీక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతూండగా, 2020 జూన్ 9వ తేదీన బావిలో మంటలు చెలరేగాయి.  చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత  తరలించారు.  వారి కోసం,  ఆయిల్ ఇండియా లిమిటెడ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది.  ఈ సహాయ శిబిరాల్లో సుమారు 9,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.  తక్షణ సహాయం కింద, జిల్లా పాలనా యంత్రాంగం గుర్తించిన 1,610 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికీ 30,000 రూపాయలు చొప్పున మంజూరు చేశారు. 

బాధిత కుటుంబాలకు మద్దతుగా తగిన సహాయం మరియు పునరావాసం కల్పించడానికి భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనీ, ఈ దురదృష్టకర సంఘటన కారణంగా నెలకొన్న కష్ట సమయంలో, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిలబడుతుందని,  అస్సాం ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు.  భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ప్రస్తుత సంఘటనను అధ్యయనం చేసి వివరాలను నమోదు చేయాలని, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు.  భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మరియు అవి సంభవించినప్పుడు అటువంటి విపత్తులను ఎదుర్కోవటానికి వీలుగా మరింత సామర్థ్యాలను, నైపుణ్యాలనూ, మన స్వంత సంస్థలలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. 

బావి నుండి వాయువు ప్రవాహాన్ని నియంత్రించడానికీ మరియు దానిని నిలిపివేయడానికీ, భారతీయ మరియు విదేశీ నిపుణుల సహాయంతో వివరణాత్మక ప్రణాళికను రూపొందించినట్లు సమీక్ష సమావేశంలో తెలియజేశారు.  సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రణాళిక అమలు చేయడం కొనసాగుతోంది.  అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్న తరువాత 2020 జూలై 7వ తేదీన బావిని మూసివేయాలని ప్రతిపాదించారు. 

*****


(Release ID: 1632491) Visitor Counter : 224