సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రపంచ మహమ్మారి కాలంలో సుపరిపాలన అలవాట్లపై వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వఉద్యోగులకు అంతర్జాతీయ అధ్యయన గోష్ఠిని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

మహమ్మారిపై పోరాటానికి 'ఆందోళన కాదు అవగాహన' అనేది సరైన మంత్రం: డాక్టర్ జితేంద్ర సింగ్

రెండు రోజుల అధ్యయన గోస్థిలో 16 దేశాలకు చెందిన 81 మంది ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో మంచి అలవాట్లతో కూడిన తమ అనుభవాలను పంచుకుంటారు.

Posted On: 18 JUN 2020 5:32PM by PIB Hyderabad

ప్రపంచ మహమ్మారి కోవిడ్ -19పై పోరాటానికి  ' ఆందోళన కాదు అవగాహన ఉండటం' కీలకమని కేంద్ర సిబ్బంది,  ప్రజా సమస్యలు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వివిధ సంస్థలు సమన్వయంతో ఏర్పాటు చేసిన అధ్యయన గోష్ఠిని వెబినార్  ద్వారా ప్రారంభిస్తూ   ఇప్పుడు కావలసింది  అంతర్జాతీయ సహకారమని మంత్రి అన్నారు.   ఈ అధ్యయన గోష్ఠిని  భారత్గ సాంకేతిక మరియు  ఆర్ధిక సహకారం (ఐ టి ఇ సి) ,  విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు  పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా సమస్యల మంత్రిత్వ శాఖలోని జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్ సి జి జి) సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

కోవిడ్ -19పై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి దేశాల ముందు  ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థను పునః ప్రారంభించడం మరియు సహకార ఫెడరలిజాన్ని బలోపేతం చేయడం వంటి మార్గ నిర్దేశం ఉందని  డాక్టర్ సింగ్ పునరుద్ఘాటించారు.   ఇందుకోసం పటిష్టమైన సమస్యలు,   బలమైన ఈ- గవర్నెన్స్ మోడల్స్,   డిజిటల్ సాధికారత సాధించిన పౌరులు మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటి పైన దృష్టిని కేంద్రీకరించాలని ఆయన అన్నారు.  

 

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి మానవాళి ముందుంచిన సవాలును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చారని డాక్టర్ సింగ్ గుర్తు చేశారు. 10 మిలియన్ అమెరికా డాలర్ల  కోవిడ్ -19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాక  శ్రీ నరేంద్ర మోదీ  సార్క్, నామ్ తదితర అంతర్జాతీయ వేదికలలో కూడా మహమ్మారి సమస్యను లేవనెత్తి  వివిధ దేశాల  నేతలను సమాయత్తం చేశారని ఆయన అన్నారు.  

 

రెండు రోజుల అధ్యయన గోస్థిలో  శ్రీ లంక సైనిక సిబ్బంది ప్రధానాధికారి మేజర్ జనరల్ హెచ్ జె ఎస్ గుణవర్ధన, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన 19 మంది సీనియర్ సెక్రెటరీలు,  మయన్మార్ నుంచి 11 జిల్లాల పాలనాధికారులు,  భూటాన్, కెన్యా, మొరాకో, నేపాల్, ఒమన్,  సోమాలియా, థాయ్ ల్యాండ్ , ట్యునీషియా, టోంగా, సూడాన్, ఉజ్బేకిస్థాన్ సీనియర్ అధికారులతో సహా  16 దేశాల నుంచి  81 మంది అంతర్జాతీయ సివిల్ సర్వెంట్లు పాల్గొంటున్నారు.  

 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం జరిపిన సమష్టి కృషి, కరుణ మరియు రాజనీతిజ్ఞత మంచి ఫలితాలు ఇచ్చాయని డాక్టర్ సింగ్ తమ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు.   సామజిక దూరం,  ఆరోగ్య సేతు యాప్ ఇందుకు బాగా ఉపకరించాయని అన్నారు.  ప్రస్తుతం 120 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఆరోగ్య సేతు యాప్ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.   ఇప్పుడు అధికారులు,  సిబ్బంది అందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని ఆయన తెలిపారు.   ఇప్పుడు ఢిల్లీ లోని కేంద్ర సచివాలయం కూడా డిజిటల్ సెంట్రల్ సెక్రెటేరియేట్ గా మారిందని మంత్రి తెలిపారు.   సమగ్ర సేవ పోర్టల్స్ ప్రభావం అందివచ్చిందని అన్నారు.  

పౌరులు డిజిటల్ సాధికారతను సాధించడానికి ఇండియా చేసిన ప్రయత్నాలు కరోనా వైరస్ కాలంలో కలసి వచ్చాయని అన్నారు.   ఆధార్ గుర్తింపు ద్వారా సంధానం చేయడం వల్ల  ఎన్నో ప్రభుత్వ సేవలు వాస్తవ కాలంలో  పౌరులకు చేరువ అయ్యాయని మంత్రి తెలిపారు.  

ప్రారంభ సమావేశంలో కేంద్ర  ప్రభుత్వంలో  పరిపాలన సంస్కరణలు తదితర శాఖల కార్యదర్శి డాక్టర్ ఛత్రపతి శివాజీ,   జాతీయ సుపరిపాలన కేంద్రం డైరెక్టర్ జనరల్,  కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి  శ్రీ వి. శ్రీనివాస్,  విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ దేవయాని ఖోబ్రగడే మరియు భారత ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

 భారత్ ఆచరిస్తున్న సుపరిపాలన అలవాట్లను  ఐటిఇసి దేశాలకు వ్యాప్తి చేసే లక్ష్యంతో  ఈ అధ్యయన గోష్ఠిని ఏర్పాటు చేశారు.  

****


(Release ID: 1632470) Visitor Counter : 177