గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

2020 జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించనున్న గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ పూర్వ రంగం పై విలేకరుల సమావేశం

125 రోజుల్లో 25 పనుల కింద కేటాయించిన నిధులను ముందుగా విడుదల చేయడం జరుగుతుంది, 25,000 మందికి పైగా వలస కార్మికులు తిరిగి వచ్చిన ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పనులు చేపడతారు : కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.


కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గరిష్ట ఉపాధి కల్పన కోసం వలస కార్మికుల నైపుణ్యాలను గుర్తించింది.

Posted On: 18 JUN 2020 5:55PM by PIB Hyderabad

20 జూన్ 2020 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్న గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పై ముందుస్తుగా వివరాలు తెలియజేసేందుకు విలేకరుల సమావేశం జరిగింది.  విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కోవిడ్ లాక్ డౌన్ తరువాత దేశవ్యాప్తంగా కార్మికులు, పురుషులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళారని చెప్పారు.  ఈ వలస కార్మికులు ఎక్కువగా తిరిగి వచ్చిన జిల్లాలను భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి.  దేశంలోని ఆరు రాష్ట్రాలు బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలలోని సుమారు 116 జిల్లాలకు గరిష్ట సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చినట్లు గుర్తించారు. వీటిలో 27 ఆశాజనక జిల్లాలు కూడా ఉన్నాయి.

శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ వలస కార్మికులకు గల నైపుణ్యాలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది. వారిలో ఎక్కువ మంది ఏదో ఒక రకమైన పనిలో నైపుణ్యం కలిగి ఉన్నట్లు గుర్తించడం జరిగింది.   ఈ సమాచారం ఆధారంగా మరియు వచ్చే నాలుగు నెలల్లో వారి ఇబ్బందులను తగ్గించడానికీ, వలస వచ్చిన కార్మికులతో పాటు, గ్రామీణ పౌరులకు సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను కల్పించడానికీ, ఒక భారీ గ్రామీణ ప్రభుత్వ పనుల పధకం  "గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్" ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కార్యక్రమం గురించి ఆర్ధికమంత్రి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, బీహార్‌ రాష్ట్రం, ఖగారియా జిల్లా, బెల్డౌర్ బ్లాక్ లోని  తేలిహార్ గ్రామంలో 2020 జూన్ 20వ తేదీన  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ,  ఈ పధకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. 125 రోజుల పాటు ఉద్యమ స్థాయిలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఒక వైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు, మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం, 50,000 కోట్ల రూపాయల ఆర్ధిక వనరులతో 25 రకాల వివిధ పనులను చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు.  

ఈ పధకాన్ని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రోడ్డు రవాణా మరియు రహదారులు, గనులు, తాగునీరు మరియు పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, నూతన మరియు పునరుత్పాదక శక్తి, సరిహద్దు రహదారులు, టెలికాం మరియు వ్యవసాయం వంటి 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో అమలు చేస్తున్నాయి. అవసరమైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో  గుర్తించిన జిల్లాలలో భారత ప్రభుత్వం 25 పనులను సమన్వయపరచి చేపట్టనుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పనులన్నింటినీ 125 రోజుల్లోగా పూర్తిచేసే విధంగా ఈ పనులకోసం  కేటాయించిన నిధులను సమీకరించి, విడుదల చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. 

ఈ పధకం గురించి ముందస్తుగా వివరాలను తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశంలో - కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ అమర్ ‌జీత్ సిన్హా, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా కూడా పాల్గొన్నారు.

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ వివరాలను పొందుపరిచి, ప్రదర్శించారు. 

ఈ వివరాలను ఈ లింకు ద్వారా వీక్షించవచ్చు. 

(Link of presentation on Garib Kalyan Rojgar Abhiyaan)

*****



(Release ID: 1632468) Visitor Counter : 244