సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

రాంచీలో బుధవారం 'దివ్యాంగుల కోసం సంయుక్త ప్రాంతీయ కేంద్రం' ప్రారంభించిన కేంద్ర మంత్రులు శ్రీ థావర్ చాంద్ గెహ్లాట్ మరియు శ్రీ అర్జున్ ముండా

Posted On: 17 JUN 2020 6:56PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి  శ్రీ థావర్ చాంద్ గెహ్లాట్ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ  అర్జున్ ముండా రాంచీలో బుధవారం  "దివ్యాంగుల  నైపుణ్య అభివృద్ధి ,  పునరావాసం,  ఉపాధి కల్పన కోసం  సంయుక్త ప్రాంతీయ కేంద్రం (సి ఆర్ సి)"
 ప్రారంభించారు.   ఈ కేంద్రం నగరంలోని ఖిజ్రీ ప్రాంతంలో ఉన్న నాంకుం బ్లాకు ఆఫీసులో ఉంది.     ఈ భవనాన్ని శ్రీ థావర్ చాంద్ గెహ్లాట్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించగా,  శ్రీ అర్జున్ ముండా  రాంచీలో సమావేశవేదిక వద్ద ఉన్నారు.  రాంచీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్  మరియు   ఖిజ్రీ ఎమ్మెల్యే శ్రీ రాజేష్ కశ్యప్  ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.   దివ్యాంగుల సాధికారత శాఖ కార్యదర్శి శ్రీమతి శకుంతల డి. గామ్లిన్ మరియు  దివ్యాంగుల సాధికారత శాఖ  జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ప్రబోధ్ సేథ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.  
తమ ప్రారంభోపన్యాసంలో శ్రీ గెహ్లాట్  రాంచీలో 21వ సి ఆర్ సి ప్రారంభిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని,  ఈ కేంద్రం ఝార్ఖండ్ రాష్ట్రంలో దివ్యాంగుల అవసరాలను తీర్చగలదని అన్నారు.    రాంచీకి ముందు  వివిధ రాష్ట్రాలలో సి ఆర్ సిలను ప్రారంభించడం జరిగిందని మంత్రి వెల్లడించారు.   ఈ కేంద్రాలు అంగవైకల్యం ఉన్న వారిలో  నైపుణ్య అభివృద్ధికి  ,  పునరావాసానికి  ఉపాధి కల్పనకు పాటు పడుతున్నాయని అన్నారు.  ప్రతి రాష్ట్రములో  ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని అయన వెల్లడించారు.   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన  నేతృత్వంలో తమ మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక పనులు చేసిందని,  మన దేశంలో దివ్యాంగుల సాధికారతకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.  రాంచీలో   సి ఆర్ సి కోసం 9000 చదరపు అడుగుల స్థలంతో  రెండున్నర ఎకరాల భూమి ఇచ్చి సహకరిస్తున్నందుకు ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.    రాంచీ  సి ఆర్ సి మొత్తం 21 రకాల దివ్యాంగులకు సేవలందించగలదన్న ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు.  దివ్యాంగుల సంక్షేమం కోసం తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన ముఖ్యమైన యత్నాలను గురించి ఆయన వివరించారు.  దివ్యాంగులకు రోజువారీ పనిలో ఉపకరించి వారి సామర్ధ్యాన్ని పెంచే పరికరాలు, ఉపకరణాల పంపిణీకి  తమ మంత్రిత్వ శాఖ 9147 శిబిరాలను ఏర్పాటు చేసి  17 లక్షల మంది దివ్యాంగులకు రూ. 1100 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.  ఉపకరణాల పంపిణీ శిబిరాల ఏర్పాటు ద్వారా  10 గిన్నీస్ ప్రపంచ రికార్డులు సృష్టించినట్లు తెలిపారు.   

దివ్యాంగులకు దేశమంతటా వారి అవసరాలకు  పనికివచ్చే సార్వత్రిక గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేయవలసిందిగా ఝార్ఖండ్ వాసులను ప్రేరేపించవలసిందిగా  ఆయన ఝార్ఖండ్ ప్రభుత్వానికి పిలుపు ఇచ్చారు.   ఇప్పటివరకు దివ్యాంగుల సాధికారత శాఖ 34 లక్షల దివ్యాంగుల సార్వత్రిక గుర్తింపు కార్డులను జారీ చేసిందని తెలిపారు.   దివ్యాంగులకు రైల్వే స్టేషన్లు, బస్టాండులు ,  విమానాశ్రయాలు  మరియు ముఖ్యమైన బహిరంగ స్థలాల వంటి అన్నిచోట్లా  వారి ప్రవేశాన్ని సుగమం చేయడానికి / అందుబాటులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ప్రాచారోద్యమం చేపట్టినట్లు తెలిపారు.  

దేశంలోని వివిధ ప్రాంతాలలో దివ్యాంగులలో ఉన్న   క్రీడా ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడం కోసం ఐదు దివ్యాంగుల క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.   దివ్యాంగులకు నైపుణ్య వృద్హికి శిక్షణ ఇవ్వడంతో పాటు  సరళ నిబంధనలపై వారికి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతోంది.   80% కన్నా ఎక్కువ వైకల్యం  ఉన్న వారికి  సులభంగా రాకపోకలు సాగించడానికి మోటారు బిగించిన మూడు చక్రాల సైకిల్ ఇవ్వడం జరుగుతోంది.   వినికిడి సమస్యలు ఉన్న వారి సౌకర్యం కోసం 6000 పదాలతో సంజ్ఞల డిక్షనరీ రూపొందించారు.   అంగ వైకల్యం ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం పూర్తి చేయడానికి  ఉపకార వేతనాలతో పాటు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతోంది.   

శ్రీ అర్జున ముండా తమ ప్రసంగంలో రాంచీలో సి ఆర్ సి ఏర్పాటు చేసినందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కేంద్రం ఝార్ఖండ్ రాష్ట్రంలో దివ్యాంగుల సర్వతోముఖ ప్రగతికి తోడ్పడగలదని,  వారికి జీవన సౌలభ్యం కలిగించగలదని అన్నారు.   ఈ కేంద్రం దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి తోడ్పడుతూ,  వారిని ప్రోత్సహించగలదన్న ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు.  

దివ్యాంగుల సాధికారత శాఖ కార్యదర్శి శ్రీమతి  శకుంతల డి. గామ్లిన్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి, అభ్యున్నతికి, పునరావాసానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను రాంచీ సి ఆర్ సి అమలు చేయగలదని అన్నారు.  ఝార్ఖండ్, దాని చుట్టూ పక్కల ప్రాంతాలకు చెందిన వారి పునరావాసానికి పాటుపడగలదని తెలిపారు.  అంతేకాక ఒడిశా రాష్ట్రం కటక్ లోని స్వామీ వివేకానంద జాతీయ పునరావాస శిక్షణ మరియు పరిశోధనా సంస్థకు అనుబంధంగా పని చేస్తుందని కూడా ఆమె తెలిపారు.    

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాంచీ పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్,  ఖిజ్రీ ఎమ్మెల్యే  శ్రీ రాజేష్ కశ్యప్  మరియు దివ్యాంగుల సాధికారత శాఖ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ప్రబోధ్ సేథ్ కూడా ప్రసంగించారు.  

***


(Release ID: 1632304) Visitor Counter : 208