పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఇండియన్ గ్యాస్ ఎక్సేంజీని ప్రారంభించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు
ఇది తొలి వాణిజ్య వేదిక
సహజవాయువు మార్కెట్ ధరను స్వేచ్ఛగా నిర్ణయించేందుకు ఈ కొత్త ఎలెక్ట్రానిక్ వాణిజ్య వేదిక దోహపడతుందని మంత్రి ప్రకటన
Posted On:
15 JUN 2020 6:54PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసే ఇండియన్ గ్యాస్ ఎక్సేంజీ అనే కొత్త తరహా వాణిజ్య వేదికను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ-సెరిమనీ ద్వారా ఈ ఎక్సేంజీని మంత్రి ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా సహజవాయువును సరఫరా చేసే ప్రాతిపదికన ఈ ఎక్సేంజీకి రూపకల్పన చేశారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే ఈ ఎక్సేంజీ ద్వారా వాణిజ్యం కూడా లాంఛనంగా మొదలైంది. ప్రమాణీకరించిన గ్యాస్ కాంట్రాక్టుల ద్వారా మార్కెట్ భాగస్వాములు వాణిజ్యం జరిపేందుకు ఇండియా గ్యాస్ ఎక్సేంజీ వీలు కలిగిస్తుంది. నిరాటంకంగా, సౌకర్యవంతంగా గ్యాస్ వాణిజ్యం చేసిన అనుభవాన్ని వినియోగదారులకు కలిగించేందుకు వెబ్ ఆధారితంగా ఈ ఎక్సేంజీని పూర్తి అధునాతనంగా రూపొందించారు.
గ్యాస్ ఎక్సేంజీని ప్రారంభించిన సందర్భంగా కేంద్రమంత్రి ప్రధాన్ మాట్లాడుతూ,..ఎలెక్టానిక్ వాణిజ్య వేదికగా ఈ ఎక్సేంజీని ప్రారంభించడం, భారతీయ ఇంధన రంగ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని, సహజవాయువు మార్కెట్ ధరను స్వేచ్ఛగా నిర్ణయించేందుకు ఈ ఎక్సేంజీ దోహదపడుతుందని అన్నారు. ఈ అధునాతన సదుపాయం మొదలుకావడంతో భారత్,..అభివృద్ధి చెందిన దేశాల సరసన చోటు సంపాదించిందని ఆయన అన్నారు. మార్కెట్ ప్రభావిత ధరల నిర్ణాయక వ్యవస్థ నెలకొన్న నేపథ్యంలో,.గ్యాస్ కు స్వేచ్ఛాయుతమైన మార్కెట్ సదుపాయాన్ని కల్పించడంలో ఇండియవన్ గ్యాస్ ఎక్సేంజీ మరింత బృహత్తర పాత్ర పోషిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
దేశంలోని ప్రతిప్రాంతానికి సహజవాయువు అందుబాటులోకి వచ్చేలా టారిఫ్ ను హేతుబద్ధం చేసేందుకు పెట్రోలియం, సహజవాయువుల నియంత్రణ మండలి (PNGRB) కృషి చేస్తోందని మంత్రి అన్నారు. వాణిజ్యం సాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, స్వేచ్ఛాయుత వాణిజ్యంలో వినియోగదారుడే రాజువంటివాడని ప్రధాన్ వ్యాఖ్యానించారు. ద్రవీకృత సహజవాయువు కేంద్రాల్లో, గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థల్లో, నగర గ్యాస్ సరఫరా వ్యవస్థకు సంబంధించినమౌలిక సదుపాయాల్లో భారీగా పెట్టుబడులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యం ఇండియన్ గ్యాస్ ఎక్సేంజీ ద్వారా సాకారం కాగలదని ఆయన అన్నారు.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న అనేక చర్యలను మంత్రి ప్రస్తావించారు. భారతీయ గ్యాస్ మార్కెట్ లో ధరలకు సంబంధించి పలు రకాల విధానాలు ఉన్నాయని అన్నారు. గ్యాస్ పై నూతన అన్వేషణ, లైసెన్సింగ్ విధానానికి మందు, ఆ తర్వాత అంటూ ఈ ధరల విధానాలు అమలులో ఉన్నాయని అన్నారు. ఐదు కోట్ల మెట్రిక్ టన్నుల ద్రవీకృత సహజవాయువు నిల్వ సామర్థ్యం కలిగిన టర్మినల్ ను దేశంలో త్వరలోనే ఏర్పాటు కాబోతోందని మంత్రి చెప్పారు. ఖతార్, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా వంటి పలు దేశాలతో దీర్ఘకాలిక గ్యాస్ కాంట్రాక్టులు మన దేశానికి ఉన్నాయని, మొజాంబిక్, రష్యా తదితర దేశాల్లోని వ్యూహాత్మక ఆస్తుల్లో మన దేశం పెట్టుబడులు పెట్టిందని మంత్రి చెప్పారు. దేశంలో గ్యాస్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఊర్జా గంగా, ఈస్టిండియా గ్రిడ్ వంటి పథకాలను మంత్రి ప్రస్తావించారు. ఈశాన్యం ప్రాంతంలోని ఇంద్రధనుస్ ప్రాజెక్టును, ధర్మా దహేజ్ పైప్ లైన్ పథకాన్ని, బొగ్గునుంచి గ్యాస్ తయారు చేసే ప్రాాజెక్టును, కోల్ బెడ్ మీథేన్ (CBM) విధానం తదితర అంశాలను కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 30వేల కిలోమీటర్లకు మేరకు గ్యాస్ పైప్ లైన్ దేశంలో నిర్మితమవుతుందని అన్నారు.
సహజవాయువు సరఫరాకోసం కొత్తగా ఇండియన్ గ్యాస్ ఎక్సేంజీ రూపంలో ప్రారంభించిన ఎలెక్ట్రానిక్ వాణిజ్య వేదిక కేంద్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానానికి సూచికగా మంత్రి అభివర్ణించారు. వివిధ వనరులనుంచి గ్యాస్ ఉత్పత్తి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుంచి ద్రవీకృత సహజవాయువు దిగుమతి మొదలుకొని, పారదర్శక ధరల నిర్ణాయక వ్యవస్థ ఏర్పాటు వరకూ దేశం భారీ ఇంధన వలయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిందని మంత్రి అన్నారు. దేశ ప్రజలలందరికీ ఇంధన న్యాయం కల్పించాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని మంత్రి ప్రధాన్ ప్రస్తావిస్తూ,..స్వచ్ఛమైన, గిట్టుబాటు ధరలోని, సమన్యాయంతో కూడిన ఇంధనం ప్రజలందరికీ అందుబాటులో ఉండి తీరాలని అన్నారు.
పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, పెట్రోలియం సహజవాయు నియంత్రణ మండలి అధ్యక్షుడు కె.డి. సరాఫ్ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు.
(Release ID: 1631798)
Visitor Counter : 279