సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వెదురు కర్రలపై దిగుమతి సుంకం పెంచడంతో, భారతదేశంలో అగర్ బత్తి మరియు వెదురు పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశం : కె.వి.ఐ.సి.

Posted On: 11 JUN 2020 6:40PM by PIB Hyderabad

వెదురు కర్రలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుండి 25 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో స్వయం ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుంది.  ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ,  రాబోయే 8-10 నెలల్లో, గ్రామీణ పరిశ్రమల రంగంలో ఒక ప్రధాన కార్యకలాపమైన అగర్ బత్తి పరిశ్రమలో కనీసం లక్ష కొత్త ఉద్యోగాలు సృష్టించబడతయని కె.వి.ఐ.సి. పేర్కొంది. 

భారీ దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు మరియు స్థానిక పరిశ్రమ వృద్ధికి సహాయపడటానికి వెదురు కర్రలపై దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీని కోరిన కేంద్ర ఎం.ఎస్.‌ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చొరవతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కె.వి.ఐ.సి. తెలిపింది.   చైనా మరియు వియత్నాం దేశాల నుండి భారీగా వెదురు కర్రలను దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంలో ఉద్యోగావకాశాలకు  ఎక్కువగా నష్టం కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.  అదేవిధంగా, ఈ నిర్ణయం వల్ల, భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న అగర్ బత్తి డిమాండ్ ను తీర్చడానికి అనువుగా కొత్త అగర్ బత్తి తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. 

భారతదేశంలో ప్రస్తుతం, అగర్ బత్తి కర్రల వినియోగం రోజుకు 1490 టన్నులు ఉండగా, రోజుకు 760 టన్నులు మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయని, కె.వి.ఐ.సి. తెలిపింది.  అందువల్ల, డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరం భారీగా ఉండడంతో  ముడి అగర్ బత్తి కర్రలు భారీగా దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏర్పడింది.  దీంతో, 2009 లో కేవలం 2 శాతంగా ఉన్న ముడి అగర్ బత్తి కర్రల దిగుమతి 2019 లో 80 శాతానికి పెరిగింది.  ద్రవ్య పరంగా చూస్తే, 2011 లో దిగుమతి సుంకాన్ని 30 శాతం నుండి 10 శాతానికి తగ్గించడం వల్ల భారతదేశంలో ముడి అగర్ బత్తి దిగుమతి 2009 లో 31 కోట్ల రూపాయల మేర ఉండగా, అది 2019 లో 546 కోట్ల రూపాయలకు పెరిగింది.  "ఇది భారతీయ అగర్ బత్తి తయారీదారులను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో  మొత్తం యూనిట్లలో దాదాపు 25 శాతం యూనిట్లు మూతబడ్డాయి." అని కె.వి.ఐ.సి. తెలియజేసింది. 

అయితే, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) అభ్యర్థన మేరకు, వాణిజ్య మంత్రిత్వ శాఖ 2019 ఆగస్టు 31వ తేదీన ముడి అగర్ బత్తి  దిగుమతిని  “పరిమితం”  విభాగంలోకి మార్చింది.  దిగుమతి పై ఆంక్షలు విధించినందువల్ల,  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు అనేక ఈశాన్య రాష్ట్రాలలో వందలాది అగర్ బత్తి యూనిట్లు పునరుద్ధరించబడగా, స్థానికంగా ముడి అగర్ బత్తి తయారుచేసే రౌండ్ వెదురు కర్రలను దిగుమతి చేసుకోవడానికి ఈ చర్య స్థానిక వ్యాపారులను ప్రేరేపించింది.  దీంతో,  వెదురు కర్రల దిగుమతి 2018-19 సంవత్సరంలో 210 కోట్ల రూపాయలు ఉండగా, 2019-20 సంవత్సరానికి అది 370 కోట్ల రూపాయలకు పెరిగింది.

కె.వి.ఐ.సి. చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, "ఈ ఒక్క నిర్ణయం భారతదేశంలో అగర్ బత్తి తో పాటు వెదురు పరిశ్రమను బలోపేతం చేస్తుంది" అని చెప్పారు.  "భారతదేశం ప్రపంచంలో వెదురు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం. అయితే, ఇది వెదురు మరియు దాని ఉత్పత్తుల దిగుమతిలో కూడా భారతదేశం 2వ అతిపెద్ద దేశంగా ఉంది.  వెదురు కర్రలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుండి 25 శాతం వరకు పెంచడం ద్వారా చైనా నుండి భారీ దిగుమతిని అరికట్టినట్టు అవుతుంది. అదేవిధంగా,  అగర్ బత్తి మరియు వెదురు పరిశ్రమలలో స్థానిక తయారీదారులను ప్రోత్సహించినట్లు అవుతుంది. అగర్ బత్తి ఉత్పత్తిలో భారతదేశం త్వరలో "ఆత్మనిర్భర్" గా మారుతుందని మేము ఆశిస్తున్నాము, ఇది వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.  " అని సక్సేనా వివరించారు. 

"అగర్ బత్తి తయారీ పరిశ్రమ గ్రామీణ పరిశ్రమ రంగంలో ఒక భాగం, దీనికి చాలా తక్కువ మూలధనం మరియు తక్కువ సాంకేతిక నైపుణ్యాలు అవసరం.  ఈ పరిశ్రమ ఎక్కువగా మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.  కోవిడ్ అనంతర పరిస్థితుల్లో,  ఈ పరిశ్రమ వలస కార్మికులకు ఒక వరంగా పని చేస్తుంది.  అగర్ బత్తి  పరిశ్రమ ప్రధానమంత్రి కన్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేస్తుంది. ” అని సక్సేనా పేర్కొన్నారు. 

భారతదేశం ప్రతి సంవత్సరం 14.6 మిలియన్ టన్నుల వెదురును ఉత్పత్తి చేస్తుంది, దాదాపు 70,000 మంది రైతులు వెదురు తోటల పెంపకంలో నిమగ్నమై ఉన్నారు.  భారతదేశంలో 136 వెదురు రకాలు ఉన్నాయి. అయితే, అగర్ బత్తి కర్రలను తయారు చేయడానికి ఉపయోగించే బంబుసా తుల్డా రకం వెదురు తోటలు, ఈశాన్య ప్రాంతంలో సమృద్ధిగా కనిపిస్తాయి.  రాబోయే 3-4 సంవత్సరాల్లో పెరుగుతున్న వెదురు డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి కె.వి.ఐ.సి.  వెదురు తోటల పెంపకాన్ని కూడా  చేపట్టింది. 

 

*****



(Release ID: 1631017) Visitor Counter : 260