ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆరోగ్య సేతు సమర్థంగా వాడండి: కలెక్టర్లను కోరిన మంత్రి శ్రీ ధోత్రే

Posted On: 10 JUN 2020 8:10PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి, మానవవనరుల, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే సూచనలమేరకు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ లోని ఆరోగ్య సేతు యాప్ బృందం, అన్ని జిల్లాల కలెక్టర్లు, మహారాష్ట్రలోని ఎన్ ఐ సి డి ఐ ఓలు ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలోని క్షేత్ర స్థాయి అధికారులకు ఆరోగ్య సేతు యాప్ లోని వివిధ అంశాలపట్ల అవగాహన పెంచటంతోబాటు వారినుంచి అభిప్రాయాలు సేకరించటం ఈ సమాలోచనల ప్రధాన లక్ష్యం. కేంద్ర  సహాయ మంత్రి శ్రీ ధోత్రే తోబాటు మహారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీ రాజేశ్ తోపె, ఐటి మంత్రి శ్రీ సతేజ్ పాటిల్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి, దాని కదలికల తీరుతెన్నులను స్థూలంగానూ, సూక్ష్మంగానూ అర్థం చేసుకోవటానికి ఆరోగ్య సేతు ద్వారా లభించే డేటా విశ్లేషణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ దృష్టికొచ్చింది. ఈ డేటాను సకాలంలో సమర్థంగా వాడుకోవటం ద్వారా హాట్ స్పాట్స్ ను ముందుగానే గుర్తించటం సాధ్యమవుతుందని, దానివలన ప్రణాళికాబద్ధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించటం సులువవుతుందని సమావేశం అభిప్రాయపడింది.  
జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాలలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ఆరోగ్య సేతు వాడకం ద్వారా కలిగిన అనుభవాలను  పంచుకున్నారు. వ్యాధి నిరోధించటంలో కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు చేసిన కృషిని మంత్రి శ్రీ ధోత్రే అభినందించారు. ఆరోగ్య సేతు డేటా విశ్లేషణలను సమర్థంగా వాడుకోగలిగేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ద్వారా మరింత శిక్షణ ఇప్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.


క్షేత్ర స్థాయి అధికారులనుద్దేశించి మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, కోవిడ్-19 మీద పోరులో ఆరోగ్య సేతు యాప్ వాడకం తప్పనిసరి అన్నారు. దానిలోని సమాచారాన్ని జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వాడుకుంటే కోవిడ్-19 విసిరే సవాళ్లను గుర్తించి సులభంగా ఎదుర్కోగలమన్నారు. మహారాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీ రాజేశ్ తోపే మాట్లాడుతూ, కోవిడ్-19 మీద పోరులో సాంకేతిక పరిజ్ఞానపు ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. మంత్రి శ్రీ ధోత్రే చొరవతో ఇలా సాంకేతిక బృందంతో క్షేత్ర స్థాయి అధికారుల సమాలోచనలు ఏర్పాటు చేయటాన్ని  కొనియాడారు. మహారాష్ట్ర ఐ టి శాఖామంత్రి శ్రీ సతేజ్ పాటిల్ మాట్లాడుతూ, ఆరోగ్యసేతు యాప్ వాడకం అనివార్యమన్నారు. జిల్లా అధికారులకు విస్తృతమైన శిక్షణ ఇవ్వటం ద్వారా మరిన్ని ఫలితాలు సాధించగలమన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ ప్రకాశ్ షానే పాల్గొన్నారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా లభ్యమయ్యే సమాచారాన్ని ఎలా వాడుకోవాలో అధికారులకు ఆయన వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రదీప్ వ్యాస్, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి సాధనా తయాడే, ఎన్ ఐ సి డైరెక్టర్ జనరల్ శ్రీమతి నీతా వర్మ, డిప్యూటీ డైరెక్తర్ జనరల్ శ్రీ ఆర్. ఎస్. మణి్, డిడిజి శ్రీమతి సీమా ఖన్నా, మహారాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య, పరిశోధన డైరెక్టర్ డాక్టర్ తాత్యా రావు లహానే, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వి, కామకోటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని విలువైన సలహాలిచ్చారు. 

***



(Release ID: 1630799) Visitor Counter : 189