జల శక్తి మంత్రిత్వ శాఖ

మేఘాలయలో జలజీవన్ పథకం అమలుతీరుపై కేంద్ర జలశక్తి మంత్రి ఆందోళన

Posted On: 09 JUN 2020 12:39PM by PIB Hyderabad

  మేఘాలయలో జలజీవన్ పథకం మరీ మందకొడిగా అమలు జరుగుతున్న తీరుపట్ల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లకు 2022 డిసెంబర్ నెలకల్లా తాగునీటి కొళాయి కనెక్షన్లను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన మేరకు జలజీవన్ పథకాన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 2024వ సంవత్సరానికల్లా  గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి కనెన్షన్ ద్వారా పరిశుద్ధమైన తాగునీటిని అందించడం జలజీవన్ పథకం లక్ష్యం. తాగునీటికి సంబంధించి గ్రామీణ మహిళలకు భద్రతను, గౌరవాన్ని కల్పించేందుకు పథకం దోహదపడుతుంది. తాగునీటికోసం మహిళలకు నానా ప్రయాసలు పడాల్సిన అగత్యం కూడా తప్పుతుంది.

      జలజీవన్ పథకం లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా సాధించేందుకు, ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటుచేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సరైన ప్రణాళికను చేపట్టవలసిన అవసరం ఉందని కేంద్ర జలశక్తి మంత్రి తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. మేఘాలయలో పైపుల ద్వారా నీటిసరఫరా జరుగుతోందని భావిస్తున్న 3,891 గ్రామాల్లో జలజీవన్ పథకం పనులను ఒక ‘ఉద్యమం‘గా  సత్వరం చేపట్టవలసిన అవసరం ఉందని కేంద్రమంత్రి మేఘాలయ ముఖ్యమంత్రికి సూచించారు. వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో, సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అమలు జరుగుతూ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాబల్యం కలిగిన గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో  పారిశుద్ధ్యం పనుల విషయంలో సంతృప్తికరమైన స్థాయిని సాధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రమంత్రి షెఖావత్ సూచించారు.

    జలజీవన్ పథకం కింద తాగునీటి సరఫరా పథకానికి కావలసిన నిధులను భారత ప్రభుత్వం అందజేస్తోందని, ఇళ్లకు ఏర్పాటు చేసిన తాగునీటి కనెక్షన్లు, అందుబాటులో ఉన్న నిధుల వినియోగం ప్రాతిపదికన నిధులు అందిస్తోందని షెఖావత్ తన లేఖలో ప్రస్తావించారు. అయితే, 2019-20వ సంవత్సరంలో లక్షా 17వేల ఇళ్లకు నీటి కొళాయిల కనెక్షన్లు కల్పించాలన్నది లక్ష్యంకాగా,..కేవలం 1,800 కనెన్షన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద మేఘాలయ రాష్ట్రానికి 2019-20లో 86.02కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ పథకం అమలు మందకొడిగా సాగుతున్నందున కేవలం 43.01కోట్ల రూపాయలు విడుదలైంది. అందులోనూ మేఘాలయ ప్రభుత్వం 26.35కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేసింది. ఇంకా 17.46కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు.  2020-21వ సంవత్సరంలో మేఘాలయకు నిధుల కేటాయింపు 174.92కోట్ల రూపాయలకు పెంచారని,.. ప్రారంభ మొత్తమైన 17.46కోట్ల రూపాయలు, ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 174.92 కోట్ల రూపాయలతో కలిపితే మేఘాలయకు 192.38కోట్ల రూపాయల కేంద్ర నిధులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి తన లేఖలో  తెలియజేశారు. రాష్ట్ర వాటా మొత్తంతో కలిపితే జలజీవన్ పథకం అమలుకు మేఘాలయకు 216కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి తెలిపారు. ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించడం జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశమని, ఈ పథకం లక్ష్యాన్ని గడువులోగా సాధించేందుకు రాష్ట్రం కృషిచేయాలని షెఖావత్ తన లేఖలో స్పష్టం చేశారు.

   నీటి సరఫరా వ్యవస్థలు దీర్ఘకాలం మనుగడ సాగించేలా చూసేందుకు నీటి వనరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను బలోపేతం చేయాలని కేంద్రమంత్రి షెఖావత్ సూచించారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర మంత్రి సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) వంటి పథకాలు,... పంచాయతీ రాజ్ సంస్థలు, క్యాంపా(CAMPA) పథకం, జిల్లా ఖనిజ వనరుల అభివృద్ధి నిధి, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు... వంటి వాటి కలయికతో  అందుబాటులో ఉన్న వనరులతో కార్యాచరణ ప్రణాళికను ప్రతి గ్రామానికీ రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.  గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థలు దీర్ఘకాలం మనగలిగేలా చూసేందుకు ఆయా వ్యవస్థల ప్రణాళిక, వాటి నిర్వహణ వంటి వ్యవహారాల్లో స్థానిక గ్రామ సంఘాలు, గ్రామ పంచాయతీలు, వినియోగదారుల గ్రూపులకు ప్రమేయం కల్పించవలసిన అవసరం ఉందని సూచించారు. జలజీవన్ పథకాన్ని సిసలైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు అన్ని గ్రామాల్లో వివిధ సంఘాల ప్రమేయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

  పంచాయతీ రాజ్ సంస్థలకోసం, మేఘాలయకు 2020-21వ సంవత్సరంలో 182కోట్ల రూపాయలను 15 ఆర్థిక సంఘం గ్రాంటుగా కేటాయించారు. ఈ నిధుల్లో 50శాతాన్ని నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించవలసి ఉందని కేంద్రమంత్రి సూచించారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ పథకం కింద ఇచ్చిన నిధులను మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం పనులకు ఉపయోగించవలసి ఉందన్నారు.

  కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో,..ప్రజలు తాగునీటి కోసం పబ్లిక్  కొళాయిల దగ్గర గుమికూడకుండా చూడవలసిన అవసరం ఉందని, ఇందుకోసం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కొళాయిల ఏర్పాటు పనులను సత్వరం చేపట్టాలని, తద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేందుకు వీలుంటుందని  మేఘాలయ ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి సూచించారు. నీటి సరఫరా పనుల ద్వారా స్థానికులు, వలస కూలీలు ఉపాధి పొందేందుకు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలం పుంజుకునేందుకు వీలుంటుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

   రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్లు కల్పించే కార్యక్రమం 2022వ సంవత్సరం డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా తాము సంపూర్ణమైన తోడ్పాటు అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి మేఘాలయ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. జలజీవన్ పథకం పనుల ప్రణాళిక, అమలుపై మేఘాలయ ముఖ్యమంత్రితో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాలని తాను ఆశిస్తున్నట్టు కేంద్రమంత్రి తన లేఖలో తెలిపారు.  

*****



(Release ID: 1630443) Visitor Counter : 204