నీతి ఆయోగ్

ఆన్‌లైన్‌ వివాదాల పరిష్కార వేదిక వేగవంతం

నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ సమావేశం
వివాదాలను తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా పరిష్కరించనున్న ఓడీఆర్‌
దేశానికి ఓడీఆర్‌ అందించే అవకాశాన్ని గుర్తించిన ప్రారంభ సమావేశం

Posted On: 07 JUN 2020 7:27PM by PIB Hyderabad

దేశంలో ఆన్‌లైన్‌ వివాదాల పరిష్కారాల వేగవంతం కోసం అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం.., అగామి, ఓమిద్యార్‌ నెట్‌వర్క్‌ ఇండియా సహకారంతో, సంబంధిత వర్గాలతో జూన్‌ 6వ తేదీన వర్చువల్‌ సమావేశాన్ని నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసింది.

    ఓడీఆర్‌ అనేది ఆన్‌లైన్‌ వివాదాల పరిష్కార విధానం. చిన్న, మధ్యస్థ విలువైన కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరిస్తుంది. న్యాయస్థానాలన్నీ డిజిటలైజ్‌ అవుతున్నప్పటికీ.., మరింత ప్రభావవంతమైన, సహకార విధానాల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, వివాదాలను తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా ఓడీఆర్‌ పరిష్కరిస్తుంది.

    ఆన్‌లైన్‌ వివాదాలను పరిష్కరంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భరోసా ఇచ్చేలా, సంబంధిత వర్గాలు కలిసి పనిచేసే ఒప్పందమే ఈ సమావేశ కారణం.

    సహకార ప్రయత్నాలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయం కోసం సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేందుకు దోహదపడుతుందని స్వాగత ప్రసంగంలో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

    కేసులను చూసే దృక్కోణంలో మార్పు అవసరమని, వివాద పరిష్కారాలను ఒక స్థలానికో, న్యాయస్థానానికో పరిమితం చేయకూడదని, ప్రయోజనం పొందే సేవగా చూడాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

    ఓడీఆర్‌ ద్వారా మొదటగా కొవిడ్‌ సంబంధిత కేసులను పరిష్కరిద్దామని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం ఇది ముఖ్యమన్నారు.

    వివాదల పరిష్కారంలో ఓడిఆర్‌ను ఐచ్ఛికం చేస్తే లక్ష్యం నెరవేరదని, కొన్ని ప్రత్యేక సందర్భాలలో దానిని తప్పనిసరి చేయాలని జస్టిస్‌ ఇందు మల్హోత్ర చెప్పారు. దీనివల్ల ఇదొక నామమాత్ర ప్రక్రియగా కక్షిదారులు భావించరన్నారు. 

    ఓడీఆర్‌తో సౌకర్యవంతం, కచ్చితత్వం ఉండడంతోపాటు, సమయం, డబ్బు ఆదా అవుతాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి వివరించారు.
    
    ఆన్‌లైన్‌ పరిష్కారాలు వివిధ పరిశ్రమలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరడానికి, ప్రజాసంఘాలకు మద్దతు ఇవ్వడానికి ప్రైవేటు ఓడీఆర్‌, ఏడీఆర్‌ ప్రొవైడర్లు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయ కార్యదర్శి అనూప్‌ కుమార్‌ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విశాల దృక్పథంతో ఉందన్నారు. ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని, ఓడీఆర్‌ ప్రపంచస్థాయి మార్గదర్శకుడు కొలిన్‌ రూల్‌, అగామీ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ మల్హన్‌ కూడా ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

    భారతదేశానికి ఓడీఆర్‌ అందించే అవకాశాన్ని ఈ ప్రారంభ సమావేశం గుర్తించింది. దీనిని సాధించేందుకు, రాబోయే వారాల్లో సంబంధిత వర్గాలతో మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. వివిధ కోణాల్లో న్యాయ తీర్పుల పరివర్తన కోసం స్థిరమైన సమర్థవంతమైన, సహకార విధానంలో కసరత్తులు జరగనున్నాయి.


(Release ID: 1630117) Visitor Counter : 341