పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ సిరీస్ లో భాగంగా భారత్ లో గాల్ఫ్ టూరిజం అవకాశాలమీద 28వ వెబినార్

Posted On: 05 JUN 2020 5:00PM by PIB Hyderabad

దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ లో భాగంగా భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ " భారత్- గాల్ఫర్ల స్వర్గం" పేరిట జూన్ 4న 28వ వెబినార్
నిర్వహించింది. భారత్ లోని అందమైన సుదూర ప్రాంతాల్లో ఏడాది పొడవునా, 365 రోజులూ గాల్ఫింగ్ పంచే ఆహ్లాదాన్ని ఇది ఆవిష్కరించింది. దేస, విదేశాల గాల్ఫ్ ప్రియులు అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించగలిగే ఆస్కారం ఉన్న విషయాన్ని ఇది హృదయానికి హత్తుకునేలా వివరించింది. ఈ సెషన్ కు పర్యాటక మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపిందర్ బ్రార్ మోడరేటర్ గా వ్యవహరించగా పాషనల్స్ సంస్థ సహ వ్యవస్థాపకులు రాజన్ సెహగల్, బెలీస్ట్ ట్రావెల్స్ డైరెక్టర్ అమిష్ దేశాయ్, మై గాల్ఫ్ టూర్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ అయ్యర్ పత్రాలు సమర్పించారు. పానెలిస్టులు ముగ్గురూ పర్యాటక పరిశ్రమలో దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నవారే కాక గాల్ఫ్ ఆటగాళ్ళు కూడా. వీరు గాల్ఫ్ టురిజం ను ప్రోత్సహించటంలో, మద్దతునివ్వటంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కింద భారతదేశపు సుసంపన్నమైన  వైవిధ్యాన్ని చూపటంలో  దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ తగిన పాత్ర పోషిస్తోంది. అది వర్చువల్ ప్లాట్ ఫామ్స్ లో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని అవిచ్ఛిన్నంగా ప్రచారం చేస్తోంది.
 
మోడరేటర్ గా వ్యవహరించిన శ్రీమతి బ్రార్ ఈ ప్రజెంటేషన్ ప్రారంభంలో మాట్లాడుతూ, గాల్ఫ్ లాంటి క్రీడ వలన మనిషిలో ఉండే మానసిక వత్తిడి బాగా తగ్గిపోయి ఉల్లాసం కలుగుతుందన్నారు. మొదటి ఉపన్యాసకుడు శ్రీ రాజన్ సెహగల్ కు స్వాగతం పలికి పరిచయం చేస్తూ, ఉత్తరాదిన ఉన్న అనేక గాల్ఫింగ్ కోర్సులను ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళిన ఘనత ఆయనదేనన్నారు. ఒక సర్వే ప్రకారం ఒక గాల్ఫర్ మామూలు టూరిస్ట్ కంటే అదనంగా  40-45%  సమయం గడుపుతాడని, ఏడాదిలో 2-3  గాల్ఫింగ్ సెలవులు తీసుకుంటాడని  తేలింది. ముఖ్యంగా భారత్ లో గాల్ఫ్ టూరిజం కు అవకాశాలు బలంగా ఉన్నాయని, చాలా దేశాలతో పోల్చుకున్నపుడు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుందని శ్రీ రాజన్ చెప్పారు.  
పైగా, దేశంలో అందమైన ప్రకృతి, అసాధారణమైన ఆతిథ్య సేవలు కూడా గాల్ఫ్ టూరిజం అనుభూతిని పెంచటానికి దోహదపడ్డాయన్నారు.

ఉత్తరాది ప్రాంతంలోని గాల్ఫ్ కోర్సులలో శ్రీనగర్ లోని రాయల్ స్ప్రింగ్స్ గాల్ఫ్ కోర్స్, పహల్గామ్ లోని లిడ్డర్ వాలీ గాల్ఫ్ కోర్స్, జమ్మూతావి లోని గుల్మార్గ్ గాల్ఫ్ కోర్స్, చండీగఢ్  గాల్ఫ్ కోర్స్, పంచ్ కుల గాల్ఫ్ కోర్స్ ఉన్నాయి.

ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ లో ఢిల్లీ గాల్ఫ్ కోర్స్, కుతుబ్ గాల్ఫ్ కోర్స్, జేపీ గాల్ఫ్ కోర్స్, డి ఎల్ ఎఫ్ గాల్ఫ్ కోర్స్, ఐటిసి క్లాసిక్ గాల్ఫ్ కోర్స్, తారుధన గాల్ఫ్ కోర్స్, కర్మా లేక్ లాండ్ గాల్ఫ్ కోర్స్ ఉన్నాయి. ఢిల్లీ గాల్ఫ్ కోర్స్, కుతుబ్ గాల్ఫ్ కోర్స్ పబ్లిక్ కొర్సులు కాగా జేపీ గాల్ఫ్ కోర్స్, డి ఎల్ ఎఫ్ గాల్ఫ్ కోర్సులలో స్పాలు, రిసార్టులు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, నివాస వసతి లాంటి రకరకాల సౌకర్యాలున్నాయి.

ఆగ్రా గాల్ఫ్ కోర్సు అభివృద్ధికి ఎన్నో అవకాశాలుండగా దానిమీద ఎక్కువ శ్రద్ధపెట్టి స్థాయి పెంచాల్సిన అవసరముంది.

ఆ తరువాత సెషన్ ను శ్రీ అరుణ్ అయ్యర్ చేపట్టారు.  పశ్చిమ, తూర్పు ప్రాంతాల గాల్ఫ్ కోర్సులమీద ఆయన దృష్టి సారించారు. ఆయన తొలి ఎంపిక మహారాష్ట్రలోని బాంబే ప్రెసిడెన్సీ గాల్ఫ్ కోర్స్. ఆ తరువాత ముంబై లోని విల్లింగ్టన్ స్పోర్ట్స్ క్లబ్, ఖర్గర్ వాలీ గాల్ఫ్ కోర్స్.  ఇవి ముంబై నగరం మధ్యలో ఉన్నాయి. కానీ, నగరపు రణగొణ ధ్వనులనుండి తప్పించుకోవటానికి ఇక్కడికొస్తారు. మిగిలిన గాల్ఫ్ కోర్సులలో లోనావాలా సమీపంలోని ఆంబీ వ్యాలీ గాల్ఫ్ కోర్స్ లో రాత్రిపూట ఆడే సౌకర్యం ఉంది. ఆ తరువాత పూణే లోయ సమీపంలో ఉన్న పూణే గాల్ఫ్ కోర్స్, ఆక్స్ ఫర్డ్ గాల్ఫ్ కోర్స్ కూడా ముఖ్యమైనవే. వాటి ప్రాముఖ్యం వాటిదే.

శ్రీ అయ్యర్ ప్రస్తావించిన మరోచోటు ... వేగంగా ఎదుగుతున్న అహమ్మదాబాద్ నగరం. అక్కడ కొత్త గాల్ఫ్ కోర్సులు వస్తూ ఉన్నాయి. కల్హార్ బ్లూస్ అండ్ గ్రీన్స్, కెన్స్ విల్లీ గాల్ఫ్ రిసార్ట్, గుల్మొహర్ గ్రీన్ గాల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్, గ్లేడ్ వన్ అండ్ ది బెల్వెడార్ గాల్ఫ్ కోర్స్ అందులో ఉన్నాయి. గుజరాత్ లోని ది గైక్వాడ్ బరోడా హెరిటేజ్ గాల్ఫ్ క్లబ్ మధ్యలో ఉన్న లక్ష్మీ విలాస్ పాలెస్ నిజానికి బకింగ్ హామ్ పాలెస్ కు నాలుగురెట్లు పెద్దది.

కోల్ కతా, ఈశాన్య భారతంలో కూడా చాలా గాల్ఫ్ కోర్సులున్నాయి. టాలీ గంజ్ గాల్ఫ్ కోర్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రిటిష్ దీవులకు వెలుపల నిర్మించిన మొదటి గాల్ఫ్ కోర్స్ గా పేరుపొందిన రాయల్ కలకత్తా గాల్ఫ్ క్లబ్, కజిరంగా గాల్ఫ్ కోర్స్, దిగ్బాయ్ గాల్ఫ్ కోర్స్, మేఘాలయలోని అనేక ఇతర గాల్ఫ్ కోర్సులు కూడా హిమాలయ పాదాల చెంతకు వచ్చి  అందాన్ని ఆస్వాదించే వారికి అనువుగా ఉంటాయి.

ఈ సెషన్ ఆఖరి భాగం శ్రీ అమిష్ దేశాయ్ తీసుకున్నారు. ఆయన ప్రేక్షకులను అందమైన దక్షిణాది గాల్ఫ్ కోర్సులకు తీసుకు వెళ్ళారు. అక్కడి ప్రతి గాల్ఫ్ కోర్సునూ ఆసక్తికరమైన వాస్తవాలతో గుదిగుచ్చి వర్ణించారు. గాల్ఫ్ టూరిజం కేవలం గాల్ఫ్ ఆడే వాళ్ళకే పరిమితం కాదని, గాల్ఫ్ సెలవులలో సకుటుంబంగా వచ్చి ఆనందించటానికి కూడా ఉపయోగపడుతుందని    అది గాల్ఫ్ సెలవులుగా పేరు తెచ్చుకుంటుందని చెప్పారు.

దక్షిణాది గాల్ఫ్ కోర్సులలో హైదరాబాద్ గాల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గాల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ తెలంగాణవి. తమిళనాడులో కూడా ప్రముఖ గాల్ఫ్ కోర్సులున్నాయి. మద్రాస్ జింఖానా క్లబ్, కాస్మొపాలిటన్ క్లబ్ గాల్ఫ్  కోర్స్ చెన్నైలో ఉండగా కోయంబత్తూర్ లోని గాల్ఫ్ కోర్స్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. కోయంబత్తూర్ లోని మరో గాల్ఫ్ కోర్స్ పేరు కోవై గాల్ఫ్ క్లబ్, ఇది పశ్చిమ కనుమల పాదాల చెంత సువిశాలమైన భూమిలో విస్తరించి ఉంటుంది.

కేరళలోని కొచ్చి లో సియాల్ గాల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో గాల్ఫ్ ప్రేమికులను ఆకట్టుకుంటూ ఉంది. కొచ్చి నుంచి నాలుగు గంటలు ప్రయాణిస్తే వచ్చే మున్నార్ చుట్టూ తేయాకు తోటలు, జలపాతాలు, జాతీయపార్కులు ఉండగా  అక్కడే హై రేంజ్ క్లబ్, కుండేల్ గాల్ఫ్ క్లబ్ బాగా పేరుపొందాయి.

ఈ నాలుగు గంటల సెషన్ లో ఆఖరుగా శ్రీ దేశాయ్ ఎంచుకున్నది కర్నాటక రాష్ట్రం. ఈ రాష్ట్ర రాజధాని బెంగళురు దక్షిణభారత గాల్ఫ్ రాజధానిగా పేరుతెచ్చుకుంది. అందులో ముఖ్యంగా కర్నాటక గాల్ఫ్ అసోసియేషన్, ఈగిల్టన్ గాల్ఫ్ కోర్స్, ప్రెస్టిజ్ గాల్ఫ్ షైర్ క్లబ్, జియాన్ హిల్స్ గాల్ఫ్ కంట్రీ, బెంగళూర్ నగరం నడిబొడ్డున ఉన్న బెంగళూర్ గాల్ఫ్ క్లబ్  చాలా కీలకమైనవి. ఇందులో బెంగళూర్ గాల్ఫ్ క్లబ్ దేశంలో అతిపురాతన గాల్ఫ్ క్లబ్స్ లో రెండోది.

కర్నాటకలోని మిగిలిన గాల్ఫ్ కోర్సుల్లో చిక్ మగళూర్ గాల్ఫ్ క్లబ్ అక్కడి కాఫీతోటల సువాసనకు పెట్టిందిపేరు. అదే విధంగా మెర్కరా డౌన్స్ గాల్ఫ్ కోర్స్, కూర్గ్ లోని ఖరీదైన  కూర్గ్ గాల్ఫ్ లింక్స్ కూడా ప్రసిద్ధి పొందాయి. మైసూర్ పాలెస్ తో పేరు మోసిన నగరంలో సాంస్కృతిక సంపదకు ఎంతో ప్రాముఖ్యముండగా అక్కడి జయ చామరాజా ఉడయార్ గాల్ఫ్ క్లబ్ కూడా పేరుమోసింది.

2020 ఏప్రిల్ 14 న మొదలైన దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ ఇప్పటిదాకా 28 సెషన్స్ నడిపింది. అందులో దేశవ్యాప్తంగా ఉన్న  వివిధ  టూరిజం ప్రదేశాలు తదితర అంశాలను పరిచయం చేస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి.

సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక  వారసత్వ సంపదను, ఆచారాలను, సంప్రదాయాలను పరిచయం చేయటం ఈ వెబినార్ సిరీస్ లక్ష్యం. భారతదేశ వైవిధ్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ విధంగా దేశ సమగ్రతకు, సమైక్యతకు, రాష్ట్రాల మధ్య బంధం బలపడటానికి బలమైన పునాదులు పడతాయి.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ రూపొందించిన నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ కీలక సహకారంతో దేఖో అప్నా దేశ్ వెబినార్స్ నిర్వహిస్తున్నారు. వృత్తినైపుణ్యం ఉన్న బృందం ప్రత్యక్ష సహకారంతో ఈ వెబినార్స్ చేపట్టటం ద్వారా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఏర్పడింది. డిజిటల్ వేదికలు ఉపయోగించుకున్వారందరికీ ఇదొక సదవకాశంగా మారింది.

వెబినార్ సెషన్స్ ఇప్పుడు https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured తో బాటు భారత ప్రభుత్వ టూరిజం మంత్రిత్వశాఖ వారి సోషల్ మీడియా హండిల్స్ అన్నిటిలో కూడా అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వెబినార్ 2020 జూన్ 6న " మధ్యప్రదేశ్ వన్యమృగ అద్భుతాలు" అనే అంశం మీద ఉంటుంది.  
 https://bit.ly/WildwondersDAD లో రిజిస్టర్ చేసుకోవచ్చు

***



(Release ID: 1629776) Visitor Counter : 176