శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సిఎస్ ఐఆర్‌- సిఎంఇఆర్ ఐ ఆధ్వ‌ర్యంలో దేశీయ వెంటిలేట‌ర్ త‌యారీ

Posted On: 03 JUN 2020 8:45PM by PIB Hyderabad

దుర్గాపూర్ కు చెందిన మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కేంద్ర ప‌రిశోధ‌నా సంస్థ ( సిఎంఇఆర్ ఐ) దేశీయ వెంటిలేట‌ర్ ను త‌యారు చేసింది. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలోఈ దేశీయ వెంటిలేట‌ర్ తయారీ ఊర‌ట క‌లిగిస్తోంది. సిఎస్ ఐ ఆర్ - సిఎం ఇ ఆర్ ఐ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రీష్ హిరానీ, హెల్త్ వ‌ర‌ల్డ్ ఆసుప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ అండ్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ అరుణానంగ్షు గంగూలీ స‌మ‌క్షంలో దేశీయ వెంటిలేట‌ర్‌ను ప్రారంభించారు. 
ఆరోగ్య‌రంగ నిపుణుల సూచ‌న‌లు స‌ల‌హాల‌మేర‌కు, త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో వ‌చ్చే విధంగా ఈ వెంటిలేట‌ర్ ను త‌యారు చేసిన‌ట్టు ప్రొఫెస‌ర్ హిరాణీ తెలిపారు. దీని ధ‌ర రూ. 80 వేల‌నుంచి 90 వేల రూపాయ‌ల వ‌ర‌కూ వుంటుంద‌ని అన్నారు. 
రోగి ఆరోగ్య ప‌‌రిస్థితికి అనుగుణంగా కూడా ఈ వెంటిలేట‌ర్ స్పందిస్తుంద‌ని ఇందుకోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సామ‌ర్థ్యాల‌ను కూడా వాడుకున్నామ‌ని ప్రొఫెస‌ర్ హిరాణీ తెలిపారు. 
ఈ దేశీయ వెంటిలేట‌ర్ భార‌త‌దేశ వెంటిలేట‌ర్ సామ‌ర్థ్యానికి సంబంధించిన విష‌యాల్లో విప్ల‌వాత్మ‌క‌మార్పు అని డాక్ట‌ర్ అరుణానంగ్షు గంగూలీ అన్నారు. భారీగా డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేసి విదేశాల‌నుంచి వెంటిలేట‌ర్ల‌ను తెప్పించుకుంటున్నామ‌ని ఇక ముంద ఈ ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. 
ప‌లు ప‌రిశ్ర‌మ‌ల్లో దేశీయంగా త‌యార‌య్యే ప‌రిక‌రాల‌ను తెప్పించి ఈ వెంటిలేట‌ర్ ను తయారు చేశారు. ఈ వెంటిలేట‌ర్ ను భారీ‌స్థాయిలో ఉత్ప‌త్తి చేయడం మొద‌ల‌యితే అనేక ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇది స‌హ‌కారిగా వుంటుంది. అంతే కాకుండా దీని ధ‌ర త‌క్కువ‌గా వుండ‌డంవ‌ల్ల ఆర్ధికంగా వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌ రోగుల‌కు దీని ద్వారా మేలు జ‌రగ‌డ‌మే కాకుండా ప్ర‌భుత్వ రంగంలోని ఆరోగ్య రంగ ప‌థ‌కాల‌కు ఇది ల‌బ్ధి చేకూరుస్తుంది. దీన్ని త్వ‌ర‌లోనే వాణిజ్య‌ప‌రంగా మార్కెట్లోకి తెస్తామ‌ని దీనికి సంబంధించి ప‌లు సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని ప్రొఫెస‌ర్ హిరాణీ తెలిపారు. 
ఈ దేశీయ వెంటిలేట‌ర్ త‌యారీకోసం కృషి చేసిన డాక్ట‌ర్ అనుప‌మ్ సిన్హా, సంజ‌య్, క‌ళ్యాణ్ ఛ‌ట‌ర్జీ, అవినాష్ యాద‌వ్ బృందాన్ని ప్రొఫెస‌ర్ హిరాణీ అభినందించారు. 

 

****


(Release ID: 1629333) Visitor Counter : 276