నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పీఎం-కుసుమ్ పథకంలో నమోదు విషయమై వెలుగులోకి వచ్చిన మోసపూరిత వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా అడ్వైజరీని జారీ చేసిన ఎంఎన్ఆర్ఈ
Posted On:
03 JUN 2020 2:38PM by PIB Hyderabad
'ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఎవామ్ ఉత్తాన్ మహాబియాన్' (పీఎం-కుసుమ్) పథకం నమోదు పోర్టల్‌గా కొన్ని కొత్త నకిలీ వెబ్‌సైట్లు వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఇటీవల గుర్తించింది. ఇలాంటి వెబ్‌సైట్లు సాధారణ ప్రజలను మోసగించగలవని.. మరియు నకిలీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా సంగ్రహించిన డేటా దుర్వినియోగమయ్యే అవకాశమూ ఉందనీ ఎంఎన్ఆర్ఈ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండటానికి, ఎంఎన్ఆర్ఈ 18.03.2019 రోజున ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో లబ్ధిదారులు మరియు సాధారణ ప్రజలు వెబ్‌సైట్లలో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును జమ చేయకూడదని, వెబ్‌సైట్లలో వారి డేటాను పంచుకోవద్దని సలహా ఇచ్చింది. అయిప్పటికీ ఇటీవల కొన్ని కొత్త మోసపూరిత వెబ్‌సైట్ కేసులు వెలుగులోకి వస్తుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సంభావ్య లబ్ధిదారులు.. ఇతర సాధారణ ప్రజలందరికీ ఎంఎన్ఆర్ఈ తాజాగా కొత్త సూచనలు చేసింది. ఈ తరహ నకిలీ వెబ్‌సైట్లను నమ్మి ఎవ్వరూ డబ్బు జమ చేయకూడదని, తమ సమాచారాన్నీ పంచుకోవద్దని సూచించింది. దీనికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద మోస పూరిత వెబ్‌సైట్‌ను ఎవరైనా గుర్తించినట్లయితే సదరు వివరాలను తమకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. పీఎం-కుసుమ్ పథకానికి గాను 08.03.2019న కేంద్రం పరిపాలనా ఆమోదాన్ని జారీ చేసింది. పథకం అమలుకు సంబంధించిన నిర్దిష్ట మార్గదర్శకాల్ని ఎంఎన్ఆర్ఈ శాఖ 22.07.2019 న జారీ చేసింది. ఈ కొత్త పథకం సౌర విద్యుత్ పంపుల సంస్థాపన, ఇప్పటికే ఉన్న గ్రిడ్‌నకు అనుసంధానించబడిన వ్యవసాయ పంపుల సోలారైజేషన్‌తో పాటుగా విద్యుత్తు గ్రిడ్ అనుసంధాన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి సేవల్ని అందిస్తుంది. ఈ పథకాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అమలు చేస్తున్నారు. ఈ ఏజెన్సీల జాబితా, అమలు మార్గదర్శకాలు మరియు పథకం గురించి ఇతర వివరాలు మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్ www.mnre.gov.in లో అందుబాటులో ఉన్నాయి. సాధారణ ప్రజలలో ఆసక్తి ఉన్నవారు ఎంఎన్ఆర్ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్ 1800-180-3333 కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
(Release ID: 1628986)