ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
Posted On:
02 JUN 2020 9:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజుటెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. గ్రూప్ ఆఫ్ 7 కు అమెరికా అధ్యక్షత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అలాగే గ్రూప్ ఆఫ్ 7 దేశాల కూటమిని ప్రస్తుత సభ్యదేశాలనుంచి ఇంకా విస్తరించాలన్న తన ఆకాంక్షను ఆయన తెలియజేశారు. ఇందులో ఇండియాతో సహా పలు ఇతర ముఖ్యమైన దేశాలకు సభ్యత్వం గురించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన , అమెరికాలో జరగనున్న తదుపరి జి-7 దేశాల సదస్సుకు హాజరుకావలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
కోవిడ్ అనంతర ప్రపంచంలో ఏర్పడబోయే వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విస్తారిత వేదిక ఉండాలన్న వాస్తవాన్ని గుర్తిస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృజనాత్మక , దూరదృష్టితో కూడిన వైఖరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. అమెరికా , ఇతర దేశాలతో కలసి ప్రతిపాదిత సదస్సు విజయానికి కృషిచేయడం ఇండియాకు సంతోషం కలిగించే అంశమని ప్రధానమంత్రి చెప్పారు.
అమెరికాలో జరుగుతున్న పౌర ఆందోళనలపై ప్రధానమంత్రి తన ఆందోళన వ్యక్తం చేస్తూ , పరిస్థితి త్వరలోనే సద్దుమణగగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇరువురు నాయకులూ ఉభయ దేశాలలో కోవిడ్ -19 పరిస్థితులు, ఇండియా-చైనా సరిహద్దుల లో పరిస్థితి,ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల ఆవశ్యకత వంటి పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను భారతదేశంలో జరిపిన పర్యటన విశేషాలను గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటన ఎన్నో రకాలుగా చరిత్రాత్మకం, చిరస్మరణీయమని, ఈ పర్యటన ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపును తీసుకువచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఇరువురు నాయకుల మధ్య అద్భుతమైన ఆదరాభిమానాలతో సాగిన ఈ సంభాషణ ,భారత- అమెరికా సంబంధాల ప్రత్యేక స్వభావాన్ని, ఇరువురు నాయకుల మధ్య గల స్నేహం పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
(Release ID: 1628835)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam