ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ ఆలస్య రుసుము అంశంపై తదుపరి సమావేశంలోచర్చించనున్న జీఎస్టీ కౌన్సిల్
ఆగస్టు 2017 నుంచి జనవరి 2020 మధ్య కాలానికి ఆలస్య రుసుముపై చర్చ
ట్వీట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఆలస్య రుసుము సమస్య
Posted On:
01 JUN 2020 8:09PM by PIB Hyderabad
జీఎస్టీఆర్ 3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే విధించే ఆలస్య రుసుము మాఫీపై, అనేక ట్వీట్లు ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వస్తువులు&సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రారంభం నుంచి, అంటే ఆగస్టు 2017 నుంచి దాఖలు చేయాల్సిన రిటర్నులపై ఆలస్య రుసుము మాఫీ చేయాలంటూ డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు సాయం చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల జీఎస్టీ దాఖలు గడువును జూన్ వరకు పెంచారు. ఈ కాలానికి ఆలస్య రుసుము వసూలు చేయరు.
ఆగస్టు 2017 నుంచి జనవరి 2020 మధ్యకాలానికి దాఖలు చేయని రిటర్నులపై ఆలస్య రుసుమును రద్దు చేయాలని ప్రస్తుతం అభ్యర్థనలు వస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు దాఖలు చేయడానికి, కొనుగోలుదారుల నుంచి వసూలుచేసిన మొత్తంపై పన్నులు, ప్రభుత్వానికి బకాయిలను చెల్లించేలా చూడటానికి ఆలస్య రుసుము విధిస్తారు. పన్ను చెల్లింపుదారుల్లో క్రమశిక్షణ ఉండేలా చూసే ప్రక్రియ ఇది. ఇలాంటి నిబంధన లేకపోతే, నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులు వివక్షకు గురవుతారు.
జీఎస్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు, జీఎస్టీ కౌన్సిల్ ఆమోదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, ఆలస్య రుసుము అంశంపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు.
(Release ID: 1628542)
Visitor Counter : 253