కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈపీఎఫ్ఓ పింఛ‌నుదారుల‌కు మ‌రింత మెరుగైన‌ పింఛ‌ను

Posted On: 01 JUN 2020 3:42PM by PIB Hyderabad

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) రూ.868 కోట్ల విలువైన పింఛ‌న్ల‌ను విడుదల‌ చేసింది. క‌మ్యూటెడ్ వాల్యూ పింఛ‌ను విధా‌నాన్ని పున‌రుద్ధ‌రించ‌డం వ‌ల్ల ఏర్ప‌డిన బకాయిల సొమ్ము రూ. 105 కోట్లు కూడా ఇందులో క‌లిసి ఉన్నాయి.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (ఈపీఎఫ్ఓ) సిఫారసు మేరకు కార్మికుల దీర్ఘకాల డిమాండ్లలో ఒక‌టైన క‌మ్యూటెడ్ వాల్యూ పింఛ‌ను విధా‌నం పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌న స‌మ్మ‌తి తెలిపింది. అంతకుముందు క‌మ్యూటెడ్ వాల్యూ పింఛ‌ను విధానం పునరుద్ధరణకు ఎటువంటి ఏర్ప‌ట్లు లేవు. జీవిత కాలపు క‌మ్యూటేష‌న్ కార‌ణంగా పింఛ‌న‌ర్లకు త‌గ్గించిన పింఛ‌న్ల‌ను పొందుతూ వ‌స్తున్నారు. ఈపీఎస్-95 కింద పింఛనుదారులకు ప్రయోజనం చేకూర్చే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం తీసు‌కున్న తాజా నిర్ణ‌యం ఒక చారిత్రక అడుగు. ఈపీఎఫ్‌వో దేశ వ్యాప్తంగా తన 135 ప్రాంతీయ కార్యాలయాల ద్వారా 65 లక్షలకు పైగా పింఛనుదారులను కలిగి ఉంది. కోవిడ్-19 వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యాన విధించిన లాక్‌డౌన్ స‌మ‌యంలో ఖాతాదారులైన ఉద్యోగుల‌కు అరంత‌రాయంగా సేవ‌లందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు, సిబ్బంది ప‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొని ముందుకు సాగారు. పింఛనర్ల బ్యాంక్ ఖాతాలో నిర్ధారిత షెడ్యూల్ ప్రకారం మే మాస‌పు పింఛ‌ను జ‌మ చేసేలా  ఈపీఎఫ్ఓ అధికారులు, సిబ్బంది విశేషంగా కృషి చేశారు. 


(Release ID: 1628373) Visitor Counter : 269