రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు కానున్న క్షిపణి పార్కు 'అగ్నిప్రస్థ'

ఐఎన్‌ఎస్‌ కళింగ క్షిపణి చరిత్రను గుర్తు చేయడం పార్కు ఉద్దేశం
పార్కులో క్షిపణులు, క్షేత్రస్థాయి సహాయక సామగ్రి ప్రతిరూపాల ప్రదర్శన

Posted On: 29 MAY 2020 4:04PM by PIB Hyderabad

విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ కళింగలో క్షిపణి పార్క్ 'అగ్నిప్రస్థ' ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఐఎన్‌ఎస్‌ కళింగ కమాండింగ్‌ ఆఫీసర్‌ Cmde రాజేష్‌ దేబ్‌నాథ్‌ క్షిపణి పార్కుకు శంకుస్థాపన చేశారు. వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌, ఇతర నావికాదళ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అగ్నిప్రస్థ పార్కు నిర్మాణం పూర్తయితే.., 1981లో ఐఎన్‌ఎస్‌ కళింగను స్థాపించిప్పటి నుంచి ఇందులో పనిచేసిన అధికారులు, నావికులు, ఇతర సహాయక సిబ్బందికి దీనిని అంకితమిస్తారు. 2018-19 సంవత్సరానికి, ప్రతిష్టాత్మక "యూనిట్ సైటేషన్" అవార్డును ఐఎన్ఎస్ కళింగ దక్కించుకుంది. ప్రస్తుతం ఏర్పాటు కానున్న క్షిపణి పార్కు ఆ ఘనతకు గుర్తుగా నిలుస్తుంది.

    1981 నుంచి ఇప్పటివరకు ఐఎన్‌ఎస్‌ కళింగ క్షిపణి చరిత్రను గుర్తు చేయడం అగ్నిప్రస్థ పార్కు స్థాపన ఉద్దేశం. క్షిపణులు, క్షేత్రస్థాయి సహాయక సామగ్రి (జీఎస్‌ఈ) నకళ్లను ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. ఐఎన్‌ఎస్‌ కళింగ చేపట్టిన మిసైల్‌ కార్యక్రమాల చరిత్రను ఇవి తెలుపుతాయి. ఇక్కడ ప్రదర్శించే ప్రతిరూపాలను తుక్కు నుంచి తయారు చేశారు. P-70 అమెటిస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇది సముద్ర గర్భం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణి. 1988-91 వరకు సేవలు అందించిన పాత 'చక్ర' (చార్లీ-1 జలాంతర్గామి) అమ్ములపొదిలోనిది.

    క్షిపణులు, వాటి సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధన ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థుల నుంచి నావికాదళ సిబ్బంది, వారి కుటుంబాల వరకు అందరినీ ఉత్తేజపరిచేందుకు అగ్నిప్రస్థ పార్కు వేదిక అవుతుంది. యాజమాన్యం, గర్వకారణ భావాలను యూనిట్‌లో ప్రేరేపించడం కూడా దీని ఉద్దేశం. ఆయుధాల లభ్యత, విశ్వసనీయత, గడువులోగా ఆయుధాలను అందించడం వంటి అంశాల్లో... ర్యాంకు, విభాగంతో సంబంధం లేకుండా మొత్తం సిబ్బంది సహకార అవసరాన్ని ఈ పార్కు తెలుపుతుంది.
 


(Release ID: 1627765) Visitor Counter : 238