విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అంఫన్ తుఫాను తర్వాత విద్యుత్ రంగ మౌలికసదుపాయాల పునరుద్ధరణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన - విద్యుత్ శాఖ మంత్రి
प्रविष्टि तिथि:
25 MAY 2020 6:30PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో అంఫన్ తుఫాను తర్వాత విద్యుత్ రంగ మౌలికసదుపాయాల పునరుద్ధరణ పనుల పురోగతిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో - పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన కార్యదర్శి; ఒడిశా, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి; వివిధ డిస్కోమ్ ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు; భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ కార్యదర్శి; భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి; పవర్ గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సింగ్ మాట్లాడుతూ, ఈ తుఫాను వల్ల విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిందనీ, అయితే, పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు కూడా తమ మానవ వనరులను తరలించడం ద్వారా సహాయాన్ని అందించాయని ఆయన చెప్పారు. ఈరోజు సాయంత్రానికల్లా ఒడిశాలో పునరుద్ధరణ పూర్తవుతుందనీ, అయితే, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ లోని మరికొన్ని జిల్లాల్లో పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న మానవశక్తి సహాయంతో పాటు, ఎన్‌టిపిసి మరియు పవర్‌గ్రిడ్ ద్వారా అదనపు మానవశక్తిని సమీకరించి, వారిని పునరుద్ధరణ పనుల్లో సహకరించే విధంగా, పశ్చిమ బెంగాల్ విద్యుత్ శాఖకు అందుబాటులో ఉంచాలని మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు. అప్పుడు, వారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి, వారికి అవసరమైన సహాయం అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పెను తుఫాను అంఫన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పరిస్థితిని పునరుద్ధరించడానికి అవసరమైన ఏర్పాట్లు / సంసిద్ధత ఉందని గత మంగళవారం విద్యుత్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. భువనేశ్వర్, కోల్‌కతాలలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములను పి.జి.సి.ఐ.ఎల్. మరియు ఎన్. టి.పి.సి. ఏర్పాటు చేశాయి. అలాగే, మానెసర్ లో ఉన్న పి.జి.సి.ఐ.ఎల్. ప్రధాన కార్యాలయం వద్ద కూడా పి.జి.సి.ఐ.ఎల్. 24 గంటలు పనిచేసే ఒక కంట్రోల్ రూము ను ఏర్పాటు చేసింది. తుఫాను కారణంగా రాష్ట్రాల విద్యుత్ సరఫరా లైన్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలకు నష్టం జరిగి ఉంటే రాష్ట్ర విద్యుత్ వినియోగాలకు అవసరమైన పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ఏదైనా ప్రసార టవర్ కూలిపోయినా, ప్రసార లైన్లు దెబ్బతిన్నా ఉపయోగించడానికి వీలుగా, అవసరమైన సిబ్బందితో సహా, ముఖ్యమైన ప్రదేశాలలో 56 అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థలు - ఈ.ఆర్.ఎస్. - లను (400 కిలోవాట్ వద్ద 32 మరియు 765 కిలోవాట్ వద్ద 24) ఇప్పటికే తగిన కీలక ప్రదేశాలలో ఉంచడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1626861)
आगंतुक पटल : 252