రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్రజల ఇబ్బందులు తొలగించేలా కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ వాహన కార్యకలాపాలు, రెన్యువల్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల గడువు పెంపు జులై 31 వరకు అదనపు లేదా ఆలస్య రుసుము వసూలు చేయకూడదని నిర్దేశం

Posted On: 24 MAY 2020 4:16PM by PIB Hyderabad

దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ సందర్భంగా... మార్చి 24, 2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ నం.40-3/2020-DM-I(A) మార్గదర్శకాలు, తదుపరి సవరణలకు అనుగుణంగా... మోటారు వాహనాల చట్టం-1988, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 కి సంబంధించిన డాక్యుమెంట్ల చెల్లుబాటుపై.. మార్చి 30, 2020న కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. దేశంలో చాలా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఫిబ్రవరి 1, 2020తో గడువు ముగిశాయి. లేదా జూన్ 30తో గడువు ముగియనున్నాయి. 
లాక్‌డౌన్‌ కారణంగా... ఆయా డాక్యుమెంట్ల గడువును పొడిగించలేకపోయినా, పొడిగించాల్సివున్నా, అలాంటి డాక్యుమెట్లను 2020 జూన్ 30 వరకు చెల్లుబాటు అయ్యే పత్రాలుగానే పరిగణించాలని సంబంధింత అధికారులకు కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సూచించింది.

    లాక్‌డౌన్‌తోపాటు, ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూసివేసిన కారణంగా... కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 కింద తప్పనిసరిగా చెల్లించాల్సిన వివిధ రుసుములు, ఆలస్య రుసుముల విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వివిధ సేవలు, రెన్యువల్స్‌కు సంబంధించిన రుసుములు ముందుగానే చెల్లించినా, లాక్‌డౌన్‌ కారణంగా వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కాని సంఘటనలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాలు మూసివేయడం వల్ల ప్రజలు ఫీజులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం గమనించింది.

    ఈ ఇబ్బందులు తొలగించేలా కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2020న లేదా తర్వాత వాహన కార్యకలాపాలు, రెన్యువల్స్‌కు రుసుములు చెల్లించినా సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోతే, అవి చెల్లుబాటులోనే ఉన్నట్లు పరిగణించాలని అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 1, 2020 నుంచి లాక్‌డౌన్‌ కాలం వరకు ఫీజుల చెల్లింపులో ఆలస్యమై ఉంటే, వాటికి సంబంధించి జులై 31 వరకు అదనపు లేదా ఆలస్య రుసుము వసూలు చేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది.



(Release ID: 1626636) Visitor Counter : 211