సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

విద్యుత్తును ఎక్కువగా వినియోగించే రంగాలకు విస్తృతమైన ప్రయోజనం చేకూర్చే భారీ సామర్ధ్యం సౌర విద్యుత్ రంగానికి ఉంది - శ్రీ నితిన్ గడ్కరీ

అన్ని రంగాలకు సహాయపడే వినూత్న మరియు ఆర్థికంగా లాభదాయకమైన వ్యాపార విధానాలను అనుసరించవలసిందిగా సౌర విద్యుత్ పరిశ్రమల ప్రతినిధులను కోరిన - శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 23 MAY 2020 7:53PM by PIB Hyderabad

సౌర ఇంధన రంగంలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకోవడానికి,  కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు మహా సౌర సంఘటన్  సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. 

సౌరశక్తి యొక్క ప్రాముఖ్యత గురించి మంత్రి వివరిస్తూ, ఈ రంగానికి భారీ సామర్థ్యం ఉందనీ, విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించడానికి ఇది సహాయపడుతుందనీ పేర్కొన్నారు. వ్యవసాయం, గిడ్డంగులు వంటి రంగాలు విద్యుత్తును ఎక్కువగా వినియోగించుకునే రంగాలని ఆయన పేర్కొంటూ, సాగు నీటి పారుదల కోసం సౌర విద్యుత్తు తో నడిచే నీటి పంపు మరియు శీతల గిడ్డంగుల నిర్వహణ కోసం సౌర విద్యుత్తును సరైన వాణిజ్య సరళిలో ఉపయోగించినట్లైతే విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. 

విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తులతో భర్తీ చేయడానికి దిగుమతి ప్రత్యామ్నాయాలతో పాటు ఎగుమతులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.  భారతదేశం ఇప్పటికీ శక్తి సామర్థ్య సౌర ఫలకాలను దిగుమతి చేసుకుంటోందనీ, "మేక్ ఇన్ ఇండియా" ఉత్పత్తుల సహాయంతో భారతదేశాన్ని స్వావలంబన దిశగా అభివృద్ధి చేయడానికి  తయారీదారులను ప్రోత్సహిస్తోందని ఆయన గట్టిగా చెప్పారు. 

ప్రస్తుత ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవటానికీ, ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి ఎంతో అవసరమైన ప్రేరణను అందించడానికీ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు.  మరొకరి హామీ లేకుండా ఋణాలు సమకూర్చడం ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. లు తమ నిర్వహణ మూలధనాన్ని 20 శాతం మేర పెంచుకోడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వీలుకల్పిస్తుందని ఆయన తెలియజేసారు.

తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన శక్తిని అందించడానికి వ్యవసాయం, గిడ్డంగులు మొదలైన వివిధ రంగాలలో అమలు చేయగలిగే కొన్ని కొత్త, వినూత్న మరియు ఆర్ధికంగా లాభదాయకమైన వ్యాపార నమూనాలను పరిశ్రమ ప్రతినిధులు తీసుకురావాలని శ్రీ గడ్కరీ కోరారు. ఈ రంగం వివిధ రంగాలలో ఇంధన వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడడంతో పాటు, "మేక్ ఇన్ ఇండియా" చొరవకు అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా పేర్కొన్నారు. 

జ్ఞానాన్ని సంపదగా మార్చడానికి పరిశ్రమ ఆవిష్కరణ, వ్యవస్థాపకత, శాస్త్ర, సాంకేతికత, పరిశోధనా నైపుణ్యాలు, అనుభవాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

జపాన్ పెట్టుబడులను చైనా నుండి ఉపసంహరించుకుని, వేరే ప్రాంతాలకు మళ్లించడానికి జపాన్ ప్రభుత్వం తన పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని అందించిందని మంత్రి గుర్తు చేశారు.  దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది భారతదేశానికి ఒక అవకాశంగా ఉంటుందని ఆయన అన్నారు.

ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సూచనల్లో -  సి.ఎల్.సి.ఎస్.ఎస్. పథకం కింద సాంకేతికతల జాబితాలో సౌర పి.వి. ని చేర్చడం, కొత్త ఎమ్ఎస్.ఎం.ఈ. నిర్వచనంలో టర్నోవర్ పరిమితి సవరణ,  తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతిని తగ్గించడానికి వీలుగా  ఎమ్ఎస్.ఎం.ఈ. లకు ఎగుమతిపై రాయితీ మొదలైనవి ఉన్నాయి.  

ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ, ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం జేస్తామని హామీ ఇచ్చారు.

 

****


(Release ID: 1626503)