గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
"గిరిజనుల జీవనోపాధి మరియు భద్రత" పై రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన - కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి.
సవరించిన మద్దతు ధరలతో ఎం.ఎఫ్.పి. ల సేకరణను ప్రోత్సహించిన రాష్ట్రాలను అభినందించిన - శ్రీ అర్జున్ ముండా.
వన్ ధన్ కార్యక్రమాన్నీ మరియు కోవిడ్-19 కారణంగా గిరిజన వలసదారులు / ఇంటికి తిరిగి వస్తున్న విద్యార్థుల కోసం చేపట్టిన చర్యలను సమీక్షించిన - కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి.
Posted On:
12 MAY 2020 6:40PM by PIB Hyderabad
"గిరిజనుల జీవనోపాధి మరియు భద్రత" అనే అంశంపై రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ రోజు న్యూఢిల్లీ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి, 20 కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు చెందిన అటవీశాఖ మంత్రులతో పాటు ఆయా రాష్టాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ సరితా; గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దీపక్ ఖండేకర్; ట్రిఫెడ్, ఎమ్.డి. శ్రీ ప్రవీర్ కృష్ణతో పాటు గిరిజన మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ, సవరించిన మద్దతు ధరలతో చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహించి, గిరిజనుల జీవనోపాధికి మద్దతు ఇచ్చినందుకు రాష్ట్రాలను అభినందించారు.
2020 మే నెల 1వ తేదీన 50 చిన్న అటవీ ఉత్పత్తుల గరిష్ట అమ్మకం ధర సవరించిన రోజు నుండీ 17 రాష్ట్రాలు 40 కోట్ల రూపాయల మేర అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశాయి. మరో ఐదు రాష్ట్రాలు త్వరలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. గిరిజన ప్రజలకు ఈ చిన్న అటవీ ఉత్పత్తులు వారి జీవనాధారానికి ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయని శ్రీ అర్జున్ ముండా చెప్పారు. గిరిజనులు వారి ఉత్పత్తులకు సరైన విలువ లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరలో అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రారంభించాలని ఆయన కోరారు.
రాష్ట్రాలలో ప్రధానమంత్రి వన్ ధన్ యోజన పనితీరును కూడా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ సందర్భంగా సమీక్షించారు. గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువను జోడించి ప్రపంచ మార్కెట్ తో అనుసంధానం చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దీర్ఘకాల ఆశయాన్ని సాకారం చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. వన్ ధన్ కేంద్రాల ఏర్పాటు వాటికి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం, మార్కెటింగ్ వంటి అంశాలలో రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అందిస్తోంది. ఈ విషయంలో అదనపు సహాయం ఏది కావాలన్నా అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. సేంద్రీయ విధానంలో తయారైన గ్రామీణ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడానికి అవసరమైన ఒక మార్కెట్ విధానాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు.
కోవిడ్-19 కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గిరిజన వలసదారుల కోసం, ఇంటికి తిరిగి వస్తున్న విద్యార్థుల కోసం చేపట్టిన ఏర్పాట్లను శ్రీ అర్జున్ ముండా సమీక్షించారు.
చిన్న అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించి, వాటిని అదనపు విలువను జోడించి, వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా మద్దతు ధరలకు విక్రయిస్తే, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు అదనపు జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల నుండి తిరిగి వచ్చిన గిరిజనులకు ఉపాధి కల్పించడానికి గ్రామ స్థాయిలో చిన్న తరహా యూనిట్లు ఏర్పాటుచేయవలసిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ సిఫార్సు చేశారు. గిరిజనులలో నిబిడీకృతమై ఉన్న సంప్రదాయ జ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
వన్ ధన్ కేంద్రాలు, స్వయం సహాయ బృందాల ద్వారా గిరిజన ప్రజలకు జీవనోపాధి, ఉపాధి కల్పించడంలోనూ, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలోనూ సహాయం చేసినందుకు వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశాయి. వన్ ధన్ కేంద్రాల నుండి మంచి ఫలితాలు రావడంతో, తమ తమ రాష్ట్రాలలో వన్ ధన్ కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని దాదాపు అన్ని రాష్ట్రాలు కోరాయి. తమ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న చిన్న అటవీ ఉత్పత్తుల రకాలు, వాటి ప్రయోజనాలను వారు వివరించారు. ఎమ్.ఎస్.పి . పెంచడం ద్వారా ఎం.ఎఫ్.పి. సేకరణలో కలిగిన ప్రయోజనాన్ని కూడా వారు వివరించారు. కోవిడ్-19 నేపథ్యంలో గిరిజనులు తయారుచేసిన హ్యాండ్ సానిటైజర్, ఫేస్ మాస్కులు వంటి ఉత్పత్తుల గురించి కొన్ని రాష్ట్రాలు తెలియజేశాయి. వాటిని స్థానిక సమాజాలకు, రైల్వేలు వంటి సంస్థలకు సరఫరా చేసినట్లు చెప్పాయి.
వన్ ధన్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల పనితీరుపై ఎం.డి. శ్రీ కృష్ణ వివరాలు తెలియజేశారు.
సవరించిన ఎమ్.ఎస్.పి. తో రాష్ట్రాలు సేకరించిన ఎం.ఎఫ్.పి. వివరాలు
వివరాలు
|
04/05/2020
తేదీ నాటికి
|
09/05/2020
తేదీ నాటికి
|
12/05/2020 తేదీ నాటికి
|
రాష్ట్రాల సంఖ్య
|
10 రాష్ట్రాలు
|
10 రాష్ట్రాలు
|
17 రాష్ట్రాలు
|
సేకరణ మొత్తం
|
రూ.23.06 కోట్లు
|
రూ.29.07 కోట్లు
|
రూ. 40 కోట్లు
|
40 కోట్ల రూపాయల ఎమ్.ఎఫ్.పి. లను రాష్ట్ర ఏజెన్సీలు సేకరించడం వల్ల అటవీ ఉత్పత్తుల మార్కెట్ ధరలు పెరిగాయి. ప్రైవేట్ వర్తకులు సవరించిన ధరతో సేకరించడం వల్ల గిరిజనులు అదనంగా 300 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారు.
వివిధ రాష్ట్రలలో మొత్తం 1205 వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18,075 స్వయంసహాయ బృందాల ద్వారా 3.75 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటుకు ఇంతవరకు సుమారు 166 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
("గిరిజనుల జీవనోపాధి మరియు భద్రత" పై
రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, శ్రీ అర్జున్ ముండా)
*****
(Release ID: 1623432)
Visitor Counter : 480