ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో కోవిడ్ -19 నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రి శ్రీ హర్షవర్ధన్ సమీక్ష
Posted On:
08 MAY 2020 6:13PM by PIB Hyderabad
కోవిడ్ -19పై రాష్ట్రాలలో జరుగుతున్న పోరాటంపై ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ వరుసగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో మాట్లాడారు. ఈ వరుసలో తాజాగా తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్‌తోను, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ తోను, కర్నాటక వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తోను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి వైరస్ పై పోరాటంలో భాగంగా రాష్ట్రాలు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాయని శ్రీ హర్షవర్ధన్ అభినందించారు. ఇంతవరకూ కేంద్రం చేసిన కృషిని ఆయన వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిత్యం పలు కేంద్ర మంత్రిత్వశాఖలతో, ఇతర విభాగాలతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తూ ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులను,ఐసోలేషన్, ఐసియు పడకలను, క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాయని ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా వుందని శ్రీ హర్షవర్ధన్ అన్నారు.
రాష్ట్రాలు మరింతగా నిఘా పెంచాలని, వైరస్ క్యారియర్లను గుర్తించి వారికి పరీక్షలు చేసి చికిత్సలు ఇప్పించాలని డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. కేసులు నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఎవరికైనా ఊపిరి, జలుబు లాంటి సమస్యలుంటే గుర్తించి వారికి ఆయా వైద్య కళాశాలల్లోను, ఆసుపత్రుల్లోను పరీక్షలు చేయించాలని తద్వారా ఎక్కడైనా వైరస్ దాగి వున్నాప్రాధమిక దశలో బైటకు వస్తుందని, తద్వారా సమయానికి వైరస్ వ్యాప్తిని నివారించిన వారమవుతామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.
ఆరోగ్య రంగ కార్యకర్తలు వైరస్ బారిన పడకుండా మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పైనుంచి కిందదాకా అంటే క్షేత్రస్థాయి వరకూ కేంద్ర మార్గదర్శకాలను, సూచనల్ని, సలహాల్ని పాటించాలని అననారు. తమ రాష్ట్రాల్లో చేపట్టిన ఉత్తమ విధానాల గురించి రాష్ట్రాలు వివరించాయి. మొబైల్ టెస్టింగ్ లేబరేటరీలను ఏర్పాటు చేశామని, కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో రెండు నెలలకు సరిపోయేలా పలు జాగ్రత్తలు తీసుకున్నామని ఆరోగ్యశాఖ మంత్రులు తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, టెలి మెడిసిన కార్యక్రమ నిర్వహణ ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తున్నామని అన్నారు.
కోవిడేతర ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలని రాష్ట్రాలకు డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని అన్నారు. టీకాలు వేయడం, టీబీ కేసులను గుర్తించి చికిత్స అందించడం, డయాలసిస్ రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం, గర్భిణీలకు తగిన ఆరోగ్య సేవలందించడం..మొదలైన పనులు చేసుకోవాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కేంద్రాలను ఉపయోగించుకొని ఇతర వ్యాధుల పరీక్షలకు ఉపయోగించుకోవాలని అన్నారు. వెక్టర్ కారణంగా వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని చెప్పారు. తమిళనాడు, తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతోనే కాదు ఆ రాష్ట్రాల్లోని పలు జిల్లాల కలెక్టర్లతో కూడా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు.
*****
(Release ID: 1622289)
Visitor Counter : 228