గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామీణాభివృద్ధి పథకాలను వినియోగించుకోవాలని కోరిన కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
కోవిడ్ -19 నిరోదానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యోగాల కల్పన, గ్రామీణ గృహనిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలకు సంబంధించిన పథకాలను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచన
రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
ఎంజిఎన్ ఆర్ ఇ జిఎస్ కింద చేపట్టే పనులద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, నీటి పారుదల పనులు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం
పిఎంజిఎస్‌వై కింద అనుమతి పొందిన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెంటనే పనులను అప్పజెప్పాలని. పెండింగు పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్రాలకు ఆదేశం
పిఎంఏవై (జి) కింద 2.21 కోట్ల గృహాల నిర్మాణానికి అనుమతి. ఇప్పటికే 1 కోటీ 86 లక్షల గృహాల నిర్మాణం పూర్తి.
Posted On:
29 APR 2020 8:36PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20నుంచి దేశంలో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మరియు వ్యవసాయశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశం రెండుగంటలపాటు కొనసాగింది.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం,ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం ( ఎన్ ఆర్ ఎల్ ఎం) కింద చేపట్టే పనులను వేగవంతం చేయడంపై రాష్ట్రాల మంత్రులతో,కేంద్రపాలిత అధికారులతో కేంద్ర మంత్రి శ్రీ తోమర్ సవివరంగా మాట్లాడారు.
కోవిడ్ -19 సవాళ్లను ఉపయోగించుకొని గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించుకోవాలని రాష్ట్ర మంత్రులకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన సూచించారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆయా రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 36 వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్రమంత్రి అన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 33, 300 కోట్లను విడుదల చేసినట్టు అందులో రూ. 20, 225 కోట్లను గత సంవత్సరాల బకాయిలకోసం కేటాయించినట్టు ఆయన అన్నారు. పైన తెలియజేసిన మొత్తం... ఈ ఏడాది జూన్ వరకు చేసే ఖర్చులకు సరిపోతుందని అన్నారు. దేశంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకోసం కేంద్రం దగ్గర తగినన్ని నిధులున్నాయని రాష్ట్రాలకు మంత్రి భరోసానిచ్చారు.
కోవిడ్ -19 కు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు గ్రామీణాభివృద్ధి పథకాలను వేగంగా అమలు చేయాలని మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ఉద్యోగాల కల్పన చేయాలని, మౌలికసదుపాయాలను కల్పించాలని, అలాగే గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయాలని సూచించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల ద్వారా నీటి సంరక్షణ చేయాలని, భూమిలో నీటి వనరులు పెరిగేలా చూసుకోవాలని, అలాగే నీటి పారుదల పనులు చేపట్టాలని చెప్పారు. ఈ పనులను జలశక్తి మంత్రిత్వశాఖ, భూ వనరుల విభాగాలతో కలిసి చేయాలని అన్నారు.
పిఎంఏవై (జి) కింద లబ్ధి దారులకు 3, 4 వాయిదాలద్వారా ఇచ్చిన 48 లక్షల నివాస గృహ యూనిట్లను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే పిఎంజిఎస్ వై కింద కేటాయించిన రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్లను ఖరారు చేయాలని అన్నారు. పెండింగులో వున్న రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
స్వయం సహాయక బృందాలకు చెందిన మహళలు ఎన్ ఆర్ ఎల్ ఎం పథకాన్ని ఉపయోగించుకొని మాస్కులను, శానిటైజర్లను, సబ్బులను తయారు చేయడం, కమ్యూనిటీ వంటశాలల్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
పిఎంఏవై ( జి) కింద ఇప్పటికే 2.21 కోట్ల గృహాలను కేటాయించినట్టు మంత్రి తెలిపారు. వాటిలో ఒక కోటీ 86 వేల గృహాల నిర్మాణం పూర్తయిందని అన్నారు. మూడు, నాలుగు వాయిదాలను అందుకున్న లబ్ధిదారులకు సంబంధించిన48 లక్షల గృహాలను వెంటనే నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ప్రత్యేకంగా చెప్పారు.
కేంద్ర గ్రామీణ మరియు వ్యవసాయశాఖ మంత్రి ఇచ్చిన సూచనలకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకారం తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెండింగులో వున్న వేతనాలు, ఇతర బకాయిలను చెల్లించింనందుకు త్రిపుర, ఉత్తరాఖండ్, మణిపూర్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలు కేంద్రమంత్రిని అభినందించాయి.
కేంద్ర ప్రభుత్వం అండతో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దీమా వ్యక్తం చేశాయి. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖల మార్గదర్శకాల ప్రకారం అన్ని పనులు, కార్యక్రమాలు చేపడతామని చెప్పాయి.
............
(Release ID: 1619504)
Visitor Counter : 251