ప్రధాన మంత్రి కార్యాలయం
బసవ జయంతి సందర్భంగా వీడియో సందేశం ద్వారా భగవాన్ శ్రీ బసవేశ్వరునినికి ప్రధాని ఘన నివాళి.
Posted On:
26 APR 2020 8:53PM by PIB Hyderabad
భగవాన్ శ్రీ బసవేశ్వరుని జయంతి సందర్భంగా ప్రధాని శ్రీనరేంద్ర మోదీ ఘన నివాళి ఘటించారు. ఓ వీడియో సందేశం ద్వారా నివాళి సమర్పిస్తూ ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భగవాన్ శ్రీ బసవేశ్వరులు 12వ శతాబ్ది చెందిన ప్రఖ్యాత తాత్వికవేత్త, గొప్ప సంఘసంస్కర్త. విశ్వగురు బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు ప్రతి ఏడాది ఈ రోజున నిర్వహించడం సంప్రదాయం.
దేశ విదేశాల్లో వున్న ఆయన భక్తులను డిజిటల్ ద్వారా కలుపుతూ అంతర్జాతీయ బసవ జయంతి -2020ని ఘనంగా నిర్వహించారు.
కరోనవా వైరస్ మహమ్మారిని జయించే శక్తి సామర్థ్యాలను భగవాన్ శ్రీ బసవేశ్వరులు ఈ దేశానికి ఇవ్వాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో ఆకాంక్షించారు.
గతంలో తనకు అననేకసార్లు భగవాన్ శ్రీ బసవేశ్వరుని బోధనలనుంచి నేర్చుకునే అవకాశాలు వచ్చాయని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన పుణ్య వచనాలను 23 భాషల్లోకి అనువాదం చేసే కార్యక్రమ సందర్భంగాను, లండన్ లో బసవేశ్వరుని విగ్రహావిష్కరణ సందర్భంగాను తాను ఆయన బోధనలనుంచి నేర్చుకున్నానని ప్రధాని అన్నారు.
భగవాన్ శ్రీ బసవేశ్వరుడు ఒక గొప్ప సంస్కర అని, ఆయన గొప్ప పాలనాదక్షుడని ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఆయన సాంఘిక సంస్కరణ బోధనలు చేయడమే కాకుండా వాటిని తన స్వంత జీవితానికి అన్వయించుకున్న మహానుభావుడని ప్రధాని అన్నారు.
భగవాన్ శ్రీ బసవేశ్వరుని బోధనలు మహత్తరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాయని అంతే కాదు మన నిత్య జీవితంలో పనికొస్తాయని ప్రధాని అన్నారు. ఆయన బోధనలు మనిషిని ఉన్నతీకరిస్తాయని, సమాజంలో మంచి మార్పులు తెస్తాయని ప్రధాని వివరించారు. దయ, మానవత్వం, క్షమాగుణాన్ని కలిగిస్తాయని అన్నారు. అనేక శతాబ్దాల క్రితమే బసవేశ్వరుడు సమాజంలోని వివక్షతలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించారని ప్రధాని అన్నారు.
ప్రజాస్వామ్య పునాదులు వేసిన ఘనత భగవాన్ శ్రీ బసవేశ్వరునిదేనని స్పష్టం చేశారు. ప్రజల హక్కులకోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని ప్రధాని వివరించారు. అంతే కాదు మానవజీవితంలోని ప్రతి పార్శ్యాన్ని శ్రీ బసవేశ్వరులు స్పృశించారని పలు సమస్యలకు పరిష్కారాలు చూపారని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
2017 సంవత్సరంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు బసవన్న వచనాలను డిజిటలీకరణ చేసే పని మొదలుపెట్టారు. ఈ విషయంలో విస్తృతంగా జరిగిన పనిపట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీ బసవేశ్వరుని జయంతిని... ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో చేయడానికి వీలుగా బసవ సమితి చేసిన ఏర్పాట్లను ప్రధాని అభినందించారు. లాక్ డౌన్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటూనే జయంతి ఉత్సవాన్ని నిర్వహించారని నిర్వాహకులను ప్రశంసించారు.
మార్పు అనేది భారతీయులతోనే మొదలవుతుందనే విషయాన్ని ఈ రోజున భారతీయులు నిరూపిస్తున్నారని, ప్రజల ఈ నమ్మకమే దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగలుగుతుందని ప్రధాని అన్నారు. భవిష్యత్ పట్ల తమకున్న ఆశ, నమ్మకాలను భారతీయులు బలోపేతం చేసుకొని ఈ సందేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రధాని కోరారు. ఈ సందేశం మనకు స్ఫూర్తినిస్తుందని, దేశం నూతన శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని అన్నారు. ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటూ బసవన్న బోధనల్ని, ఆశయాల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
బసవ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించాలనే నియమాన్ని తప్పకుండా పాటించాలని ప్రత్యేకంగా కోరారు.
******
(Release ID: 1618551)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam