శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 రోగుల కేంద్ర నాడీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపి వాస‌న మ‌రియు రుచి కోల్పోయేలా చేస్తుంద‌ని తేల్చిన అధ్య‌యనం

Posted On: 26 APR 2020 6:31PM by PIB Hyderabad

జోధ్ పూర్‌కు చెందిన ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటి) కోవిడ్ -19 వైర‌స్ పై చేసిన అధ్య‌య‌నంద్వారా ప‌లు విష‌యాలు తెలుస్తున్నాయి. ఈ సంస్థ సైంటిస్టుల బృందంగా తాజాగా ఒక ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. కోవిడ్ -19 వైర‌స్ సార్స్ -సివోవి -2 అనేది... రోగిలోని కేంద్ర నాడీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని, రుచి, వాస‌న శ‌క్తి కోల్పోతామ‌ని ఐఐటి ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నంలో తేలింది. అంతే కాదు మెద‌డులో అంత‌ర్భాగంగా వుండే  నిర్మాణాలు ఈ వైర‌స్ తాకిడి కార‌ణంగా తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తినే ప్రమాద‌ముంద‌ని కూడా ఐఐటి శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం చెబుతోంది. 
హెచ్ ఏ సి 2 అనే మ‌నిషిలోని ప్ర‌త్యేక‌మైన రిసెప్ట‌ర్ ( హ్యూమ‌న్ ఆంజియో టెన్షిన్ క‌న్వ‌ర్టింగ్ ఎంజైమ్ -2)తో సార్స్ - సివో వి-2 వైర‌స్ క‌లిసిపోతుంద‌ని..దానికి ఈ రిసెప్ట‌ర్ ఓ గ‌డ‌ప‌లాంటిద‌ని ఐఐటికి చెందిన డాక్ట‌ర్ సుర్జీత్ ఘోష్ ఆయ‌న బృంద స‌భ్యులు తెలిపారు. శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల్లో ఈ రిసెప్ట‌ర్ వుంటుంది. 
నోరు, ముక్కు ద్వారానే ఎక్కువ‌గా వైర‌స్ శ‌రీరంలోకి చేరుకుంటుంది. ముందుగా ముక్కు, నోటిపై దాడి చేసే వైర‌స్ అక్క‌డ వుండే వాస‌న‌, రుచికి కార‌ణ‌మ‌య్యే నిర్మాణాల‌పై ప్ర‌భావం చూపి మ‌న‌కు వాస‌న‌, రుచి లేకుండా చేస్తుంది. 
జోధ్ పూర్ ఐఐటి ప‌రిశోధ‌కులు ...కోవిడ్ -19 వైరస్ అనేది మ‌నిషి శ‌రీరంలోని న్యూరాన్ల‌పై చూపే ప్ర‌భావాన్ని అర్ధం చేసుకోవ‌డంద్వారా చికిత్సా వ్యూహాల‌ను త‌మ అధ్య‌య‌న ప‌త్రంలో సూచించారు. 
కోవిడ్ -19 వైర‌స్ బారిన ప‌డిన ఓ రోగి మెద‌డు స్కాన్ల‌పై ( సిటి అండ్ ఎంఆర్ ఐ) ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన అధ్య‌యనాన్ని జోధ్ పూర్ ఐఐటి బృందం త‌మ అధ్య‌య‌న ప‌త్రంలో ప్ర‌స్తావించింది. వైర‌స్ కార‌ణంగా మెద‌డు స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌లతోపాటు కేంద్ర నాడీ వ్య‌వ‌స్థపై ప్ర‌భావం ఎలా వుంటుంద‌నేదానిపై కూడా ఈ అధ్య‌య‌నం తెలియ‌జేసింది. కోవిడ్ -19 వైర‌స్ అనేది మెద‌డులోని మెడుల్లా అబ్లాంగేటాను పూర్తిగా నాశ‌నం చేస్తుంద‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మెడుల్లా అబ్లాంగేటా అనేది మ‌నిషి శ్వాస‌, హృద‌యం, ర‌క్త నాళాల ప‌నిని నియంత్రిస్తుంది. 

 


ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌న‌బ‌ర‌చ‌కపోయినా శ‌రీరంలో వైర‌స్ వున్న‌వారిని అసింప్ట‌మాటిక్ క్యారియ‌ర్స్ అంటారు. వీరు వాస‌న‌, రుచి శ‌క్తి కోల్పోగానే వెంట‌నే  క్వారంటైన్ లోకి అంటే స్వీయ‌నిర్బంధంలోకి వెళ్లిపోవాలి. ఆ త‌ర్వాత నెఫ్రాల‌జిస్టుల‌ను క‌ల‌వాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు.  
శ‌రీరంలోని ప‌లు భాగాల‌పై వైర‌స్ చూపే ప్ర‌భావం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీని ద్వారానే చికిత్స ఎలా వుండాల‌నేది నిర్ణ‌యించ‌వచ్చ‌ని వారు తెలియ‌జేశారు. శ‌రీరంలోని న్యూరాన్ల‌ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతున్న వైర‌స్ స్వ‌భావాన్ని, త‌ద్వారా రోగులు రుచి, వాస‌న కోల్పోవ‌డం అనే అంశంపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని, ఆస‌క్తిక‌ర‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగ కార్య‌ద‌ర్శి ప్రొఫెస‌ర్ ఆసుతోష్ శ‌ర్మ అంటున్నారు. 
పొగ తాగే అలవాటున్న‌వారికి కోవిడ్ -19 వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశం ఎక్కువ‌గా వుంద‌ని జోధ్‌పూర్ ఐఐటి ప‌రిశోధ‌కుల అధ్య‌య‌న ప‌త్రం ప్ర‌త్యేకంగా తెలియేస్తోంది. పొగ తాగ‌డంవ‌ల్ల శ‌రీరంలోని నికోటనిక్ రిసెప్ట‌ర్ స్టిమ్యులేట్ అవుతుంద‌ని దాంతో శ‌రీరంలో వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌నా ప‌త్రం వివ‌రిస్తోంది. 
ప్ర‌చుర‌ణ వివ‌రాల లింకు:
https://dx.doi.org/10.1021/acschemneuro.0c00201
మ‌రిన్ని వివ‌రాల‌కు సంప్ర‌దించాల్సిన వివ‌రాలు : ప‌్రొఫెస‌ర్ సురాజిత్ ఘోష్‌, sghosh@iitj.ac.in, మొబైల్ నెం: +91-9903099747]

 

****



(Release ID: 1618522) Visitor Counter : 561