శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఏపీఐలు, ఔషధ తయారీలో వాడే మధ్యస్త ముడి పదార్థాల కోసం ఆధారపడటాన్ని
తగ్గించేలా సీఎస్ఐఆర్-ఐఐసీటీ చొరవ
Posted On:
25 APR 2020 3:41PM by PIB Hyderabad
ఔషధాల ఉత్పత్తిలో క్రియాశీలక ఔషధ పదార్థాలు (ఏపీఐ) మరియు ఇతర ముడి పదార్ధాలు ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటాయి. ఏపీఐలు మరియు డ్రగ్ ఇంటర్మీడియట్ల సరఫరా కోసం
భారతదేశం ఎక్కువగా చైనాపై ఆధారపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఏపీఐలు మరియు డ్రగ్ ఇంటర్మీడియట్లను అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా
పని చేస్తున్న సమీకృత ఔషధ తయారీ కంపెనీ లాక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో కలిసి పనిచేయనుంది. ఈ చొరవతో భారత ఔషధ రంగం ఏపీఐలు మరియు డ్రగ్ ఇంటర్మీడియట్ల దిగుమతులపై ఆధార పడటం చాలా వరకు తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని ఐఐసీటీ సంస్థ నవ్య కరోనా వైరస్‌నకు పలు విరుగుడు ఔషధాల సంశ్లేషణ కోసం లాక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో
కలిసి పనిచేస్తోంది. వైరస్‌కు విరుగుడుగా పని చేయగలవన్న ప్రాథమిక అంచనాలతో అభివృద్ధి చేసిన ఉమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్ మరియు హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ముడి పదార్థాల ఉత్పత్తిపై ఈ రెండు సంస్థలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి.
చైనాపై ఆధారపడటం తగ్గించే దిశగా..
ప్రపంచ వ్యాప్తంగా మలేరియా విరుగుడు ఔషధం హెచ్‌సీక్యూ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. కరోనా వైరస్ చికిత్సలో హెచ్‌సీక్యూ మేటిగా పని చేస్తోందన్న వార్తల
నేపథ్యంలో ఇటీవలి దీనికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా భారత్ అమెరికాతో సహా 50 దేశాలకు హెచ్‌సీక్యూని సరఫరా చేసింది. ఐఐసీటీ- లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ సహకారంతో కీలకమైన ఔషధ ముడి పదార్థాలకు కోసం భారత్ చైనాపై ఆధారపడటాన్ని కనిష్టానికి తగ్గించడంతో పాటు ఇందుకు సంబంధించిన వ్యయాన్ని కూడా తగ్గించగలదు. దీనికి తోడు ఎబోలా వైరస్ రోగులకు అందించబడిన రెమ్‌డెసివిర్ ఔషధం ప్రస్తుతం కోవిడ్-19 వైరస్‌కు ఔషధంగా వాడే విషయంలో దాని సమర్థతను మరియు భద్రతను అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే ఈ ఔషధాన్ని కూడా రెండు సంస్థలు తమ సౌజన్యంతో చౌకగా భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు వీలు పడనుంది.
ఇటీవలే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం..
ఔషధ భద్రతతో పాటు ప్రజారోగ్యానికి అవసరమైన మందుల లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో భారీగా ఔషధ తయారీని ప్రోత్సహించడానికి మరియు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇటీవలే ఒక ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది.
అమెరికా అనుమతులు పొందిన అనుబంధ సంస్థలో తయారీ..
లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఔషధ సంస్థల డిస్కవరీ కెమిస్ట్రీ విధానాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతో 2007లో స్థాపించబడింది. ఆ తరువాత లాక్సాయ్ సంస్థ ఏపీఐ తయారీ మరియు ఔషధ సూత్రీకరణ అభివృద్ధిలో తన ఉనికిని చాటుతూ ప్రస్తుతం ఒక సమీకృత ఔషధ కంపెనీ స్థాయికి ఎదిగింది. ఐఐసీటీ సహకారంతో ఇప్పడు లాక్సాయ్ సంస్థ వాణిజ్య పరంగా వివిధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది. ఈ ఉత్పత్తులను వాణిజ్యీకరించిన మొదటి కొన్ని సంస్థలలో లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఒకటిగా నిలవనుంది. అమెరికా ఆహార మరియు ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ)/ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టిసెస్ (జీఎంపీ) అనుమతులు పొందిన తన అనుబంధ సంస్థ థెరపివా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏపీఐలు మరియు ఇతర ఔషధ ఇంటర్మీడియెట్స్‌ను లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ తయారీ చేయనుంది. ఇతర వివరాల కోసం డాక్టర్ ఎం. చంద్రశేఖరమ్, సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్-500 007, ఇండియా, లేదా headkim@ iict.res.in అనే ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
(Release ID: 1618205)
Visitor Counter : 234