పర్యటక మంత్రిత్వ శాఖ
దేఖో అపనా దేశ్ సిరీస్ లో భాగంగా 6వ వెబినార్ నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ.
పర్యాటక పరంగా భారతదేశం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వెబినార్ నిర్వహణ
పర్యాటక పరంగా దేశంలోగల అంతులేని అవకాశాల గురించి వివరించిన వెబినార్
Posted On:
23 APR 2020 12:44PM by PIB Hyderabad
దేఖో అపనా దేశ్ అనే అంశంపై పలు వెబినార్లను నిర్వహిస్తోంది కేంద్ర పర్యాటక శాఖ. భారతదేశంలో పలు పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ వెబినార్లను నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ ప్రజలకు తెలియని పర్యాటక ప్రాంతాల గురించి తెలియజేస్తున్నారు. అంతే కాదు అందరికీ తెలిసిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఇంతవరకూ పెద్దగా తెలియని విషయాలను కూడా దీని ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి తోడు అందరికీ అందుబాటులో పర్యాటకం లాంటి ప్రత్యేక అంశాల చుట్టూ కూడా ఈ వెబినార్లను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా ఆరవ వెబినార్ ను ఏప్రిల్ 22న నిర్వహించారు. దీంట్లో అందరికీ సమగ్రంగా భారతదేశ పర్యాటక ప్రదేశాలు అందుబాటు వుండాలనే అంశాన్ని తీసుకొని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 1700 మంది ఈ వెబినార్లో పాలుపంచుకున్నారు.
దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో వికలాంగులైన (దివ్యాంగులు) పర్యాటకులు చేసిన ప్రయాణం గురించి ఇందులో వివరించారు. పురాతన నగరం వారణాసి, గంగా నదీ తీరంలో బోటు విహారం, అమృత్ సర్ స్వర్ణ దేవాలయం, ధర్మశాలలోని దలైలామా ఆశ్రమం మొదలైన పలు పర్యాటక ప్రాంతాలను పేర్కొన్నారు. జైసల్మేర్ కోటనుంచి రిషికేష్ వరకూ, కేరళ బ్యాక్ వాటర్స్ నుంచి కర్నాటక జాతీయ పార్కులదాకా ఇందులో వివరించారు. పలు రకాలైన దివ్యాంగులు చేసిన ప్రయాణం ఇందులో చూపించారు. వారు తమ శారీరక ఇబ్బందులను పక్కన పెట్టి ఈ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఎలా చేయగలిగారనేది ఇందులో ముఖ్యమైన అంశం. భారతదేశంలో పర్యాటక ప్రాంతాలు అందరికీ అందుబాటులో వున్నాయని తెలియజేయడానికి ఈ ప్రయత్నం చేశారు. అంతే కాదు ఆయా పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నవారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల గురించి ఇందులో ప్రత్యేకంగా వివరించారు.
ఈ నేపథ్యంలో గమనించాల్సిన విషయం ఏదంటే దివ్యాంగుల హక్కుల చట్టం, 2016కు అనుగుణంగా అందరికీ అందుబాటులో వుండేలా భారతదేశ పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దారు. ఈ చట్టం 2017లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వికలాంగత్వాల సంఖ్యను 7నుంచి 21కి పెంచింది. దివ్యాంగులకు తగిన సాధికారిత కల్పించడానికి కావలసిన వ్యవస్థను ఇది తయారు చేసింది. అంతే కాదు సంతృప్తికర స్థాయిలో వారిని సమాజంలో కలిసిపోయేలా చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతోంది.
దివ్యాంగులకు సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్లానెట్ ఏబుల్డ్ సంస్థ వ్యవస్థాపకురాలు నేహా అరోరా ఈ వెబినార్ ను నిర్వహించారు. బధిరులైన వీక్షకులకు అర్థం కావడానికివీలుగా సైగ భాష నిపుణుడు కూడా ఈ వెబినార్ లో పాల్గొన్నారు.
*******
(Release ID: 1617716)
Visitor Counter : 167