యు పి ఎస్ సి

లాక్‌డౌన్‌ తరువాత యుపీఎస్‌సీ పరీక్షల‌ షెడ్యూల్ ప్రకటన

- కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఏప్రిల్ నుంచి ఏడాది పాటు 30% ప్రాథమిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకోనున్న యుపీఎస్‌సీ చైర్మ‌న్‌, స‌భ్యులు
- ఒక్క రోజు జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు స్వ‌చ్ఛంద‌ విరాళంగా అందించిన‌ యుపీఎస్‌సీ అధికారులు, సిబ్బంది

Posted On: 15 APR 2020 2:59PM by PIB Hyderabad

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఎదుర‌వుతున్న ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు గాను యుపిఎస్‌సీ క‌మీష‌న్ బుధ‌వారం ఒక ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో
సామాజిక దూరం, ప‌లు ఇత‌ర ప‌రిమితులు అమ‌లులో ఉన్న కార‌ణంగా ఇంటర్వ్యూలు, పరీక్షలు, నియామక బోర్డుల తేదీల‌పై నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణయించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అభ్యర్థులు, సలహాదారులు ప్రయాణాలు చేసి ఇంటర్వ్యూలు, పరీక్షలు మరియు నియామక బోర్డులకు హాజ‌రు కావాల్సి ఉంటుంది కాబ‌ట్టి  క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.
వెబ్‌సైట్‌లో ప‌రీక్షా తేదీల స‌మాచారం..
రెండో ద‌శ లాక్‌డౌన్‌ మే 3తో ముగిసిన తరువాత మిగిలిన సివిల్ సర్వీసెస్ -2019 ప‌రీక్ష‌లు, ఇత‌ర పర్సనాలిటీ టెస్ట్ విష‌య‌మై తాజా తేదీలపై ఒక నిర్ణయం తీసుకోవాల‌ని క‌మిష‌న్ ఈ స‌మావేశంలో నిర్ణ‌యించింది. సివిల్ సర్వీసెస్ -2020 (ప్రిలిమ్స్), ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) మరియు జియాలజిస్ట్ సర్వీసెస్(మెయిన్) పరీక్షల తేదీలు ఇప్పటికే ప్రకటించారు. ప‌రిస్థితుల‌లో ఏవైన మార్పులు ఉంటే.. ఈ పరీక్షా తేదీల‌ రీషెడ్యూలింగ్ గురించి తదుప‌రి స‌మాచారాన్ని యుపిఎస్‌సీ వెబ్‌సైట్లో తెలియజేయనున్నారు. ఉమ్మ‌డి మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2020కి సంబంధించిన వాయిదా నోటీసులు ఇప్ప‌టికే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయ బడ్డాయి. సీఏపీఎఫ్ ఎగ్జామ్‌-2020కి సంబంధించిన తేదీల‌ను కూడా యుపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచ‌బ‌డుతాయి. మ‌రోవైపు నేష‌న‌ల్ డెఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ-I) ప‌రీక్ష కూడా ఇప్ప‌టికే నిర‌వ‌ధికంగా వాయిదా వేయ‌బ‌డింది. ఎన్‌డీఏ-II ప‌రీక్షను నోటిఫికేష‌న్‌లో తెలియ‌ప‌రిచిన‌ట్టుగానే  జూన్ 10న నిర్వ‌హించ‌నున్నారు. యుపీఎస్‌సీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామక బోర్డులకు సంబంధించిన ఇత‌ర నిర్ణ‌యాల‌న్నీ కమిషన్ వెబ్‌సైట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉంచ‌నున్నారు.
క‌మిష‌న్ చైర్మన్, సభ్యుల ఉదార‌త‌..
కరోనా వైరస్ మహమ్మారి వల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని కమిషన్ సమీక్షించింది. జాతీయ స్థాయిలో ఆర్థిక వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు కమిషన్ నుండి తమకు లభిస్తున్న ప్రాథమిక వేతనంలో 30 % ని స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి దాదాపు సంవత్సర‌ కాలానికి వారు త‌మ ప్రాథ‌మిక వేతనంలో 30% ని స్వచ్ఛందంగా వదులుకోనున్నారు. దీనికి తోడు యుపీఎస్‌సీ అధికారులు మరియు సిబ్బంది ప్ర‌ధాన మంత్రి యొక్క సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఫండ్‌కు (పీఎం కేర్స్ ఫండ్) త‌మ ఒక్క రోజు జీతంను  స్వచ్ఛంద విరాళంగా అందించారు.

 


(Release ID: 1614729) Visitor Counter : 373