సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

హోంమంత్రిత్వ శాఖ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు

Posted On: 15 APR 2020 10:56AM by PIB Hyderabad

కోవిడ్-19 విస్తరణను అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను 2020 మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2020 ఏప్రిల్ 14వ తేదీన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దేశంలోని గుర్తించిన ప్రాంతాల్లో 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని కార్యకలాపాలు పునః ప్రారంభించడానికి అనుమతించనున్నట్టు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రధానమంత్రి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) లాక్ డౌన్ ను 2020 మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ 2020 ఏప్రిల్ 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాంగాలు కరోనా అదుపులోనే ఉన్నవిగా గుర్తించిన ప్రాంతాల్లో ఎంపిక చేసిన మేరకు అదనపు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతిస్తూ ఎంహెచ్ఏ 2020 ఏప్రిల్ 15న మరో ఉత్తర్వు జారీ చేసింది.

2020 ఏప్రిల్ 15వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుతో పాటుగా కలిపి రూపొందించిన సవరించిన  ఏకీకృత మార్గదర్శకాలు జారీ చేస్తూ 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కార్యకలాపాలను కరోనా వ్యాప్తి గల ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాలపై ఆంక్షలను తొలగించడంతో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కార్యకలాపాల అమలుకు కూడా అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

లాక్ డౌన్ తొలి దశలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం, ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని మరింతగా అదుపు చేయడం, అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని  వ్యవసాయదారులు, కార్మికులు, రోజువారీ వేతనాలపై ఆధారపడిన కార్మికులకు ఊరట కల్పించడం ఈ సవరించిన మార్గదర్శకాల లక్ష్యమని తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాల్లో విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలు;  విద్యాసంస్థలు, శిక్షణ సంస్థల దైనందిన కార్యకలాపాలు;  పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు;  ఆతిథ్య సేవలతో పాటు అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, థియేటర్ల మూసివేత; అన్ని రకాల సామాజిక, రాజకీయ, ఇతర కార్యక్రమాల రద్దు మత సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సాధారణ ప్రజల అనుమతి, మతపరమైన కార్యక్రమాల నిర్వహణపై నిషేధం ఉన్నాయి.

ఇవి కాకుండా కార్యస్థలాల్లోను, ప్రజలు అధికంగా తిరిగే ప్రాంతాల్లోను తప్పనిసరిగా ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్లు ఉపయోగించడం, శక్తివంతమైన పరిశుభ్రత పాటించడం, శానిటైజర్ల వినియోగం, స్వల్ప సంఖ్యలోనే పనుల నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్, థర్మల్ స్ర్కీనింగ్ వంటివి తప్పనిసరి. రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం నిషేధం. పైన పేర్కొన్న నిబంధనలు, నిషేధ ఆంక్షలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు.

అయితే 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలుజరిగేలా సవరించిన మార్గదర్శకాల్లో అనుమతించిన కార్యకలాపాలేవీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి గలవిగా రాష్ట్ర ప్రభుత్వాలు/   కేంద్రపాలిత ప్రాంతాలు/  జిల్లా యంత్రాంగాలు ప్రత్యేకంగా గుర్తించిన, నిషిద్ధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతాల్లో చేపట్టకూడదు.   మెడికల్ ఎమర్జెన్సీ, శాంతి భద్రతలకు సంబంధించిన విధులు వంటి అత్యవసర సర్వీసులు, కొనసాగింపు తప్పనిసరి అని ప్రభుత్వం గుర్తించిన కార్యకలాపాల కోసం వెళ్లి రావడానికి అనుమతించడం మినహా కోవిడ్-19 విస్తరణ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో అవసరమైన తనిఖీలు నిర్వహించకుండా సాధారణ ప్రజలు లోపలికి రావడం, వెలుపలికి పోవడం వంటివి అనుమతించకూడదు.

కోవిడ్-19 విస్తరణ అధికంగా ఉన్నవిగా లేదా త్వరిత గతిన వ్యాధి వ్యాపిస్తున్నవిగా గుర్తించిన హాట్ స్పాట్ జిల్లాల్లో అత్యంత కఠినమైన నిషేధ చర్యలు అమలుపరచడం తప్పనిసరి. ఈ ప్రాంతాలను సాధారణ ప్రాంతాల నుంచి ఏ విధంగా వేరు చేయాలి, ఏయే నిషిద్ధాజ్ఞలు అమలు పరచాలి అనే విషయంలో సవివరమైన మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ కేవలం అత్యవసర సర్వీసులను అనుమతించాలి. ప్రాంతం మొత్తంపై గట్టి నిఘా ఉంచడంతో పాటు ప్రజానీకం కదలికలన్నింటి పైన కఠినమైన ఆంక్షలు అమలుపరచాలి.

వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు సహాయపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు దోహదపడడం, రోజువారీ కూలీలు, ఇతర కార్మిక శక్తి ఉపాధి అవకాశాలు కొనసాగేలా చూడడం, తగు రక్షణలు/  చట్టబద్ధంగా ఆయా పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలతో ఎంపిక చేసిన పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి పైన సూచించిన కార్యకలాపాలను అనుమతించడం జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా  కోవిడ్-19 అదుపు చర్యలు పాటించడం కోసం కోవిడ్-19 అదుపు జాతీయ నిర్దేశకాలు కూడా జారీ చేయడం జరిగింది. వైపరీత్యాల నిర్వహణ చట్టం, 2005 పరిధిలో జిల్లా మెజిస్ర్టేట్లు వాటిని కట్టుదిట్టంగా అమలుపరుస్తూ ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించడం తప్పనిసరి.

అత్యవసర వస్తువులు, అత్యవసరం కానివి అనే వివక్ష ఏదీ లేకుండా అన్ని రకాల వస్తువుల రవాణాను అనుమతించాలి. నోటిఫైడ్ మండీలు; ప్రత్యక్ష, వికేంద్రీకృత మార్కెటింగ్ విధానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, మార్కెటింగ్; ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల తయారీ, పంపిణీ, రిటైల్;  పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పశుసంవర్థక కార్యకలాపాలు;  తేయాకు, కాఫీ, రబ్బర్ తోటల పెంపకం సహా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలను అనుమతించాలి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సహా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలు నడిచేందుకు అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలి. అలాగే నీటి పారుదల వసతులు,జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంఎన్ఆర్ఇజిఏ కింద పనుల నిర్వహణను; గ్రామీణ కామన్ సర్వీసు కేంద్రాల పనులను అనుమతించాలి. ఈ కార్యకలాపాలన్నీ గ్రామీణ కార్మికులు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయి.

కార్మికులు వచ్చి పోవడంపై నిరంతర పర్యవేక్షణ గల సెజ్ లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక టౌన్ షిప్ లలో తగు ఎస్ఓపి అమలుపరచడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించవచ్చు. ఐటి హార్డ్ వేర్, నిత్యావసర వస్తువుల తయారీ, ప్యాకేజింగ్ కార్యకలాపాలను కూడా అనుమతించాలి. బొగ్గు, ఖనిజాలు, చమురు తయారీ అనుమతించిన కార్యకలాపాల్లో ఉన్నాయి. భద్రతాపరమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ పారిశ్రామిక, తయారీ కార్యకలాపాల పునరుద్ధరణకు ఈ చర్యలు దోహదపడతాయి. తద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అంతే కాదు, పారిశ్రామిక రంగానికి అవసరం అయిన రుణ మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో తగినంత నగదు లభ్యత కోసం ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచే ఆర్ బిఐ, బ్యాంకులు, ఎటిఎంలు, సెబీ నోటిఫై చేసిన పెట్టుబడి, రుణ మార్కెట్లు, బీమా కంపెనీలు కూడా పని చేస్తాయి.

సేవల రంగానికి, జాతీయ వృద్ధికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకం. అందుకు దీటుగా ఇ-కామర్స్ కార్యకలాపాల నిర్వహణ;   ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరం అయిన ఐటి, ఐటి ఆధారిత సర్వీసుల కార్యకలాపాలు, డేటా కాల్ సెంటర్ల నిర్వహణ; ఆన్ లైన్ బోధన, దూర విద్య వంటి కార్యకాలాపాలకు కూడా అనుమతి ఉంది.

ఆరోగ్య సర్వీసులు; ఎలాంటి గోప్యత అవసరం లేకుండా ప్రభుత్వ యుటిలిటీలు; నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థ;  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల కీలక కార్యాలయాలు అవసరమైనంత మంది ఉద్యోగులతో పని చేసేందుకు సవరించిన మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయి.

మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పన కోణంలో ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే అన్ని రంగాల కార్యకలాపాలు ఆయా ప్రాంతాల్లో కోవిడ్-19 అదుపు చేయడానికి అమలులో ఉండే చర్యలు కట్టుదిట్టంగా పాటిస్తూ పని చేసేలా అనుమతించడం ఈ సవరించిన ఏకీకృత మార్గదర్శకాల లక్ష్యం.

ఈ రోజు ఉదయం విడుదల చేసిన ఈ సవరించిన మార్గదర్శకాలను సమర్థవంతంగా, సరళంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో కేబినెట్ కార్యదర్శి సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య సర్వీసుల శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పిలు, మునిసిపల్ కమిషనర్లు, సివిల్ సర్జన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనే వారిలో ఉన్నారు.
 



(Release ID: 1614671) Visitor Counter : 306