వ్యవసాయ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర వ్యవసాయశాఖ చేపట్టిన కార్యక్రమాలు
Posted On:
14 APR 2020 7:22PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో రైతులకు, వ్యవసాయ రంగానికి అండగా వుండేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా వున్నాయి.
ఈ ఏడాది రబీ సీజన్ కు సంబంధించి రైతుల దగ్గరనుంచి 1, 21, 883 మెట్రిక్ టన్నుల పప్పుదినుసులు, నూనెగింజలను నాఫెడ్ కొనుగోలు చేయడం జరిగింది. దీనికోసం రూ. 596 కోట్లను ఖర్చు చేశారు.తద్వారా 89, 145 మంది రైతులు లబ్ధి పొందారు.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5, 516 మెట్రిక్ టన్నుల పప్పుదినుసులను పంపిణీ చేయడం జరిగింది.
మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అప్పటినుంచీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8.31 కోట్ల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇందుకోసం ఇంతవరకూ రూ. 16, 621 కోట్లను విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితిని అంచనా వేయడానికిగాను ఏప్రిల్ 13న కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వస్తువుల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికిగాను వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వ్యవసయా ఉత్పత్తులు, ఎగుమతులకు చెందిన పలుసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను వివరించారు. పండ్లు, కూరగాయలు, బస్మతి బియ్యం, బస్మతేతర బియ్యం, విత్తనాలు, పువ్వులు, మొక్కలు, సేంద్రీయ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు మొదలైన వాటిని ఎగుమతిచేస్తున్నవారందరూ ఇందులో వున్నారు.
ఎగుమతిదారులకు వచ్చిన సమస్యల్లో కొన్ని ఇలా వున్నాయి. కార్మికులు అందుబాటులో లేకపోవడం, రాష్ట్రాల మధ్యన రవాణాలో సమస్యలు, ముడి పదార్థాల కొరత, ఫైటో శానిటరీ సర్టిఫికేషన్, కొరియర్ సేవలు లేకపోవడం, నౌకాశ్రయాలవద్ద సమస్యలు మొదలైనవి ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తావనకొచ్చాయి. వీటినన్నిటినీ పరిష్కరించి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధరంగాలకు చెందిన వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సాఫీగా జరిగేలా చూస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది.
(Release ID: 1614534)
Visitor Counter : 209