శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై భారత శాస్త్ర-సాంకేతిక సంస్థల పోరు ఉధృతం

Posted On: 06 APR 2020 1:05PM by PIB Hyderabad

 కోవిడ్‌-19గా వ్యవహరించబడుతున్న కరోనా వైరస్‌ అంతుబట్టని రీతిలో విజృంభిస్తూ విశ్వ ప్రజానీకాన్ని కకావికలు చేస్తోంది. ఈ ‘ప్రపంచ కొలమానిక’ (వరల్డోమీటర్‌)లో 10 లక్షల మందికిపైగా జనం వైరస్‌ ధాటికి విలవిల్లాడుతున్నారు. ఈ మహమ్మారికి 59,000 మందికిపైగా బలికాగా, మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. మన దేశంలోనూ ఇప్పటిదాకా 3,000 మందికిపైగా వైరస్‌ బారినపడగా, సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనగల టీకా (వ్యాక్సిన్‌) అన్వేషణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా వనరుల సమీకరణతోపాటు శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో భారతదేశం కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ దిశగా భారత శాస్త్రవేత్తలతోపాటు శాస్త్ర-సాంకేతిక సంస్థలు చేస్తున్న కృషిని సీనియర్‌ సైంటిస్ట్‌ జ్యోతిశర్మ, అంతర్జాతీయ ద్వైపాక్షిక సహకార డివిజన్‌ అధిపతి ఎస్‌.కె.వార్ష్నీ ఈ వ్యాసంలో వివరించారు:
భారత్‌ తక్షణ ప్రతిస్పందన
   ఈ భయానక పరిస్థితినుంచి బయటపడేందుకు భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో సర్వశక్తులూ కేంద్రీకరించి పోరాడుతోంది. దేశంలో విపత్తుల నిర్వహణ చట్టం-2015ను అమలులోకి తెచ్చి మార్చి 25 నుంచి 21 రోజుల జాతీయ దిగ్బంధం విధించింది. సామాజిక దూరంసహా అనేక పటిష్ఠ చర్యలు తీసుకున్న నేపథ్యంలో భారత ప్రతిస్పందనను ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది. మరోవైపు రోగులకు కృత్రిమ శ్వాస కల్పన పరికరాలుసహా అనేక అత్యవసర ఉపకరణాలకు కొరత ఏర్పడింది. ప్రభుత్వం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తిని రగిలించడంతో పరిస్థితి కుదుటపడింది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ నాయకత్వాన శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖల  సమన్వయంతో దేశంలోని శాస్త్రవేత్తలు కూడా ఈ కృషిలో భాగస్వాములయ్యారు.
భారత సర్వోన్నత శాస్త్ర-సాంకేతిక సంస్థ - దాని ప్రయత్నాలు
   శాస్త్ర-సాంకేతిక విభాగం (DST) భారతదేశ సర్వోన్నత శాస్త్ర-సాంకేతిక సంస్థ. ఈ మేరకు తన పరిధిలోని వివిధ సంస్థలు, ఇతర మంత్రిత్వ శాఖలతో సంయుక్తంగా కోవిడ్‌-19 నియంత్రణ సంబంధిత సమస్యల పరిష్కారానికి తగిన సాంకేతికతల రూపకల్పనకు అవిరళ కృషిచేస్తోంది.
‘అధిక ప్రాధాన్య రంగాల్లో ముమ్మర పరిశోధన పథకం’
   డీఎస్‌టీ పరిధిలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బోర్డ్‌ (SERB) ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థ. ఈ సంస్థ చేపట్టిన ‘అధిక ప్రాధాన్య రంగాల్లో ముమ్మర పరిశోధన’ (IRPHA) పథకం కింద అంటువ్యాధుల అధ్యయనం దిశగా జాతీయ పరిశోధన-అభివృద్ధిసహా అనేక అంశాలపై కృషిని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐదు ప్రాజెక్టులను చేపట్టింది.
పరిశోధన ప్రతిపాదనలకు టీడీబీ ఆహ్వానం
   డీఎస్‌టీ పరిధిలోని మరో చట్టబద్ధ సంస్థ సాంకేతిక అభివృద్ధి బోర్డు (TDB) పలు భారత కంపెనీలు, పరిశ్రమలనుంచి పరిశోధనాత్మక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోంది. ఆ మేరకు కోవిడ్‌-19 రోగుల రక్షణ కోసం కుటీర పరిశ్రమల తరహాలో శ్వాసకోశ చికిత్సలో తోడ్పడే పరికరాల ఉత్పత్తిని చేపట్టేందుకు చొరవ తీసుకుంది.
చేతి తయారీ కృత్రిమ శ్వాస పరికరం
   కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని ‘శ్రీచిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ (SCTIMST) కోవిడ్‌-19 రోగుల కోసం చేతి తయారీద్వారా కృత్రిమ శ్వాస పరికరం (AMBU) సృష్టించింది. ఐసీయూ వెంటిలేటర్లు అందుబాటులో లేనివారికి నేడు ఈ ‘అంబు (AMBU)’ ప్రాణవాయువును అందిస్తోంది.
సూక్ష్మజీవి నిరోధక పూత
   డీఎస్టీ పరిధిలోని మరో స్వయంప్రతిపత్తిగల సంస్థ జవహర్లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి (JNCASR) సంస్థ ఏ ఉపరితలంమీదనైనా ఒక్కసారి పూయగానే ఆరిపోయే ‘సూక్ష్మజీవి నిరోధక పూత’ను రూపొందించింది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, సార్స్‌-సీవోవీ2 (కోవిడ్‌-19)సహా వివిధ ఔషధాలను తట్టుకుని బతికే సూక్ష్మజీవులను కూడా ఈ పూత నశింపజేయగలదు.
క్షేత్రస్థాయి ఆవిష్కరణలకు ప్రోత్సాహం
   డీఎస్టీ పరిధిలోని మరొక స్వయంప్రతిపత్తిగల సంస్థ నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ (NSF) కూడా క్షేత్రస్థాయిలో సంస్థలు, వ్యక్తులను వినూత్న ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ‘చాలెంజ్‌ కోవిడ్‌-19 కాంపిటీషన్‌ (C3) పేరిట పలు అంశాల్లో పోటీ నిర్వహిస్తోంది.
శాస్త్ర-సాంకేతిక విభాగం ప్రయత్నాల సమ్మేళనం
   అంకుర సంస్థలు, విద్యాలయాలు, ప్రయోగశాలలు, పరిశ్రమలలో వైరస్‌ వ్యాప్తి నిరోధక సాంకేతిక సామర్థ్యాలను గుర్తించేందుకు ప్రభుత్వం ‘కోవిడ్‌-19 కార్యాచరణ బృందం’ ఏర్పాటు చేసింది. అన్ని ప్రయత్నాలనూ మేళవించి, అందుబాటు ధరలో నిర్ధారణ పరీక్షలు, టీకాలు, నవ్య చికిత్స విధానాలు వంటివాటిని ఆవిష్కరించేలా ప్రోత్సహిస్తోంది.
యుద్ధ ప్రాతిపదికన సమగ్ర కృషి
   కోవిడ్‌-19పై పోరాటంలో భారత ఆరోగ్య, శాస్త్రవిజ్ఞాన సమాజాలను శక్తిమంతమైన భాగస్వాములుగా ఏకతాటిపైకి తేవడానికి భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. వీటన్నిటికీ తోడు ఈ నెల 3న ‘సెంటర్‌ ఫర్‌ ఆగ్‌మెంటింగ్‌ వార్‌ విత్‌ కోవిడ్‌-19 హెల్త్‌ క్రైసిస్‌’ (CAWACH-కవచ్‌) పేరిట రూ.56 కోట్ల వ్యయంతో ఒక కేంద్రాన్ని డీఎస్టీ ఏర్పాటు చేసింది. మొత్తంమీద ప్రపంచ మహమ్మారి నుంచి భారతదేశానికి పూర్తి రక్షణ లభించే రోజు ఎంతో దూరంలోని లేదని ప్రభుత్వం చేపట్టిన ఈ పరిశోధన-అభివృద్ధి చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

*****
 


(Release ID: 1611638)