భారత ఎన్నికల సంఘం

కోవిడ్-19 సందర్భంగా రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్,

తాజా తేదీలు తదుపరి ప్రకటన

Posted On: 03 APR 2020 8:23PM by PIB Hyderabad

ప్రస్తుతం నెలకొన్న అసాధారణ ప్రజారోగ్య ఎమర్జెన్సీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని 324వ అధికరణం, ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 153 కింద తనకు గల ప్రత్యేకాధికారాలను ఉపయోగించుకుంటూ ఏడు రాష్ర్టాల్లో 18 రాజ్యసభ సీట్లకు ఎన్నికలను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన కాలపరిమితి దాటి పొడిగించింది.

ఎన్నికల కమిషన్ 2020 ఫిబ్రవరి 25వ తేదీన ఎన్నికల తేదీలను ప్రకటించి 2020 మార్చి 6వ తేదీన ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. దాని ప్రకారం 17 రాష్ర్టాల శాసనమండలుల్లో 2020 ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్న 55 సీట్లకు ఎన్నికలు ప్రక్రియ చేపట్టింది. 2020 మార్చి 18వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఆయా రాష్ర్టాల్లోని రిటర్నింగ్ అధికారులు 10 రాష్ర్టాలకు చెందిన 37 స్థానాలు ఎలాంటి పోటీ లేకుండానే భర్తీ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయా రిటర్నింగ్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్తాన్ రాష్ర్టాలకు చెందిన 18 స్థానాల్లో ఎన్నికలు 2020 మార్చి 26వ తేదీ నాటికి ముగించి 2020 మార్చి 30వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ఆ మిగిలిన 18 స్థానాల కాలపరిమితి ఈ దిగువ విధంగా ఉంది.

ఎ. 09-04-2020
1. ఆంధ్రప్రదేశ్        - 04
2. జార్ఖండ్                - 02
3. మధ్యప్రదేశ్         -  02
4. మణిపూర్              - 01
5. రాజస్తాన్               - 03
6. గుజరాత్               - 04
         17
బి. 12-04-2020
1. మేఘాలయ       - 01
మొత్తం                 - 18 

కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆసాధారణ ప్రజారోగ్య ఎమర్జెన్సీని పరిగణనలోకి తీసుకుని ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 సెక్షన్ 153 కింద తనకు గల అధికారాలను ఉపయోగించుకుని శాసన మండలుల పోలింగ్ తేదీలు వాయిదా వేయడం, ఓట్ల లెక్కింపు చేపట్టడం సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు 2020 మార్చి 24వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా తెలియచేసింది. ఎన్నికల ప్రక్రియ యథాప్రకారం కొనసాగించాలంటే పోలింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, సపోర్ట్ అధికారులు, పోలింగ్ తేదీన ఆయా రాష్ర్టాల అసెంబ్లీల సభ్యుల కదలికలు, సమావేశాలు తప్పనిసరి కావడం వల్ల దానితో ప్రజల భద్రతకు గల రిస్క్ ను, ఆరోగ్య ముప్పును పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ ఈ అసాధారణ చర్య తీసుకుంది. 

ఎన్నికల కమిషన్ తాజా పరిస్థితిని, ప్రస్తుత వాస్తవాలను మరింతగా సమీక్షించిన అనంతరం ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఆరోగ్యపరమైన ముప్పును నివారించేందుకు దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఆంక్షల కారణంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం సాధ్యం కాదని నిర్ణయించింది.

గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా ఇప్పటి వరకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ ఆధారంగా ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రచురించిన పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల కింద మిగతా ఎన్నికల కార్యకలాపాలు కూడా యథాప్రకారం చెల్లుబాటు అవుతాయి. తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణకు, ఓట్ల లెక్కింపునకు తాజా తేదీలు ప్రకటిస్తుంది.



(Release ID: 1610914) Visitor Counter : 152