రక్షణ మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్‌పై పోరాటంలో చేయూతను కొనసాగిస్తున్న ఐఏఎఫ్
Posted On:
01 APR 2020 3:21PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నిరోధం, కరోనా వైరస్ నియంత్రణపై పోరాటంలో జాతిచేస్తున్న కృషికి భారత వాయుసేన (ఐఏఎఫ్) పూర్తి మద్దతునిస్తోంది. ఈ మేరకు గత మూడు రోజులలో ఢిల్లీ, సూరత్, చండీగఢ్‌ల నుంచి మణిపూర్, నాగాలాండ్‌తోపాటు కేంద్రపాలిత జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు వైద్య నిపుణులుసహా దాదాపు 25 టన్నుల అత్యవసర వైద్య సామాగ్రిని ఐఏఎఫ్ విమానాలు చేరవేశాయి. మరోవైపు లద్దాఖ్ నుంచి కోవిడ్ పరీక్ష నమూనాలను నిత్యం ఢిల్లీకి తీసుకెళ్తున్నాయి. అవసరాన్నిబట్టి సి-17, సి-130, ఏఎన్-32, ఆవ్రో, డోర్నియర్ విమానాలను వాయుసేన సమకూరుస్తోంది. దేశంలోని వివిధ వాయుసేన స్థావరాలలో అనేక దిగ్బంధ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయగా- ఇరాన్, మలేషియాల నుంచి తరలించిన భారత పౌరులకు రెండు కేంద్రాల్లో చికిత్స అందుతోంది. అలాగే బెంగళూరులోని వాయుసేన కమాండ్ ఆస్పత్రిలో కోవిడ్-19 నిర్ధారణ కోసం ప్రయోగశాల పనిచేస్తోంది. మొత్తంమీద కరోనా వైరస్ నిరోధం దిశగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తోంది.
****
(Release ID: 1609951)