వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఔషధాల అందుబాటు, లభ్యతకు మరింత వెసులుబాటు... ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జాతీయ సరిహద్దులగుండా సులభ ప్రవేశం కోసం భారత్ పిలుపు;
అత్యుత్తమ, నాణ్యమైన ఔషధాల అందుబాటు.. సమర్థ నిపుణులకు
భారత్ విశ్వసనీయ వనరుగా ఉందని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టీకరణ;
జి20 విపణులలో నిరంతర... నిరాటంక రవాణా నెట్‌వర్క్‌ల కార్యకలాపాలకు
భరోసా ఇస్తూ కూటమి సభ్య దేశాల వాణిజ్య-పెట్టుబడుల శాఖ మంత్రుల నిర్ణయం
Posted On:
31 MAR 2020 12:04PM by PIB Hyderabad
ప్రపంచ మహమ్మారులపై పోరు దిశగా ఔషధాల అందుబాటు, లభ్యతను మరింత పెంచడానికి, జాతీయ సరిహద్దులద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణుల సులభ ప్రవేశానికి అంతర్జాతీయ చట్రం సృష్టికి కృషి చేయాలని భారత్ పిలుపునిచ్చింది. దృశ్య-శ్రవణ మాధ్యమ సదుపాయంద్వారా నిర్వహించిన జి20 దేశాల వాణిజ్య-పెట్టుబడుల మంత్రుల సమావేశంలో భారత వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ మేరకు ప్రసంగించారు. బహుపాక్షిక ఒప్పందాలకు కట్టుబడటంతోపాటు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనగల సామర్థ్యం మెరుగుపడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా సమర్థ నిపుణులు, నాణ్యమైన ఔషధాల లభ్యత-అందుబాటు ధరల దృష్ట్యా ప్రపంచంలోని దాదాపు 190 దేశాలకు భారత్ విశ్వసనీయ వనరుగా ఉందని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టీకరించారు. “నేడు మనం ఎదుర్కొంటున్న తరహా తీవ్ర సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి సేవలందించడం కోసం మెరుగైన నియంత్రణతోపాటు పరిశోధన-అభివృద్ధి సహకారంతో భారత్ ముందంజ వేయగలదు. ఈ దిశగా ప్రస్తుత అశక్తతను పరిష్కరించుకుని నిరుపేదల జీవితాలు, జీవనోపాధి, పౌష్టికాహార భద్రతలకు భరోసా ఇవ్వగల సాధనోపకరణాలకు మనం వీలు కల్పించాలి” అని ఆయన విశదీకరించారు. అలాగే...
“నియమాల ఆధారిత, ప్రగతి కేంద్రక బహుపాక్షిక వ్యవస్థ ఏర్పాటుద్వారా వాణిజ్య తదితర రంగాల్లో మన సమష్టి కృషి ప్రతిఫలించాలి. జాతీయ అవసరాలకు కొరత ఏర్పడకుండా వస్తుసేవలు- ముఖ్యంగా ప్రాణరక్షక ఔషధాలు, ఆహార ఉత్పత్తుల సరఫరాకు మనం భరోసా ఇవ్వాలి” అన్నారు. దీనికి తగినట్లు వాణిజ్య సౌలభ్య కల్పన, అవసరమైన సందర్భాల్లో కస్టమ్స్, బ్యాంకులు తదితరాల్లోనేగాక వస్తుసేవల సరఫరా విషయంలోనూ నిబంధనల పూర్తి సడలింపులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జి20 విపణులలో నిరంతర... నిరాటంక రవాణా నెట్‌వర్క్‌ల కార్యకలాపాలకు భరోసా ఇస్తూ కూటమి సభ్య దేశాల వాణిజ్య-పెట్టుబడుల శాఖ మంత్రుల సమావేశం నిర్ణయం ప్రకటించింది. అంతకుముందు ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 ప్రపంచానికే పెనుసవాలుగా మారిందని, అంతర్జాతీయ సమన్వయ కృషితోనే దీన్ని తుడిచిపెట్టగలమని కూటమి దేశాల మంత్రులేగాక అతిథులుగా పాల్గొన్న దేశాల ప్రతినిధులు కూడా ముక్తకంఠంతో ప్రకటించారు. తదనుగుణంగా సమావేశం ముగిశాక ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంక్షోభం నుంచి మానవాళి రక్షణతోపాటు తదనంతరం సుస్థిర-సమతుల, సార్వజనీన, శక్తిమంతమైన రీతిలో ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణకు గట్టి పునాదులు వేసేలా అంతర్జాతీయ సమాజం తన సమన్వయ, సహకారాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 నిర్మూలనకు ఉద్దేశించిన అత్యవసర చర్యలను అవసరమైతే నిర్దిష్ట లక్ష్యం దిశగా యథోచిత, పారదర్శక, తాత్కాలిక ప్రాతిపదికన పరిమితం చేయాలని ప్రకటన పేర్కొంది. ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను అతిక్రమించని రీతిలో ఉండటంతోపాటు వాణిజ్యానికి, అంతర్జాతీయ సరఫరా శృంఖలాలకు అడ్డుకట్టలు వేసేలా ఉండరాదని స్పష్టం చేసింది.
*****
(Release ID: 1609623)
Visitor Counter : 136