రైల్వే మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల లభ్యతకు లోటులేకుండా నిరంతర కృషిచేస్తున్న భారతీయ రైల్వేలు
నిన్న (శుక్రవారం) 34000కు పైగా సరుకుల వ్యాగన్లను నింపగా అందులో 23000కు పైగా వ్యాగన్లు నిత్యావసర సరుకులతో వెళ్ళాయి
Posted On:
28 MAR 2020 2:48PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ ప్రారంభమైన మూడవ రోజున నిత్యావసర సరుకుల లభ్యతకు లోటులేకుండా తమ సరుకుల రవాణా సేవల ద్వారా బారతీయ రైల్వేలు అన్ని రకాలుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కూడా నిత్యావసర సరుకుల సరఫరాకు అంతరాయం లేకుండా వివిధ గూడ్స్ షెడ్లు, స్టేషన్లు మరియు నియంత్రణ కార్యాలయాలలో నియమితులైన రైల్వే సిబ్బంది రేయింబవళ్ళు 24/7 పద్ధతిలో పని చేస్తూ సరుకుల రవాణా ఆగకుండా చూస్తున్నారు.
సరుకుల సరఫరా ఆగకుండా నిన్నటి అంటే 27 మార్చి , 2020 రోజున 34648 వ్యాగన్లను నింపి పంపడం జరిగింది. వాటిలో 23682 వ్యాగన్లు నిత్యావసర సరుకులతో వెళ్ళాయి. వాటిని 425 ఇంజన్లతో పంపారు. ఆ విధంగా గత ఐదు రోజుల్లో నిత్యావసరాలు తీసుకెళ్ళిన వ్యాగన్ల సంఖ్య సుమారుగా 1.25 లక్షలను చేరింది.
23682 నిత్యావసర సరుకుల వ్యాగన్లను నింపగా వాటిలో 1576 వ్యాగన్లు ఆహార ధాన్యాలు, 42 వ్యాగన్లు పళ్ళు మరియు కూరగాయలు, 42 వ్యాగన్లు పంచదార, 42 వ్యాగన్లు ఉప్పు, 20488 వ్యాగన్లు బొగ్గు, 1492 వ్యాగన్లు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొని వెళ్ళాయి.
దేశవ్యాప్తంగా వివిధచోట్ల సులభంగా సరుకులను నింపి రవాణా చేయడానికి, దింపుకోవడానికి వీలుగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంక్షలను సడలించింది. అందువల్ల దేశవ్యాప్తంగా వివిధ టర్మినళ్ళ వద్ద అనుమతుల కోసం అభ్యర్దించే, వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. దీంతో లాక్ డౌన్ సమయంలో కూడా నిత్యావసర సరుకుల నిరంతర రవాణాకు భారతీయ రైల్వేలు ప్రత్యేక కృషి చేస్తున్నాయి.
****
(Release ID: 1608873)