ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 నేతల విర్చువల్ శిఖరాగ్ర సమావేశం
Posted On:
26 MAR 2020 10:08PM by PIB Hyderabad
కోవడ్ - 19 మహమ్మారి విస్తరణ నేపథ్యంలో, దీని నివారణ కోసం అంతర్జాతీయంగా సమన్వయంతో కలిసి పని చేయడంపై జి20 నేతల విర్చువల్ శిఖరాగ్ర సమావేశం మార్చి 26న జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అసాధారణమైన సమావేశం. ఈ సమావేశానికంటే ముందు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజుతో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ ప్రత్యేక శిఖరాగ్ర సమావేశమనేది అంతకు ముందు జరిగిన ఆర్ధిక శాఖ మంత్రులు మరియు కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం మరియు జి 20 షెర్పాల సమావేశానికి కొనసాగింపుగా జరిగిన ముగింపు సమావేశం లాంటిది. కోవిడ్ 19 నిరోధం కోసం ఇవన్నీ ప్రత్యేకంగా జరిగాయి.
కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికిగాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తమ తమ దేశాల్లో ప్రజలను రక్షించుకుంటామని జి20 నేతలు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటూ ఈ మహమ్మారిని అరికట్టాలని నేతలు నిర్ణయించారు. మందుల పంపిణీ, రోగ నిర్దారణ పరికరాలు, చికిత్సలు, టీకాలు తదితర అంశాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జరగాలని అందరూ నిర్ణయించారు.
ఈ మహమ్మారి కారణంగా ఆర్ధికంగాను, సామాజికంగాను కలుగుతున్న ఖర్చులను సాధ్యమైనంతవరకు తగ్గించడానికి అందుబాటులోని విధానపరమైన పరికరాలన్నిటినీ వాడుకుందామని నేతలు నిర్ణయించారు. తద్వారా అంతర్జాతీయంగా వృద్ధి, మార్కెట్ స్థిరత్వం, సమస్యలను ఎదుర్కొనే సమర్థత బలోపేతం కావడం జరుగుతాయని అన్నారు. కోవిడ్ 19 కలగజేస్తున్న ఆర్ధిక, సామాజిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికిగాను 5 ట్రిలియన్ డాలర్లను అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలోకి తీసుకు రావాలని నేతలు నిర్ణయించారు. అంతే కాదు ఈ వైరస్ పై పోరాటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను అందించాలని నేతలంతా అంగీకరించారు.
జి20 కి సంబంధించిన ఈ అసాధారణ సమావేశాన్ని నిర్వహించినందుకు సౌదీ అరేబియా రాజుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19కు సంబంధించిన 90 శాతం కేసులు, మరణాల్లో 80 శాతం జి20 దేశాల్లోనే జరుగుతున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచ జిడిపిలో 80 శాతం, ప్రపంచ జనాభాలో 60 శాతం జి 20 దేశాలనుంచేనని ప్రధాని వివరించారు. ఈ నేపథ్యంలో జి 20 దేశాలు పటిష్టమైన ప్రణాళికతో, ఈ అంతర్జాతీయ మహమ్మారిని అరికట్టాల్సి వుందని ప్రధాని స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా సౌభాగ్యాన్ని, సహకారాన్ని సాధించడానికిగాను మానవాళి సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకోవాలని ప్రధాని కోరారు. ఆరోగ్య రంగంలో చేసిన పరిశోధనల్ని, అభివృద్ధిని అన్ని దేశాలు పంచుకోవాలని అన్నారు. అంతేకాదు అందరూ అనుసరించగలిగే బాధ్యతాయుతమైన, మానవతతోకూడిన ఆరోగ్య భద్రత వ్యవస్థలను తయారు చేసుకోవాలని కోరారు. సంక్షేభ నివారణకోసం నూతన మార్గదర్శకాల ఏర్పాటును, విధానాలను ప్రోత్సహించాలని, తద్వారా అన్ని దేశాలకు ఒకదానితో మరొకటి సంబంధముండేలా చూడాలని ప్రపంచ ఆరోగ్యసంస్థలాంటి అంతర్జాతీయ సంస్థలను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. ఆ విధంగా కోవిడ్ 19 వైరస్ కారణంగా వచ్చిన ఆర్ధిక పరమైన కష్టాలను తగ్గించుకోవచ్చని ముఖ్యంగా ఆర్ధికంగా బలహీనంగా వున్నవారికి ఇది మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నూతన గ్లోబలీకరణ సాధించడానికి జి 20 దేశాలు సహాయ సహకారాలు అందించాలని మానవాళి ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ శిఖరాగ్ర సమావేశం చివరన జి20 నేతల ప్రకటనను విడుదల చేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికిగాను సమన్వయంతో కూడిన అంతర్జాతీయ స్పందన వుండాలని అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. వాణిజ్యపరంగా కలిగే అంతరాయాలను తగ్గించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సహకారాన్ని పెంచడానికిగాను చర్యలను చేపట్టాలని జి20 దేశాల నేతలు పిలుపునిచ్చారు.
(Release ID: 1608476)
Visitor Counter : 230