ప్రధాన మంత్రి కార్యాలయం
‘జాతిర్ పిత’ బంగబంధు, శేఖ్ ముజిబుర్ రహమాన్ శత జయంతి వేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
బాంగ్లాదేశ్ మరియు భారతదేశం మధ్య గల ప్రగాఢమైన సంబంధాలు బంగబంధు యొక్క వారసత్వం మరియు ప్రేరణ ల పై ఆధారపడి ఉన్నాయి అని పేర్కొన్న ప్రధాన మంత్రి
Posted On:
17 MAR 2020 8:24PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జాతిర్ పిత’ బంగబంధు, శేఖ్ ముజిబుర్ రహమాన్ యొక్క జయంతి తాలూకు 100వ ఉత్సవాల లో ఈ రోజు న ఒక వీడియో సందేశాన్ని అందించారు.
గడచిన శతాబ్ది లో ఆవిర్భవించిన మహనీయుల లో శేఖ్ ముజిబుర్ రహమాన్ ఒకరు అని శ్రీ మోదీ అభివర్ణించారు. ‘‘వారి యొక్క యావత్తు జీవితం మనకు అందరికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రేరణ ను ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.
బంగబంధు ను ధైర్యశాలి గా, శాంతి కాముకుని గా ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ యొక్క ‘జాతిర్ పిత’ ఆ కాలం లో సవాళ్ళ ను ఎదుర్కొనేందుకు యువత లో స్ఫూర్తి ని నింపారు అని శ్రీ మోదీ అన్నారు.
అణచివేత ధోరణి కలిగిన ఒక క్రూరమైన హయాం అన్ని ప్రజాస్వామిక విలువల ను త్రోసిరాజని ‘బాంగ్లా గడ్డ’ మీద అన్యాయపు పాలన కు తెర తీసిందని, ఆ దేశ ప్రజల ను పీడించిందని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సదరు విధ్వంస దశ నుండి మరియు మారణకాండ నుండి బాంగ్లాదేశ్ ను బయటకు తెచ్చి, దాని ని ఒక ప్రగతిశీలమైనటువంటి మరియు సకారాత్మకమైనటువంటి సమాజం గా తీర్చిదిద్దడం లో తన జీవితం లోని ప్రతి క్షణాన్ని సమర్పణం చేశారన్నారు.
‘‘ద్వేషం మరియు నకారాత్మకత ఏ దేశ అభివృద్ధి కి అయినా పునాది గా ఎన్నటికీ నిలువజాలవని బంగబంధు సుస్పష్టం గా ఎరుగుదురని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, బంగబంధు యొక్క ప్రయత్నాల ను మరియు ఆలోచనల ను కొందరు ఇచ్చగించలేదని, వారు ఆయన ను మన నుండి దూరం చేశారని’’ శ్రీ మోదీ అన్నారు.
‘‘భయం మరియు హింస అనేవి రాజకీయ అస్త్రాలుగా చేసుకొని, ఒక దేశ ప్రజల ను మరియు ఒక సమాజాన్ని ఏ విధం గా వినాశం పాలు చేయవచ్చో మనం అందరమూ గమనిస్తున్నాము. ప్రస్తుతం హింస మరియు భయం ఈ రెండిటి మద్ధతుదారులు ఎక్కడ తిష్ట వేసిందీ కూడా ప్రపంచం వీక్షిస్తున్నది. కాగా, బాంగ్లాదేశ్ క్రొత్త శిఖరాల కు ఎగబాకుతున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శేఖ్ ముజిబుర్ రహమాన్ కలగన్న ‘శోనార్ బాంగ్లా’ మాదిరిగా దేశాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం బాంగ్లాదేశ్ ప్రజలు రేయింబగళ్ళు తమను తాము సమర్పణం చేసుకోవడాన్ని చూస్తున్న తనకు ఎంతో సంతోషం కలుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
శేఖ్ హసీనా యొక్క నాయకత్వం లో అభివృద్ధి ప్రధానమైనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకుపోయేటటువంటి విధానాల బాట లో బంగబంధు అందించిన ప్రేరణ తో బాంగ్లాదేశ్ పురోగమిస్తున్నదని ప్రధాన మంత్రి ప్రశంసించారు. బాంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, మరి ఇతర సమాజిక సూచీల లో సరిక్రొత్త కొలమానాల ను ఏర్పరుస్తున్నదని కూడా ఆయన అన్నారు. నైపుణ్యాలు, విద్యార్జన, ఆరోగ్యం, మహిళల కు సాధికారిత కల్పన, ఇంకా మైక్రో ఫినాన్స్.. తదితర అనేక రంగాల లో బాంగ్లాదేశ్ ఇదివరకు ఎరుగనటువంటి రీతిన సాధిస్తున్న ప్రగతి ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
‘‘గడచిన కొన్ని సంవత్సరాల లో బాంగ్లాదేశ్ మరియు భారతదేశం ద్వైపాక్షిక సంబంధాల లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించాయి. అంతేకాదు, మన భాగస్వామ్యాని కి ఒక నూతన దిశ ను మరియు ఒక నూతన పార్శ్వాన్ని జోడించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సంక్లిష్టమైనటువంటి సరిహద్దు సంబంధిత అంశాల ను ఒక మైత్రీపూర్వకమైన రీతిన పరిష్కరించుకొనేందుకు ఉభయ దేశాల నడుమ విశ్వాసం అధికం అవుతున్న కారణంగానే ఇది సాధ్యపడిందన్నారు.
బాంగ్లాదేశ్ దక్షిణ ఆసియా లో భారతదేశాని కి అతిపెద్ద వ్యాపార భాగస్వామి గానే కాకుండా, ఒక అభివృద్ధి ప్రధాన భాగస్తురాలు కూడా అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్తు ప్రసారం, మైత్రీపూర్వక గొట్టపు మార్గం, రహదారి, రైలు మార్గాలు, ఇంటర్ నెట్, ఎయర్ వేస్, ఇంకా వాటర్ వేస్.. ల వంటి సంధానాన్ని పెంపొందించే పలు రంగాల లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోందని ఆయన వివరించారు.
శ్రీయుతులు ఠాగూర్, కాజీ నాజ్‌రుల్ ఇస్లామ్, ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్, నాలన్ శాహ్, జీబానంద దాస్ మరియు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ల వంటి పండితుల నుండి ఉభయ దేశాల కు లభించిన వారసత్వాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
బంగబంధు యొక్క ప్రేరణ, వారసత్వం ఉభయ దేశాల వారసత్వాన్ని మరింత సంపూర్ణమైంది గాను, దృఢతరమైంది గాను మార్చివేసిందని, మరి బంగబంధు చూపిన మార్గం గడచిన దశాబ్ద కాలం లో రెండు దేశాల భాగస్వామ్యం, పురోగతి, ఇంకా సమృద్ధి లకు ఒక బలమైన పునాది ని వేసిందని ప్రధాన మంత్రి అన్నారు.
రెండు దేశాల లో రాబోయే చారిత్రక ఘట్టాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వాటిలో బాంగ్లాదేశ్ విముక్తి తాలూకు 50వ వార్షికోత్సవం వచ్చే సంవత్సరం లో ఉందని, అలాగే, భారతదేశాని కి స్వాతంత్య్రం లభించిన తరువాత 75వ వార్షికోత్సవాన్ని 2022వ సంవత్సరం లో జరుపుకోనున్నామని ఆయన తెలిపారు. ఈ రెండు చారిత్రక ఘట్టాలు బాంగ్లాదేశ్ మరియు భారతదేశం అభివృద్ధి ని క్రొత్త శిఖరాల కు చేర్చడం ఒక్కటే కాకుండా, ఉభయ దేశాల మధ్య మైత్రీ బంధాన్ని దృఢతరం చేస్తాయని కూడా ప్రధాన మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 1607014)
Visitor Counter : 110