ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థ-ప్రత్యేకించి మధ్యతరగతి
పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ఊరట
(కొత్త పన్ను వ్యవస్థకు మార్పుపై పన్ను చెల్లింపుదారులదే నిర్ణయం
కొత్త పన్ను శాతాలవల్ల ప్రభుత్వానికి ఏటా రూ.40వేల కోట్ల రాబడి తగ్గుదల)
Posted On:
01 FEB 2020 2:43PM by PIB Hyderabad
నవ భవిష్య భారతం, సార్వజనీన ఆర్థికాభివృద్ధి, సంరక్షణపూర్వక సమాజం, ప్రజలందరికీ జీవన సౌలభ్యం ప్రధాన ఇతివృత్తాలుగా రూపొందించిన 2020-21 కేంద్ర బడ్జెట్‘ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‘సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా 16 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా ప్రకటించారు. దేశ పౌరుల ఆదాయ వృద్ధి చర్యలద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచడంపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని ఆమె తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. మొత్తంమీద అవినీతి రహిత, విధాన ఆధారిత సుపరిపాలనతో ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని విశదీకరించారు. బడ్జెట్ ప్రతిపాదనల మేరకు వివిధ రంగాలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి:
⦁ ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని వర్తింపజేస్తారు. ప్రత్యేక కిసాన్ రైలు, కిసాన్ ఉడాన్ పథకాలను ప్రవేశపెట్టనున్నారు.
⦁ వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 2020-21 సంవత్సరానికి రూ.15 లక్షల కోట్లుగా నిర్దేశించారు.
⦁ వ్యక్తిగత ఆదాయం పన్నుపై కొత్త విధానం ప్రకటించారు. ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు రాయితీలు, మినహాయింపులు వదులుకుని ఈ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకోవచ్చు.
⦁ విద్యుదుత్పాదనలో కొత్త దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 15 శాతంగా నిర్ణయించారు.
⦁ దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై ఆరోగ్య సెస్ విధించారు.
⦁ ప్రత్యక్ష పన్నుల వివాదాలను తగ్గించేందుకు ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రతిపాదించారు.
⦁ సరళీకృత వస్తుసేవల పన్ను (GST) రిటర్నులు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.
⦁ దేశంలోని అన్ని జిల్లాల్లో 2024 కల్లా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
⦁ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.67,112 కోట్లు కేటాయించారు.
⦁ మానవ వనరుల అభివృద్ధికి రూ.99,312 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1, 22,398 కోట్లు, వ్యవసాయం-రైతు సంక్షేమానికి రూ.1,42,762 కోట్లు వంతున కేటాయించారు.
ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానంపై ఆర్థిక మంత్రి వివరణ మేరకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ఊరట లభిస్తుంది. అయితే, ప్రస్తుత విధానం కింద పలు సెక్షన్ల ప్రకారం వారు పొందుతున్న రాయితీలు, మినహాయింపులన్నిటినీ వదులుకుని కొత్త పథకంలోకి మారవచ్చు. దీనివల్ల వారిపై పన్ను భారం తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఉదాహరణకు రూ.15 లక్షల వార్షికాదాయంగల వ్యక్తి ప్రస్తుత శ్లాబు ప్రకారం రూ.2,73,000 మేర పన్ను చెల్లించాల్సి ఉంటుందని, కొత్త వ్యవస్థలోకి మారితే కేవలం రూ.1,95,000 చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. తద్వారా రూ.73,000 ఆదా అవుతుందని వివరించారు. అయితే, కొత్త పన్ను శ్లాబులవల్ల ప్రభుత్వం ఏటా రూ.40,000 కోట్లు నష్టపోతుందని అంచనా.
**********
(Release ID: 1601618)