ప్రధాన మంత్రి కార్యాలయం

ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు ఉపాధ్యాయ స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ లేఖ‌

Posted On: 05 SEP 2018 7:38PM by PIB Hyderabad

ఉపాధ్యాయుల‌ దినోత్స‌వం సంద‌ర్భంగా డాక్ట‌ర్ ఎస్‌. రాధాకృష్ణ‌న్ కు  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజలిని ఘటిస్తూ, ఉపాధ్యాయ స‌ముదాయానికి శుభాకాంక్ష‌లను తెలియజేశారు.  గురువులు విద్యాబుద్ధులను నేర్ప‌డం తో పాటు విజ్ఞానవంతులను చేస్తార‌ని, అంతేకాకుండా ప్రేర‌ణ ను రగిలిస్తార‌ని ఆయ‌న అన్నారు.  

ల‌క్ష‌లాది ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాన మంత్రి ఒక ఇ-మెయిల్ ను పంపిస్తూ, ఆ లేఖ లో ఉపాధ్యాయులు బాల‌ల జీవితాల పైన అమితమైనటువంటి ప్ర‌భావాన్ని ప్ర‌స‌రింపజేస్తున్నార‌ని ప్ర‌స్తావించారు.  ఉపాధ్యాయులు అందించే విలువ‌లు విద్యార్థులను వారి జీవన ప‌ర్యంతం అంటిపెట్టుకొనివుంటాయని ఆయ‌న పేర్కొన్నారు.

‘‘ఒక వ్య‌క్తి యొక్క స్వ‌భావాన్ని, సామ‌ర్ధ్యాన్ని మ‌రియు భ‌విష్య‌త్తు ను తీర్చిదిద్దే ప‌విత్ర‌మైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి’’ అని ప్ర‌వ‌చించిన పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లాం ప‌లుకు ల‌ను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ఉదాహరించారు.

ఇరవై ఒకటో శతాబ్దం విద్య కు, ప‌రిశోధ‌న కు మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ కు అత్యంత అగ్రగామి ప్రాధాన్యాన్ని క‌ట్ట‌బెట్టే స‌మాజాలతో రూపుదాల్చుతుంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు.  ‘‘ఇది మ‌న ఉపాధ్యాయుల భూమిక ను అత్యంత కీల‌క‌మైంది గా మార్చుతోంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌రలేదు’’ అని కూడా ఆయ‌న అన్నారు.

‘‘సాంకేతిక విజ్ఞానం లో చోటుచేసుకొంటున్న తాజా ప‌రిణామాల‌ ను మీరు ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకొంటూ, వాటిని విద్యార్థులతో పంచుకొంటున్నార‌న్న నమ్మకం నాకుంది’’ అని ఉపాధ్యాయుల కు తాను వ్రాసిన లేఖ లో ప్ర‌ధాన మంత్రి  పేర్కొన్నారు.  విద్య రంగం లో ఒక రూపావ‌ళి ప‌ర‌మైన ప‌రివ‌ర్త‌న ను తీసుకు రావ‌డం కోసం భార‌త ప్ర‌భుత్వం తీసుకొంటున్న చర్యలలో కొన్ని చ‌ర్య‌లను కూడా ఆయ‌న త‌న లేఖ లో ప్ర‌స్తావించారు.  

‘‘మీ వంటి ఉపాధ్యాయుల బృహ‌ద్యత్నాల కార‌ణంగా, దృష్టి అంతా వ్య‌యాల క‌న్నా ఫ‌లితాల వైపున‌కు, బోధ‌న నుండి నేర్చుకోవ‌డం వైపున‌కు విజ‌య‌వంతంగా మ‌ర‌లింది.  నైపుణ్యాల వికాసం పై సారించ‌వ‌ల‌సిన దృష్టి అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ కార‌ణంగా ఒక గ‌ణ‌నీయ‌మైన ఉత్తేజాన్ని అందుకొంది.  ఏ ఒక్క యువ ప్ర‌తినిధి కి ఈ గుణాత్మ‌కమైన విద్య తాలూకు ఉల్లాసాలు అంద‌కుండా పోయే అగ‌త్యం త‌లెత్త‌కూడదనే భార‌త‌దేశం అంత‌టా అసంఖ్యాకంగా విశ్వ విద్యాల‌యాలను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

అక్టోబ‌రు 2వ తేదీ నాడు మ‌నం మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి వేడుక‌ల‌ను ఆరంభించుకో బోతున్నాం అని ప్ర‌ధాన మంత్రి గుర్తుచేశారు.  బాపూ జీ ప్ర‌బోధించిన భావాలను మరియు ప‌విత్ర‌ ఆద‌ర్శాల‌ను విద్యార్థులలో వ్యాప్తి చేయడం లో నాయ‌క‌త్వ స్థానాన్ని వ‌హించ‌ండంటూ ఉపాధ్యాయ లోకానికి ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు.  ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ ను బ‌లోపేతం చేయ‌డం లో ఉపాధ్యాయుల‌ మ‌హ‌త్త‌రమైన పాత్ర ను అని ఆయ‌న కొనియాడారు. 

స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవ‌త్స‌రాలు అయ్యే 2022వ సంవ‌త్స‌రానిక‌ల్లా ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్క‌రించాల‌న్న త‌న దార్శ‌నిక‌త‌ ను ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటిస్తూ, మ‌న దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ స‌మ‌ర్ప‌ణ చేసిన వారి క‌ల‌ల‌ను మ‌రియు దార్శ‌నిక‌త ను నెర‌వేర్చే దిశ గా రానున్న నాలుగు సంవ‌త్స‌రాల‌లో తమను తాము అంకితం చేసుకోవలసిందిగా ఉపాధ్యాయ స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

‘‘మీ హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఏదైనా ఒక అంశం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించవలసిందిగా మీకు నేను విన్నవించుకొంటున్నాను.  ఆ అంశం విషయంలో స్థానిక సముదాయాల‌ను స‌మీక‌రించండి.  అలాగే, మీ చుట్టూరా ఉండే వ్య‌క్తుల జీవితాల లో ఒక స‌కారాత్మ‌క‌మైన వ్య‌త్యాసాన్ని తీసుకు రండి.  ఇది మ‌న స్వాతంత్య్ర యోధుల కు ఇవ్వ‌గ‌ల ఒక స‌ముచిత‌మైన నివాళి అవుతుంది.  అంతేకాదు, ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాల‌న్న సంక‌ల్పాన్ని ఇది బ‌ల‌ప‌రుస్తుంది కూడా’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.


**



(Release ID: 1545197) Visitor Counter : 146