Economy

నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్: సమ్మిళిత పారిశ్రామిక‌త‌కు ఊతం

प्रविष्टि तिथि: 08 OCT 2026 10:25 AM

 

ఎస్సీ/ఎస్టీ సంస్థల సామర్థ్యాలను పెంచుతూ, విస్తృత మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) సహకరిస్తోంది. ఆర్థిక సహాయం, సాంకేతికత, శిక్షణ, మార్గదర్శకత్వం, మార్కెట్ అనుసంధానం వంటి చర్యల ద్వారా సంస్థల వృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే ప్రధాన అడ్డంకులను ఈ పథకం పరిష్కరిస్తోంది. ప్రభుత్వ కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థలను సంస్థాగత కొనుగోలుదారులతో అనుసంధానిస్తోంది. పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య, శిక్షణ సహాయం, కొనుగోళ్లలో భాగస్వామ్యంతో మరింత పోటీతత్వం కలిగిన ఎంఎస్ఎంఈ వ్యవస్థ రూపకల్పనకు ఎన్ఎస్ఎస్‌హెచ్ దోహదం చేస్తోంది.

సమ్మిళిత పారిశ్రామిక‌త‌కు అవ‌స‌ర‌మైన‌ వ్యవస్థ నిర్మాణం
భారత్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహికత, ఉపాధి, ఆర్థిక అవకాశాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) కీలక మార్గంగా నిలుస్తున్నాయి. చారిత్రకంగా తగిన ప్రాతినిధ్యం లభించని వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాల్లో పాల్గొని, పోటీపడి, ఎదిగేలా చేయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించవచ్చు. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గాల్లో సంస్థల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ప్రధాన ప్రాధాన్యంగా నిలిచింది. ఆర్థిక వనరులు, నైపుణ్యాలు, సాంకేతికత, మార్కెట్లకు మెరుగైన ప్రాప్యత కల్పించడం ద్వారా భారత ఎంఎస్ఎంఈ వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని విస్తరించవచ్చు.

నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్: సంస్థల వృద్ధికి సహకారం
2016 అక్టోబర్ 18న ప్రారంభమైన నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) పథకం.. వ్యాపార సంస్థల వృద్ధి ప్రయాణంలోని వివిధ దశల్లో ప్రత్యేక సహాయం అందిస్తోంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) ద్వారా అమలవుతున్న ఈ పథకం ఎస్సీ/ఎస్టీ యాజమాన్య సంస్థలు ఎదుర్కొనే అడ్డంకులను అధిగమించేందుకు, ప్రభుత్వ కొనుగోళ్లలో వాటి భాగస్వామ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతోంది.

శిక్షణ, మార్గదర్శకత్వం, వ్యాపారాభివృద్ధి, భాగస్వామ్య సంబంధాల ఏర్పాటు, విజ్ఞాన సహాయం వంటి కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్‌హెచ్ చేపడుతోంది. ఈ చర్యలు పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, పోటీతత్వ సంస్థలను నిర్మించుకోవడానికి సహాయపడుతున్నాయి.

 



విస్తరిస్తున్న పరిధి.. మరింత సమ్మిళిత వృద్ధి
సహాయం పొందిన పారిశ్రామికవేత్తల సంఖ్యలోనే కాకుండా మార్కెట్లలో వారి పెరుగుతున్న భాగస్వామ్యంలోనూ ఎన్ఎస్ఎస్‌హెచ్ ప్రభావం కనిపిస్తోంది. పారిశ్రామిక‌త‌ సహాయాన్ని కొనుగోలు అవకాశాలతో అనుసంధానించడం ద్వారా ఎస్సీ/ఎస్టీ యాజమాన్య వ్యాపారాలు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి, మార్కెట్ ఉనికిని విస్తరించుకోవడానికి, స్థిరమైన వృద్ధి సాధించడానికి ఈ పథకం తోడ్పడుతోంది.

పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూలై 31 వరకు ఎన్ఎస్ఎస్‌హెచ్ 1,90,414 మంది లబ్ధిదారులకు సహాయం అందించగా, 54,499 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చింది. ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. 2015–16లో ₹99.37 కోట్లుగా ఉన్న కొనుగోళ్లు 2025–26 నాటికి దాదాపు 39 రెట్లు పెరిగి ₹4,013.42 కోట్లకు చేరాయి. ఎన్ఎస్ఎస్‌హెచ్ అమలులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం తొలి ఐదు రాష్ట్రాలుగా నిలిచాయి.

2025–26లో సాధించిన పురోగతి:
- 12,524 సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి ₹4,013.42 కోట్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి.
- 24 ఆకాంక్షిత జిల్లాలతో సహా 27 రాష్ట్రాల్లోని 47 సంస్థల ద్వారా 10,717 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు.
- శిక్షణ పొందిన అభ్యర్థుల్లో 55 శాతం మంది మహిళలు.

 



శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వ కొనుగోళ్లు, జెమ్ అవకాశాలకు అనుగుణంగా రూపొందించి, వాటి మార్కెట్ ప్రాధాన్యాన్ని పెంచారు. క్యాఫెటీరియా నిర్వహణ, ఆహార ఉత్పత్తి, వెల్డింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్)/కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్), లాండ్రీ సేవలు, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, వెదురు ఆధారిత పనులు ప్రధాన శిక్షణ రంగాలుగా ఉన్నాయి.

వృద్ధి ప్రయాణంలోని ప్రతి దశలో సంస్థలకు సహాయం
సంస్థల వృద్ధికి సంబంధించిన విభిన్న అవసరాలను తీర్చేందుకు ఎన్ఎస్ఎస్‌హెచ్ పలు కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది.

స్పెషల్ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (ఎస్సీఎల్‌సీఎస్ఎస్)
ప్లాంట్లు, యంత్రాలు, పరికరాల్లో పెట్టుబడుల ద్వారా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొత్త, ఇప్పటికే పనిచేస్తున్న ఎస్సీ/ఎస్టీ యాజమాన్య సూక్ష్మ, చిన్న సంస్థలకు ఎస్సీఎల్‌సీఎస్ఎస్ సహాయం అందిస్తోంది. సంస్థాగత రుణంతో కొనుగోలు చేసే పరికరాలకు గరిష్ఠంగా ₹25 లక్షల పరిమితితో 25 శాతం మూలధన రాయితీ ఇస్తోంది. ఉత్పత్తి లేదా రంగాలవారీ పరిమితులు లేకుండా తయారీ, సేవా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.

పథకం ప్రారంభమైన 2016 నుంచి 2026 మార్చి వరకు పురోగతి:
- 3,160 సూక్ష్మ, చిన్న సంస్థలకు ₹356.10 కోట్ల సహాయం
- 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 233 జిల్లాలకు విస్తరించిన పథకం పరిధి

సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ (ఎస్పీఆర్‌ఎస్)
ఎన్ఎస్ఐసీ వద్ద నమోదు ద్వారా ప్రభుత్వ కొనుగోలు అవకాశాలను పొందేందుకు సూక్ష్మ, చిన్న సంస్థలకు ఎస్పీఆర్‌ఎస్ సహకరిస్తోంది. నమోదిత సంస్థలకు ఉచిత టెండర్ పత్రాలు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు ఇతర కొనుగోలు ప్రయోజనాలు లభిస్తాయి.

పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక కొనుగోళ్లలో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి చేపట్టాలి. మొత్తం కొనుగోళ్లలో 4 శాతం ఎస్సీ/ఎస్టీ యాజమాన్య సూక్ష్మ, చిన్న సంస్థలకు కేటాయించారు.

స్పెషల్ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్ (ఎస్ఎంఏఎస్)
ప్రదర్శనలు, వాణిజ్య ఉత్సవాలు, విక్రేతల కార్యక్రమాలు, కార్యశాలలు, అవగాహన ప్రచారాల ద్వారా ఎస్సీ/ఎస్టీ సంస్థల ఉత్పత్తులకు గుర్తింపు, పోటీతత్వం పెంచేందుకు ఎస్ఎంఏఎస్ సహకరిస్తోంది. నమోదిత సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా నాలుగు దేశీయ, రెండు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు సూక్ష్మ సంస్థలకు గరిష్ఠంగా ₹3 లక్షలు, చిన్న సంస్థలకు ₹2.5 లక్షలు, మధ్యతరహా సంస్థలకు ₹1.5 లక్షల వరకు సహాయం లభిస్తుంది. సంస్థలు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఎంఎస్ఎంఈ డేటా బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి.

2025–26లో పురోగతి:
- నాలుగు దేశీయ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు 141 ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థలకు సహాయం
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి 247 ప్రత్యేక విక్రేతల అభివృద్ధి కార్యక్రమాలు
- 197 ఈ–టెండరింగ్ కార్యశాలలు
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి 230 అవగాహన కార్యశాలలు

బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్
ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థల రుణ వ్యయాన్ని తగ్గించేందుకు రుణ ప్రాసెసింగ్ రుసుములో 80 శాతం లేదా ₹1 లక్ష, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వర్తించే పన్నులు దీనికి అదనం. రుణం విడుదలైన తర్వాత ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

బ్యాంక్ గ్యారంటీ ఛార్జెస్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల టెండర్లలో పాల్గొనే వ్యయాన్ని తగ్గించేందుకు ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థలు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఛార్జీలను తిరిగి పొందవచ్చు. అర్హత కలిగిన ఛార్జీల్లో 80 శాతం లేదా ₹1 లక్ష, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వర్తించే పన్నులు దీనికి అదనం.

టెస్టింగ్ ఫీ రీయింబర్స్‌మెంట్ స్కీమ్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అందించే ఉత్పత్తుల పరీక్ష, లైసెన్సింగ్, ధ్రువీకరణకు సంబంధించిన వ్యయాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థలకు సహాయం అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన పరీక్ష రుసుములో 80 శాతం లేదా ₹1 లక్ష, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వర్తించే పన్నులు దీనికి అదనం.
ఎన్ఏబీఎల్/బీఐఎస్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోగశాలల ద్వారా పరీక్షలు నిర్వహించాలి.

ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మెంబర్‌షిప్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్
ఎగుమతి నెట్‌వర్క్‌లలో ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యత్వ రుసుములో ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థలకు సహాయం అందుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన సభ్యత్వ రుసుములో 80 శాతం లేదా ₹20,000, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వర్తించే పన్నులు దీనికి అదనం. వార్షిక సభ్యత్వ రుసుము, ఒకసారి చెల్లించే చందా, ప్రవేశ రుసుము ఇందులో ఉంటాయి. దరఖాస్తుదారులు చెల్లుబాటయ్యే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కోడ్ (ఐఈసీ), రిజిస్ట్రేషన్–కమ్–మెంబర్‌షిప్ సర్టిఫికెట్ (ఆర్‌సీఎంసీ) కలిగి ఉండాలి.

కెపాసిటీ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ ఫీ రీయింబర్స్‌మెంట్ స్కీమ్
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్‌ఎఫ్) గుర్తించిన తొలి 50 మేనేజ్‌మెంట్ సంస్థల్లో స్వల్పకాలిక శిక్షణ ద్వారా నిర్వహణ, వ్యాపార నైపుణ్యాలను పెంపొందిస్తారు. ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వారి పిల్లలు 1 నుంచి 30 రోజుల వ్యవధి కలిగిన కార్యక్రమాలకు హాజరు కావచ్చు. ఏటా గరిష్ఠంగా రెండు కోర్సులకు సహాయం లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కోర్సు రుసుములో 90 శాతం లేదా ₹1 లక్ష, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పొందవచ్చు.

ప్రభుత్వ ప్రోత్సాహిత ఈ–కామర్స్ పోర్టళ్ల సభ్యత్వ రుసుము
ప్రభుత్వ ప్రోత్సాహిత ఈ–కామర్స్ పోర్టళ్ల ద్వారా ఎస్సీ/ఎస్టీ సూక్ష్మ, చిన్న సంస్థలకు డిజిటల్ మార్కెట్ ప్రాప్యతను విస్తరించేందుకు ఈ విభాగం సహకరిస్తుంది. జెమ్, ఈ–ఖాదీ, ట్రైఫెడ్, ట్రైబ్స్ ఇండియా, ఎంఎస్ఎంఈ మార్ట్ ఇందులో ఉన్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో సభ్యత్వ రుసుములో 80 శాతం లేదా ₹25,000, ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వర్తించే పన్నులు దీనికి అదనం.

ఈ సమగ్ర విధానం ద్వారా సంస్థలు సంభావ్య సరఫరాదారుల స్థాయి నుంచి సంస్థాగత, ప్రభుత్వ మార్కెట్లలో పోటీ పడగల భాగస్వాములుగా ఎదుగుతున్నాయి.

సహాయం నుంచి మార్కెట్ విజయం దిశగా
ఆర్థిక, మార్కెట్ సంబంధిత సహాయంతో పాటు వ్యాపార సహకారాన్ని మెరుగైన వాణిజ్య ఫలితాలుగా మార్చుకునేందుకు ఎన్ఎస్ఎస్‌హెచ్ తోడ్పడుతోంది. బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (బీఏపీ) వ్యాపార వ్యూహం, ధరల నిర్ణయం, నిర్వహణ సామర్థ్యం, మార్కెట్‌లో స్థానం వంటి అంశాల్లో క్రమబద్ధమైన మార్గదర్శకత్వం, పరిశ్రమలపై అవగాహన అందిస్తోంది.

పారిశ్రామికవేత్తలు క్రమబద్ధమైన, డేటా ఆధారిత విధానాలను అనుసరించేందుకు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ వ్యాపారాలను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతోంది. ఫలితంగా వారి పోటీతత్వం పెరిగి, ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోళ్లలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.

విజయగాథలు(బీఏపీ)
నిబంధనల ఆధారిత మార్కెట్లలో ప్రాధాన్యం - సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంజినీరింగ్, పశ్చిమ బెంగాల్
శ్రీ దేబాశిష్ మండల్ ధరల నిర్ణయం, వ్యయ నిర్వహణ, మార్కెట్‌లో సంస్థ స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. ఈ సహాయంతో ప్రభుత్వ కొనుగోళ్లలో ఆయన సంస్థ పోటీతత్వం పెరిగింది. అనంతరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ₹8.48 లక్షల విలువైన టెండర్లను సంస్థ దక్కించుకుంది.

స్వచ్ఛ ఇంధన రంగంలో విస్తరణ - రెనర్జీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, అస్సాం
శ్రీ భార్గవ్ దేవోరి తన పునరుత్పాదక ఇంధన సంస్థకు సంబంధించిన వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక దిశ, మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. కొనుగోలు వేదికలతో సంస్థ అనుసంధానం, ప్రభుత్వ టెండర్లకు సన్నద్ధత ఈ కార్యక్రమంతో మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రభుత్వ కొనుగోలు అవకాశాలను సమర్థంగా వినియోగించుకొని పునరుత్పాదక ఇంధన రంగంలో సంస్థ తన ఉనికిని విస్తరించుకుంది.

కచ్చితత్వంతో కదలికకు శక్తి - సవాలారామ్ ఎంటర్‌ప్రైజెస్, మహారాష్ట్ర
శ్రీ సునీల్ పోపట్రావ్ జగతాప్ తన వ్యాపార వ్యూహాన్ని, ప్రభుత్వ కొనుగోళ్లపై అవగాహనను బలోపేతం చేసుకున్నారు. ఈ అవగాహనను ఉపయోగించి హైడ్రాలిక్ సిలిండర్ల సరఫరాకు సెయిల్ నుంచి ₹5.10 లక్షల టెండర్‌ను సవాలారామ్ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఈ అవకాశం సంస్థ వ్యాపార పనితీరును బలోపేతం చేసి, మార్కెట్ పరిధిని విస్తరించింది.

పారిశ్రామిక‌త‌కు బలం, సమ్మిళిత వృద్ధికి ముందడుగు
భారత ఆర్థిక వృద్ధిలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు మరింత క్రియాశీలంగా పాల్గొనే అవకాశాలను నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాలు వ్యాపార సంస్థలు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, విస్తృత మార్కెట్లతో అనుసంధానం కావడానికి సహాయపడుతున్నాయి. ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఉపాధి, సంస్థల వృద్ధికి కొత్త మార్గాలను ఈ పురోగతి సృష్టిస్తోంది. ఎన్ఎస్ఎస్‌హెచ్ పరిధి విస్తరిస్తున్న కొద్దీ మరింత సమ్మిళిత, వైవిధ్యభరిత, పోటీతత్వ ఎంఎస్ఎంఈ వ్యవస్థ నిర్మాణానికి దోహదం చేస్తోంది.

 

References

Ministry of Micro, Small & Medium Enterprises

https://www.scsthub.in/sites/default/files/NSSH-Annual-Report-2025-26-1.pdf

https://www.scsthub.in/membership-nsic-b2b-portal

https://www.scsthub.in/content/nssh-dashboard

https://msme1connect.up.gov.in/GovernmentScheme/GovernmentScheme638740909894501747.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2280604&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290460&reg=48&lang=2

National Small Industries Corporation

https://www.nsic.co.in/Schemes/NSSH

Click here to see pdf

 

***

(तथ्य सामग्री आईडी: 151150) आगंतुक पटल : 52


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Kannada , Urdu , Malayalam , Assamese