Rural Prosperity
వికసిత్ భారత్- జీ రామ్ జీ
प्रविष्टि तिथि:
24 OCT 2026 11:52 AM
“వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)
గ్రామీణ ఉపాధి, అభివృద్ధికి కొత్త విధానం
వికసిత్ భారత్ @2047 సంకల్పానికి అనుగుణంగా వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) గ్రామీణాభివృద్ధిలో కీలక సంస్కరణగా నిలుస్తోంది. 2026 జులై 1న వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 అమల్లోకి వచ్చింది. దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ నుంచి వీబీ-జీ రామ్ జీకి మార్పు సాఫీగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగింది. కొత్త విధానం ప్రారంభమైనప్పటి నుంచే అమలుకు తోడ్పడే డిజిటల్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.
ఈ చట్టం ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ ఇస్తుంది. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమతో కూడిన పనులను స్వచ్ఛందంగా చేసేందుకు ముందుకొచ్చే వయోజన సభ్యులున్న ప్రతి గ్రామీణ కుటుంబానికి ఈ హామీ వర్తిస్తుంది. సమృద్ధిగా, సవాళ్లను తట్టుకోగల గ్రామీణ భారత్ నిర్మాణం కోసం సాధికారత, వృద్ధి, సమన్వయం, అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడాన్ని ప్రోత్సహిస్తుంది. నీటి భద్రత, ప్రధాన గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ ఘటనల ప్రభావాన్ని తగ్గించడం అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది.
సమన్వయంతో, అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చే లక్ష్యంతో రూపొందించే ప్రణాళికల ద్వారా ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమన్వయంతో పనిచేసే విధానాన్ని ఈ చట్టం వ్యవస్థలో భాగం చేస్తుంది. ఇందులో వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్స్ (వీజీపీపీలు) రూపకల్పన కీలకం. గ్రామ పంచాయతీల విభిన్న అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు ఇవి సమగ్ర విధానాన్ని అందిస్తాయి.
వీజీపీపీల ద్వారా క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికల రూపకల్పన
వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్స్ (వీజీపీపీలు) వీబీ-జీ రామ్ జీ కింద ఒక కీలక వ్యవస్థాగత సంస్కరణ. ప్రజల భాగస్వామ్యంతో, ఆధారాల ప్రాతిపదికన, అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చేలా, సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రణాళికలను రూపొందించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.
గ్రామీణాభివృద్ధి ప్రణాళికల్లో స్థానిక అవసరాలకు వీజీపీపీలు ప్రధాన ప్రాధాన్యం ఇస్తాయి. గ్రామసభ, గ్రామ పంచాయతీ చురుకైన భాగస్వామ్యంతో వీటిని రూపొందిస్తారు. గ్రామసభ తగిన సిఫార్సులు చేసి, ప్రణాళికలను ఆమోదిస్తుంది. గ్రామాలు తమ వాస్తవ అభివృద్ధి అవసరాలు, ప్రస్తుతం ఉన్న ఆస్తులు, అభివృద్ధిలో లోటుపాట్లను గుర్తించి, వాటికి అనుగుణంగా పనులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీజీపీపీలు తోడ్పడతాయి.
వీజీపీపీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
- భాగస్వామ్యంతో ప్రణాళిక: గ్రామసభ భాగస్వామ్యంతో స్థానిక అవసరాల ఆధారంగా గ్రామ పంచాయతీలు పనులను గుర్తించి, ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయిస్తాయి.
- ఆస్తుల మ్యాపింగ్: గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్న ఆస్తులు, మౌలిక వసతులు, సేవల అందుబాటులో లోటుపాట్ల సమగ్ర జాబితాను సిద్ధం చేయడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- ప్రస్తుత ఆస్తుల నమోదు: వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద సృష్టించిన ఆస్తులను ఈ జాబితాలో చేర్చుతారు.
- జీఐఎస్ ఆధారిత ప్రణాళిక: ప్రణాళిక రూపకల్పనలో జీఐఎస్, యుక్తధార, పీఎం గతి శక్తి, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తారు. స్థానిక అవసరాలు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల ఆధారంగా నిర్ధారిత సమాచారంతో సమగ్ర ప్రణాళికలను రూపొందించేందుకు భౌగోళిక స్థానాలకు సంబంధించిన సమాచారం, ఇతర సమాచారం తోడ్పడుతుంది.
- లోటుపాట్ల అంచనా: ఈ వేదికల సమాచారం ప్రాంతాలవారీ ప్రణాళిక, మెరుగైన ఆస్తుల మ్యాపింగ్, ఒకే పని పునరావృతం కాకుండా చూడటానికి తోడ్పడుతుంది. మౌలిక వసతుల కొరత, అభివృద్ధి ప్రాధాన్యాలు, చేపట్టగల చర్యలను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది.
- ప్రభుత్వ వ్యవస్థలో సమన్వయం: సమగ్ర గ్రామాభివృద్ధి కోసం వివిధ పథకాలు, శాఖలు, భాగస్వామ్య వర్గాల వనరులు, చర్యలను అనుసంధానిస్తూ వీజీపీపీలు ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమన్వయంతో పనిచేసే విధానాన్ని ప్రోత్సహిస్తాయి.
- వివిధ స్థాయుల్లో ఏకీకరణ: వీజీపీపీలను బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఏకీకృతం చేస్తారు. ఈ సమగ్ర ప్రణాళికలు వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌కు తోడ్పడతాయి.
- అనుమతించిన పనులు: నాలుగు ప్రధాన అంశాల పరిధిలో 318 రకాల అనుమతించిన పనులను వీజీపీపీ విధానం గుర్తిస్తుంది.
ఉపాధితో అనుసంధానించిన ఆస్తుల సృష్టి, మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ చర్యల సమన్వయం ద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పడటం వీజీపీపీ ప్రక్రియ ఉద్దేశం.
వీబీ జీ-రామ్ జీ: క్షేత్రస్థాయి పురోగతి
2026 జులై 1న అమలు ప్రారంభమైనప్పటి నుంచి 2026 సెప్టెంబర్ 24 నాటికి వీబీ-జీ రామ్ జీ గణనీయమైన పురోగతిని నమోదు చేసింది.
- క్రియాశీల కార్మికులు: 2026-27లో 10.88 కోట్ల మంది
- సృష్టించిన ఆస్తులు: 2.83 లక్షలు
- కల్పించిన పనిదినాలు: 31.69 కోట్లకు పైగా
- మహిళల భాగస్వామ్యం: 2026-27లో 61.65 శాతం
- కోరిన మేరకు ఉపాధి పొందిన కార్మికులు: దాదాపు 2.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు చెందిన 2.81 కోట్ల మందికి పైగా
- అమలులో ఉన్న పనులు: 97.17 లక్షలు
- భవిష్యత్తు ఉపాధి డిమాండ్‌ను తీర్చేందుకు సిద్ధంగా ఉన్న ఆమోదిత పనులు: 73.24 లక్షలు
- ప్రస్తుతం పనిచేస్తున్న పని ప్రదేశాలు: దాదాపు 20.16 లక్షలు
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం పనులు అమలు చేస్తున్న గ్రామ పంచాయతీల సంఖ్య: దాదాపు 2.31 లక్షలు
- డీబీటీ లావాదేవీలు: 2026-27లో 3.76 కోట్లు
- వేతన రేటు: రోజుకు రూ.300 నుంచి రూ.450 వరకు
- జారీ చేసిన గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారంటీ కార్డుల మొత్తం సంఖ్య: 15.17 కోట్లు
ఆర్థిక పురోగతి
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్యంతర కేటాయింపుగా మొత్తం రూ.93,841 కోట్లు కేటాయించారు.
- ఇందులో నుంచి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు తొలి విడతగా రూ.25,880 కోట్లకు మంజూరు ఉత్తర్వు (మదర్ శాంక్షన్) జారీ చేశారు.

సాంకేతికతతో పారదర్శకత, పాలన
వీబీ-జీ రామ్ జీ అమలులో సాంకేతికత కీలకం. కార్మికుల ధ్రువీకరణ, పర్యవేక్షణ, చెల్లింపులు, పారదర్శకతకు డిజిటల్ వ్యవస్థలు తోడ్పడతాయి. ఉపాధిని సుస్థిర ఆస్తుల సృష్టి, గ్రామీణాభివృద్ధితో కూడా అనుసంధానిస్తాయి.
- డిజిటల్ ధ్రువీకరణ: ముఖ గుర్తింపు ఆధారిత ధ్రువీకరణ, బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఈ-కేవైసీ, కార్మికుల హాజరును నమోదు చేస్తారు. ఇది పారదర్శకత, జవాబుదారీతనం, ప్రామాణికతను గణనీయంగా పెంచుతుంది.
- పనుల డిజిటల్ పర్యవేక్షణ: జియో-ట్యాగింగ్, డిజిటల్ కొలతలు, ఎలక్ట్రానిక్ కొలతల నమోదు పుస్తకాలు (ఈ-ఎంబీ), మొబైల్ ఆధారిత పర్యవేక్షణ అమలులోని వివిధ దశలను పర్యవేక్షించేందుకు తోడ్పడతాయి.
- డిజిటల్ చెల్లింపులు: ఈ విధానం కింద చెల్లింపులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) తోడ్పడుతుంది.
- సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ: భౌగోళిక స్థానాల ఆధారిత సాంకేతికతతో ప్రణాళికలు, ఎప్పటికప్పుడు సమాచారం అందించే డ్యాష్‌బోర్డులు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విశ్లేషణలు పర్యవేక్షణ, నివేదికల తయారీ, దిద్దుబాటు చర్యలకు తోడ్పడతాయి.
- డిజిటల్ వేదికలు, సామర్థ్యాల పెంపు: ప్రత్యేక డిజిటల్ వేదికలు, పౌరుల భాగస్వామ్య వేదికలు, భారీ స్థాయిలో సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు అమలుకు మరింత తోడ్పడతాయి.
గ్రామస్థాయి నుంచి గ్రామీణాభివృద్ధికి పునాది
ఉపాధి, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికల రూపకల్పన, గ్రామీణాభివృద్ధిని వీబీ-జీ రామ్ జీ పథకం అనుసంధానిస్తుంది. వీజీపీపీల ద్వారా గ్రామ పంచాయతీలు స్థానిక అవసరాలను గుర్తించి, ప్రస్తుతం ఉన్న ఆస్తులను మ్యాపింగ్ చేసి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తాయి. సాంకేతికత, సమన్వయం, డిజిటల్ వ్యవస్థలు అమలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి. ఈ విధానం ఉపాధిని సుస్థిర ఆస్తుల సృష్టితో అనుసంధానిస్తూ, సవాళ్లను తట్టుకోగల జీవనోపాధులు, సమగ్ర గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుంది.
References
Ministry of Rural Development
https://vbgramg.dord.gov.in/vbgramg/home.aspx
https://vbgramg.dord.gov.in/vbgramg/WriteReaddata/data/Draft_Framework_for_Viksit_Gram_Panchayat_Plan_(VGPP)_RGVS-2026_26.06.2026.pdf
https://vbgramgrep.dord.gov.in/VBGRAMG/vbgramg_ataglance/At_a_glance.aspx
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2259691®=48&lang=2
Click here to see pdf
PIB Research
***
(तथ्य सामग्री आईडी: 151145)
आगंतुक पटल : 3
Provide suggestions / comments