Infrastructure
పైమానా: డేటా ఆధారిత మౌలిక సదుపాయాల పాలనకు మరింత బలం
प्रविष्टि तिथि:
10 AUG 2026 11:52 AM
పైమానా – స్థూల దృష్టి
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయడానికి, పారదర్శకతను పెంపొందించడానికి, సమర్థ పాలనకు వాటిని సమర్థంగా పర్యవేక్షించడం అత్యంత అవసరం. ఈ లక్ష్యంతో భారత్‌లో కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం వెబ్ ఆధారిత వేదికగా పైమానా(ప్రాజెక్ట్ అసెస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ ఆండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్-బిల్డింగ్)ను 2025 సెప్టెంబర్ 25న ప్రారంభించారు. గతంలో అమల్లో ఉన్న ఓసీఎంఎస్–2006(ఆన్‌లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్) స్థానంలో ఈ వేదిక వచ్చింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ(ఎంఓఎస్‌పీఐ) దీన్ని అభివృద్ధి చేసింది. ₹150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో కొనసాగుతున్న కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పైమానా ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) నిర్వహించిన సమీకృత ప్రాజెక్టు పర్యవేక్షణ పోర్టల్(ఐపీఎంపీ) స్థానంలో పైమానా–సీఆర్ఐపీ పేరుతో కొత్త మాడ్యూల్‌ను గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2026 జూలై 8న ప్రారంభించింది. దీన్ని కాలక్రమేణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కేంద్ర సమాచార భాండాగారంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రగతి(ప్రో-యాక్టీవ్ గవర్నెన్స్ ఆండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్), పీఎంజీతో పాటు ఇతర సమీక్షా వ్యవస్థలకు అవసరమైన ప్రాజెక్టు సమాచారాన్ని తదుపరి దశలో ఇదే వేదిక నుంచి సేకరించి, నవీకరిస్తారు.
20కి పైగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అమలు సంస్థలు ప్రాజెక్టు సమాచారాన్ని నేరుగా నమోదు చేయడం లేదా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) విధానంలో పైమానా–సీఆర్ఐపీలో క్రమం తప్పకుండా నవీకరిస్తున్నాయి.
ప్రస్తుతం పైమానా పోర్టల్‌లోని ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం, డీపీఐఐటీకి చెందిన ఐపీఎంపీ/ఐఐజీతో ఏపీఐ ఆధారిత సమాచార మార్పిడి ద్వారా అనుసంధానమైంది. పైమానాలోని 60 శాతానికి పైగా ప్రాజెక్టుల సమాచారాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల ఎంఐఎస్ లేదా వెబ్ వేదికల నుంచి ఏపీఐల ద్వారా ఆటోమెటిక్‌గా నవీకరిస్తున్నారు.
ప్రాజెక్టు పర్యవేక్షణను బలోపేతం చేయడంతో పాటు ప్రత్యేక పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డు ద్వారా మౌలిక సదుపాయాల పనితీరును పరిశీలించే బాధ్యతను కూడా పైమానా విస్తరించింది. 2026 ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ డ్యాష్‌బోర్డు.. విస్తృత సూచికల ఆధారంగా ప్రధాన ఉప రంగాల్లో మౌలిక సదుపాయాల పనితీరును పర్యవేక్షిస్తుంది. డేటా ఆధారిత పాలన, ఆధారాలతో కూడిన విధాన రూపకల్పన దిశగా ఇది కీలక ముందడుగు.
పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డు గురించి సంక్షిప్తంగా..
కీలక మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పనితీరు సూచికలన్నింటినీ పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డు ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు అందించిన లేదా ప్రచురించిన అధికారిక సమాచారం ఆధారంగా ఈ సూచికలను రూపొందిస్తారు. అందుబాటులోకి వచ్చే తాజా సమాచారానికి అనుగుణంగా వీటిని క్రమానుగతంగా నవీకరిస్తారు. పరస్పర స్పందనాత్మక దృశ్యరూపాలు, విశ్లేషణ సాధనాల ద్వారా డ్యాష్‌బోర్డు ఈ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో వినియోగదారులు ధోరణులను పర్యవేక్షించడంతో పాటు వివిధ రంగాల పనితీరును కాలక్రమంలో అంచనా వేయగలుగుతారు.

పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డు ముఖ్యాంశాలు
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ ఆండ్ పాలసీ(ఎన్ఐపీఎఫ్‌పీ)తో సంప్రదింపులు జరిపి రూపొందించిన సమగ్ర సూచికల ప్రణాళిక ఆధారంగా పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డు పనిచేస్తుంది. ఆర్థిక వ్యవహారాల విభాగం(డీఈఏ) విడుదల చేసిన మౌలిక సదుపాయాల సమన్వయ ప్రధాన జాబితా–2022(హెచ్ఎంఎల్)కు అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించారు. విధాన మద్దతు, పెట్టుబడి ప్రణాళిక, ఆర్థిక సహాయ ప్రయోజనాలకు అర్హమైన మౌలిక సదుపాయాల రంగాలను వర్గీకరించేందుకు ఇది జాతీయ ప్రణాళికగా ఉపయోగపడుతుంది.
* ఇప్పటికే అమల్లో ఉన్న సూచీలతో పునరావృతం కాకుండా సూచికలను క్రమబద్ధీకరించారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ), ఎనిమిది ప్రధాన పరిశ్రమలు ఇందుకు ఉదాహరణలు.
* విద్యుత్, పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, రహదారులు, ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాలు అనే ఆరు మౌలిక సదుపాయాల ఉప రంగాలను సమగ్ర సూచికల ప్రణాళిక కవర్ చేస్తుంది.
* పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డును ప్రస్తుతం 165 సూచికలకు విస్తరించారు. కొత్తగా 54 సూచికలను చేర్చడంతో మౌలిక సదుపాయాల పనితీరు పర్యవేక్షణ మరింత సమగ్రంగా మారింది.
* ఒకే డిజిటల్ వేదిక ద్వారా ఒక్కో రంగం పనితీరును విడివిడిగా పర్యవేక్షించవచ్చు. విధాన నిర్ణేతలు, పరిశోధకులు, భాగస్వాములకు పరస్పర స్పందనాత్మక దృశ్యరూపాలు, కాల శ్రేణి విశ్లేషణ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
* కేంద్రీకృత డ్యాష్‌బోర్డు మౌలిక సదుపాయాల రంగాలన్నింటినీ ఒకే చోట సమగ్రంగా చూపిస్తుంది. తద్వారా వివిధ రంగాల మధ్య లోతైన విశ్లేషణకు వీలు కలుగుతుంది.
* ప్రస్తుత ప్రణాళిక వృద్ధి రేట్ల ఆధారంగా రంగాల పనితీరును అంచనా వేస్తుంది. ఎంపిక చేసిన రంగాల్లో వార్షిక, నెలవారీ, సంచిత వృద్ధి, లక్ష్యాలు, సామర్థ్య వినియోగాన్ని సమీక్షిస్తుంది.
ఉప రంగాలవారీగా పనితీరు సూచికల విభజన(2026 జూలై 16 నాటికి)
|
క్రమ సంఖ్య
|
మౌలిక సదుపాయాల ఉప రంగం
|
మొత్తం సూచికలు
|
|
1
|
పౌర విమానయానం
|
31
|
|
2
|
రహదారులు
|
8
|
|
3
|
విద్యుత్
|
14
|
|
4
|
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు
|
62
|
|
5
|
టెలికమ్యూనికేషన్స్
|
13
|
|
6
|
రైల్వేలు
|
37
|
| |
మొత్తం
|
165
|
నవీకరించిన పర్యవేక్షణ విధానం
నవీకరించిన విధానం రంగాల ఉత్పాదక ఫలితాలను మాత్రమే కొలిచే పద్ధతి నుంచి బహుముఖ మౌలిక సదుపాయాల పనితీరును అంచనా వేసే దిశగా మార్పును సూచిస్తోంది. ఇందులో కింది అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు:
* అందుబాటు: మౌలిక సదుపాయాలు ఎంత విస్తృతంగా అందుబాటులో ఉన్నాయో కొలుస్తుంది.
* నాణ్యత: వాటి ఉపయోగకరత, విశ్వసనీయతను అంచనా వేస్తుంది.
* ద్రవ్య వ్యయం–ఆదాయం: మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక వనరుల కేటాయింపు, వినియోగాన్ని పరిశీలిస్తుంది.
* వినియోగం: నిర్దేశిత ప్రయోజనం కోసం మౌలిక సదుపాయాలను ఎంత సమర్థంగా ఉపయోగిస్తున్నారో అంచనా వేస్తుంది.
* ఆర్థిక అందుబాటు: ప్రజలు ఆర్థికంగా వాటిని పొందగలిగే స్థితిలో ఉన్నారా అనే అంశాన్ని నిర్ధారిస్తుంది.
ఈ విధంగా సూచికలను వర్గీకరించడం ద్వారా సాధారణ ఉత్పాదక ఫలితాల పర్యవేక్షణకు మించి, వివిధ కోణాల్లో మౌలిక సదుపాయాల పనితీరును సమగ్రంగా అంచనా వేయవచ్చు. తద్వారా సమాచారంతో కూడిన విధాన నిర్ణయాలు, లక్షిత జోక్యాలకు వీలు కలుగుతుంది.
భాగస్వాముల అనుసంధానం
సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సహా భాగస్వాములకు ప్రాజెక్టుల అమలుపై క్రమం తప్పకుండా తాజా సమాచారం అందుతుంది. పైమానాలో రూపొందే డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను అందిస్తారు. ప్రాజెక్టు అమలులో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన అంశాలపై చర్యలు తీసుకోవడానికి ఈ విశ్లేషణలు తోడ్పడతాయి.
* నెలవారీ సమీక్షా సమావేశాలు, ఇతర సమాచార మార్పిడి ప్రక్రియల ద్వారా నిరంతర సమన్వయం కొనసాగుతోంది. పనితీరు సూచికలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా ఆధారాలతో కూడిన పర్యవేక్షణకు ఈ విధానం మరింత బలం చేకూరుస్తుంది.
* ప్రతి సంబంధిత మంత్రిత్వ శాఖ, విభాగానికి ప్రత్యేక డ్యాష్‌బోర్డుల లాగిన్ వివరాలను అందించారు. దీంతో ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు అవి నేరుగా పోర్టల్‌ను వినియోగించవచ్చు.
పర్యవేక్షణలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు(2026 జూన్ నాటి సమాచారం)
* 2026 జూన్ నాటికి 17 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో కొనసాగుతున్న 1,847 ప్రాజెక్టులు పర్యవేక్షణలో ఉన్నాయి. వీటి మొత్తం సవరించిన వ్యయం ₹40.54 లక్షల కోట్లు.
* ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులపై ₹21.97 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది సవరించిన మొత్తం వ్యయంలో సుమారు 54.18 శాతం. ప్రాజెక్టులు స్థిరమైన పురోగతి సాధిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
* అనేక ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. సుమారు 709 ప్రాజెక్టులు (దాదాపు 39 శాతం) 80 శాతానికి పైగా భౌతిక పురోగతి సాధించాయి. దాదాపు 337 ప్రాజెక్టులు (సుమారు 19 శాతం) 80 శాతానికి పైగా ఆర్థిక పురోగతిని నమోదు చేశాయి.
* కొనసాగుతున్న ప్రాజెక్టుల సంఖ్యలో రవాణా–లాజిస్టిక్స్ రంగం అగ్రస్థానంలో ఉంది. అనుసంధాన సదుపాయాలపై ప్రభుత్వం పెడుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ రంగంలో ₹22.32 లక్షల కోట్ల విలువైన 1,341 ప్రాజెక్టులు ఉన్నాయి.
* కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒక్కోటి ₹1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో కూడిన 769 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ ₹30.51 లక్షల కోట్లు.
* ఒక్కోటి ₹150 కోట్ల నుంచి ₹1,000 కోట్ల వ్యయంతో కూడిన 1,078 ప్రధాన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటి మొత్తం విలువ ₹5.10 లక్షల కోట్లు.
మంత్రిత్వ శాఖలు / విభాగాలవారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అత్యధిక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో 1,022 ప్రాజెక్టులు(55 శాతం) ఉన్నాయి. వీటి సవరించిన వ్యయం ₹9.89 లక్షల కోట్లు, మొత్తం సవరించిన వ్యయంలో ఇది 24 శాతం.
* రైల్వే మంత్రిత్వ శాఖ 255 ప్రాజెక్టులను (14 శాతం) అమలు చేస్తోంది. వీటి మొత్తం సవరించిన వ్యయం ₹8.69 లక్షల కోట్లు (21 శాతం).
* బొగ్గు మంత్రిత్వ శాఖ 121 ప్రాజెక్టులను (7 శాతం) నిర్వహిస్తోంది. వీటి మొత్తం సవరించిన వ్యయం ₹2.22 లక్షల కోట్లు (6 శాతం).
మరో నాలుగు మంత్రిత్వ శాఖలు, విభాగాలు కూడా గణనీయ సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి:
* పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ₹4.33 లక్షల కోట్ల సవరించిన వ్యయంతో 105 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
* విద్యుత్ మంత్రిత్వ శాఖ ₹5.71 లక్షల కోట్ల సవరించిన వ్యయంతో 98 ప్రాజెక్టులను చేపడుతోంది.
* గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ₹3.65 లక్షల కోట్ల సవరించిన వ్యయంతో 50 ప్రాజెక్టులను అమలు చేస్తోంది.
* జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం ₹2.04 లక్షల కోట్ల సవరించిన వ్యయంతో 40 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
మిగిలిన 156 ప్రాజెక్టుల (8 శాతం) మొత్తం సవరించిన వ్యయం ₹4.02 లక్షల కోట్లు (10 శాతం). ఉన్నత విద్య, పౌర విమానయానం, ఉక్కు, టెలికమ్యూనికేషన్స్, కార్మిక–ఉపాధి, ఓడరేవులు–నౌకాయానం–జలమార్గాలు, ఆరోగ్య–కుటుంబ సంక్షేమం, గనులు, డీపీఐఐటీ, క్రీడలు వంటి పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో ఇవి కొనసాగుతున్నాయి.
డేటా ఆధారిత పాలన దిశగా
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కేంద్ర సమాచార భాండాగారానికి సంబంధించిన మాడ్యూళ్లు, ₹150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో కూడిన కేంద్ర రంగ ప్రాజెక్టుల సమగ్ర వివరాలను అందించే నివేదికలు/డ్యాష్‌బోర్డులు, పనితీరు పర్యవేక్షణ డ్యాష్‌బోర్డును పైమానా పోర్టల్ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం దిశగా ఇది కీలక ముందడుగుగా నిలుస్తుంది. క్రమం తప్పకుండా జరిగే సమాచార నవీకరణలు మౌలిక సదుపాయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తాయి. ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనకు తోడ్పడటంతో పాటు సమగ్ర సమాచారంతో నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తాయి. దేశవ్యాప్తంగా సుస్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాల వృద్ధికి ఈ ప్రయత్నం ప్రోత్సాహం అందిస్తుంది.
References:
Ministry of Statistics and Programme Implementation (MoSPI):
https://paimana-proj.mospi.gov.in/ReportPage
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286550®=%203&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285365®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226267®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2252587®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244898®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2277758®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290413®=48&lang=1
Click to see in pdf
***
(तथ्य सामग्री आईडी: 150846)
आगंतुक पटल : 5
Provide suggestions / comments