• Sitemap
  • Advance Search
Economy

జెమ్ ద్వారానే అన్ని కొనుగోళ్లు

प्रविष्टि तिथि: 08 AUG 2026 16:32 PM

డిజిటల్‌ పాలనతో ప్రభుత్వ సేకరణలో పరివర్తన

ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్‌(జెమ్‌) మానవ ఆధారిత, విడివిడి ప్రక్రియల స్థానంలో పారదర్శకమైన సాంకేతిక ఆధారిత డిజిటల్‌ వేదికను ప్రవేశపెట్టి ప్రభుత్వ సేకరణ వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చింది. మొత్తం సేకరణ ప్రక్రియను డిజిటలీకరించడం ద్వారా లావాదేవీల వ్యయాన్ని తగ్గిస్తూ సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచింది. సూక్ష్మ, చిన్న సంస్థలు (ఎంఎస్‌ఈలు), అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల సంస్థల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వ మార్కెట్లలో అవకాశాలను విస్తరించి, సేకరణ వ్యవస్థను మరింత సమ్మిళితం చేశాయి. భారత డిజిటల్‌ సేకరణ వ్యవస్థకు కీలక స్తంభంగా జెమ్‌.. డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, వ్యాపార నిర్వహణ సౌలభ్యానికి మద్దతు ఇస్తోంది.

డిజిటల్‌ యుగంలో ప్రభుత్వ రంగంలో కొనుగోళ్లు
ప్రభుత్వాలు ప్రతి ఏటా విభిన్న రంగాల్లో వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవలను సేకరిస్తాయి. వైద్య పరికరాలు, తరగతి గది సామగ్రి మొదలు రవాణా మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ పరిష్కారాల వరకు ప్రభుత్వ పాలనలోని దాదాపు ప్రతి అంశానికి సేకరణ వ్యవస్థ అండగా నిలుస్తుంది.

సంప్రదాయ సేకరణలో తరచూ కాగితపు పత్రాలు, పలు స్థాయుల ఆమోదాలు, సుదీర్ఘ టెండర్‌ ప్రక్రియలు ఉండటంతో సామర్థ్యం, పారదర్శకత పరిమితంగా ఉండేవి. ఈ వ్యవస్థలో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం 2016 ఆగస్టు 9న ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్‌ (జెమ్‌)ను ప్రారంభించింది.

సంప్రదాయ సేకరణ నుంచి డిజిటల్‌ మార్కెట్‌కు
ప్రభుత్వ సేకరణలో పరివర్తనాత్మక సంస్కరణగా రూపొందించిన జెమ్‌.. ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని సేవలను అందించే ఏకీకృత డిజిటల్‌ వేదిక. సురక్షితమైన, కాగితరహిత, నగదురహిత, ప్రత్యక్ష సంప్రదింపులు అవసరం లేని వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కొనుగోలుదారులు వస్తువులు, సేవలను సేకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కొనుగోలుదారులు, విక్రేతలను ఒకే ఆన్‌లైన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చి సేకరణను మరింత పారదర్శకంగా, సమర్థంగా, పోటీతో కూడిన ప్రక్రియగా మార్చింది.

అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లోని ప్రముఖ ప్రభుత్వ సేకరణ వ్యవస్థలతో సహా ప్రపంచవ్యాప్త ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన తర్వాత ఈ వేదికను అభివృద్ధి చేశారు. సేకరణ ప్రక్రియను సరళీకరించి, ప్రామాణీకరించేందుకు ఇది డిజిటల్‌ సాంకేతికతను వినియోగిస్తుంది. సాధారణ ఆర్థిక నిబంధనలకు చేసిన సవరణలు ప్రభుత్వ సంస్థలు ఈ వేదిక ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వీలు కల్పించడంతో జెమ్‌ అమలు మరింత బలోపేతమైంది.

కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, స్థానిక సంస్థలు, పంచాయతీలు, సహకార సంఘాలతో సహా విస్తృత శ్రేణి ప్రభుత్వ కొనుగోలుదారులకు జెమ్‌ సేవలు అందిస్తోంది. విక్రేత నమోదు, ఉత్పత్తుల జాబితా మొదలు బిడ్డింగ్‌, ఒప్పందం కేటాయింపు, ఆర్డర్‌ అమలు, చెల్లింపు వరకు మొత్తం సేకరణ ప్రక్రియను ఈ వేదిక డిజిటలీకరిస్తుంది. దీంతో పారదర్శకత, జవాబుదారీతనం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుపడుతున్నాయి.

పారదర్శక సేకరణ వ్యవస్థ నిర్మాణం
జెమ్‌ సేకరణ కార్యాచరణకు పారదర్శకత ప్రధాన ఆధారం. ప్రభుత్వ సేకరణలో న్యాయమైన పోటీ, ప్రామాణిక ప్రక్రియలు, సమాచార ఆధారిత నిర్ణయాలకు ఈ వేదిక వీలు కల్పిస్తుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కొనుగోలుదారులు నేరుగా కొనుగోలు, ధరల పోలిక, ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌, రివర్స్‌ వేలం పద్ధతుల్లో సేకరణ చేపట్టవచ్చు. డిజిటల్‌ రికార్డులు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, స్వయంచాలక కార్యాచరణలు విచక్షణ ఆధారిత నిర్ణయాలను తగ్గిస్తూ జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయి.

సమగ్ర సమాచారంతో నిర్ణయాలు తీసుకునేందుకు జెమ్‌ పలు సమాచార ఆధారిత సాధనాలు, ఏకీకృత సేవలను అందిస్తోంది.

మీకు తెలుసా?
సైనిక వ్యవహారాల విభాగం 2026 ఆగస్టు 6 నాటికి మొత్తం స్థూల సరకు విలువలో ₹1.35 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.

2026 ఆగస్టు 6 నాటికి జెమ్‌ మొత్తం స్థూల సరకు విలువలో రక్షణ సేకరణ 14.93 శాతానికి పైగా వాటా అందించింది.

* జెమ్‌ వెలుపల కొనుగోళ్లు చేపట్టే ముందు ఉత్పత్తుల లభ్యత, గత సేకరణ ధోరణులను అంచనా వేసేందుకు కొనుగోలుదారులు జెమ్‌ లభ్యత నివేదిక, గత లావాదేవీల సారాంశం పొందవచ్చు.

* వ్యాపార విశ్లేషణ సదుపాయాలు చివరి కొనుగోలు ధర, ధరల ధోరణులు, విభాగాల సేకరణ చరిత్ర వంటి వివరాలను అందిస్తాయి. దీంతో కొనుగోలుదారులు పూర్తి సమాచారంతో వ్యయ సమర్థమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

* కేంద్ర ప్రభుత్వ సేకరణ పోర్టల్‌ (సీపీపీపీ)తో అనుసంధానం దేశవ్యాప్తంగా చేపట్టే వివిధ కొనుగోళ్లకు సంబంధించిన ప్రభుత్వ టెండర్ల సమాచారాన్ని ఒకేచోట అందిస్తుంది.

* ఏకీకృత, పరస్పర అనుసంధానిత ప్రభుత్వ సేకరణ వ్యవస్థను రూపొందించేందుకు భారతీయ రైల్వే ఎలక్ట్రానిక్‌ సేకరణ వ్యవస్థ (ఐఆర్‌ఈపీఎస్‌), రక్షణ ప్రభుత్వ సేకరణ పోర్టల్‌ (డీపీపీపీ) సేవలను జెమ్‌తో అనుసంధానిస్తున్నారు.

ప్రభుత్వ సేకరణ పరిధి విస్తరణ
జెమ్‌ 1.37 లక్షలకు పైగా ప్రభుత్వ కొనుగోలు సంస్థలను దాదాపు 25 లక్షల మంది విక్రేతలు, సేవా ప్రదాతలతో అనుసంధానిస్తోంది. ఇప్పటివరకు ₹20 లక్షల కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లకు వీలు కల్పించింది.



లావాదేవీల నిర్వహణకు మించి భారత డిజిటల్‌ సేకరణ వ్యవస్థలో జెమ్‌ కీలక స్తంభంగా మారింది. ఈ వేదిక డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, వోకల్‌ ఫర్‌ లోకల్‌, వ్యాపార నిర్వహణ సౌలభ్యానికి మద్దతు ఇస్తోంది. ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన విభిన్న అవసరాలను తీర్చేందుకు 10,660కి పైగా ఉత్పత్తుల విభాగాలు, 350 సేవల విభాగాలతో సమగ్ర డిజిటల్‌ మార్కెట్‌ను అందిస్తోంది. వైద్య పరికరాలు, ఫర్నిచర్‌, కంప్యూటర్లు, అగ్నిమాపక భద్రతా పరికరాలు, హస్తకళా ఉత్పత్తులతో పాటు రవాణా, క్యాటరింగ్‌, వాహనాల అద్దె, మానవ వనరుల వంటి సేవలు ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పలు సేకరణ విధానాలు, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, ఆన్‌లైన్‌లో ఒప్పందాల రూపకల్పన ద్వారా ప్రారంభం నుంచి ముగింపు వరకు పారదర్శకమైన, సమర్థమైన డిజిటల్‌ సేకరణకు మరింత భరోసా లభిస్తోంది.

విధాన సంస్కరణలు, సాంకేతిక నవీకరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా జెమ్‌ నిరంతరం పరిణామం చెందుతోంది. తరచూ చేపట్టే కొనుగోళ్ల కోసం రేటు ఒప్పందాల ప్రవేశం, విక్రేతలకు ముందస్తు హామీ నగదు నిబంధన తొలగింపు ఇటీవలి సంస్కరణల్లో ఉన్నాయి. ఈ సంస్కరణలు సేకరణ ప్రక్రియను సరళీకరించి, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచాయి.

జెమ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్న భాగస్వామ్యాలు
ప్రభుత్వ సేకరణను మరింత వినూత్నంగా, పారదర్శకంగా, సమ్మిళితంగా మార్చేందుకు ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ సంఘాలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో జెమ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంది.

* ఆవిష్కరణ: అంతరిక్ష సాంకేతికత కొనుగోళ్ల కోసం భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక–అనుమతుల కేంద్రం (ఇన్‌–స్పేస్‌)తో డ్రోన్ల సేకరణ కోసం డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్‌ఐ)తో జెమ్‌ 2025 ఏప్రిల్‌లో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
* ఆర్థిక సహాయం: జెమ్‌సహాయ్‌ కార్యక్రమం కింద యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో భాగస్వామ్యం నమోదిత విక్రేతలు, సేవా ప్రదాతలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేని నిర్వహణ మూలధనాన్ని పొందే అవకాశాలను మెరుగుపరుస్తోంది.

జెమ్‌సహాయ్‌
జెమ్‌లో అర్హత కలిగిన ఏకవ్యక్తి యాజమాన్య విక్రేతలు తక్షణమే పూచీకత్తు లేని నిర్వహణ మూలధన రుణాలను పొందేందుకు జెమ్‌సహాయ్‌ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ వీలు కల్పిస్తుంది. కొనుగోలుదారుల సమ్మతి అవసరం లేకుండా వేగవంతమైన, కాగితరహిత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీంతో విక్రేతలు ప్రభుత్వ ఆర్డర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు.

* సామర్థ్య నిర్మాణం: అరుణ్‌ జైట్లీ జాతీయ ఆర్థిక నిర్వహణ సంస్థ (ఏజేఎన్‌ఐఎఫ్‌ఎం), కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ గూడ్స్‌ గవర్నెన్స్‌ (ఎన్‌సీజీజీ), భారత ప్రభుత్వ పాలనా సంస్థ (ఐఐపీఏ)తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు ప్రభుత్వ సేకరణలో పరిశోధన, శిక్షణ, పరిజ్ఞాన మార్పిడి, విధాన అభివృద్ధికి మద్దతు ఇస్తాయి.
* నిబంధనల అనుసరణ: మానవ వనరుల సేవల అవుట్‌సోర్సింగ్‌లో పారదర్శకతను మెరుగుపరచడం, చట్టాల అనుసరణను బలోపేతం చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)తో అనుసంధానం చేపట్టారు.
* సమ్మిళిత భాగస్వామ్యం: వుమనియా కార్యక్రమం ద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (యూఎన్‌ విమెన్‌)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చే సమ్మిళిత ప్రభుత్వ సేకరణను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.

మహిళలు, అంకుర సంస్థలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తలకు సాధికారత
ప్రభుత్వ సేకరణ అవకాశాలు క్షేత్రస్థాయి వరకు చేరేలా చూడటానికి జెమ్‌ 2026 జూన్‌లో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఈ–గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఎస్‌సీ–ఎస్‌పీవీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 50 జెమ్‌ సువిధా కేంద్రాలను ఈ భాగస్వామ్యం కింద ఏర్పాటు చేస్తారు.

జెమ్‌ సువిధా కేంద్రాలు అవగాహన, విక్రేతల నమోదు, సరఫరాదారుల మదింపు, ఉత్పత్తుల జాబితా రూపకల్పన, సామర్థ్య నిర్మాణం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు స్థానిక స్థాయిలో మార్గనిర్దేశం అందిస్తాయి. ప్రభుత్వ సేకరణలో సూక్ష్మ, చిన్న సంస్థలు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, కళాకారులు, నేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, స్థానిక తయారీదారుల భాగస్వామ్యాన్ని పెంచడం వీటి లక్ష్యం.

జెమ్‌ ద్వారా సమ్మిళిత వృద్ధి–2025-26
ప్రభుత్వ సేకరణలో పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత భాగస్వామ్యానికి వీలు కల్పించడం ద్వారా గతంలో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు ఈ వేదిక మార్కెట్‌ అవకాశాలను విస్తరించింది.

* సూక్ష్మ, చిన్న సంస్థలు(ఎంఎస్ఈ): నమోదైన 11 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న సంస్థలు ₹2.36 లక్షల కోట్లకు పైగా విలువైన 51 లక్షలకు పైగా ఆర్డర్లను అమలు చేశాయి.
* మహిళల నేతృత్వంలోని సంస్థలు: నమోదైన 2.1 లక్షలకు పైగా మహిళా నేతృత్వ సూక్ష్మ, చిన్న సంస్థలు ₹28 వేల కోట్లకు పైగా విలువైన సేకరణ ఆర్డర్లను పొందాయి.
* ఎస్సీ/ఎస్టీ సంస్థలు: వీటి నుంచి చేపట్టిన సేకరణ ₹6 వేల కోట్లను అధిగమించి, దాదాపు 28 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
* అంకుర సంస్థలు: వీటి నుంచి కొనుగోళ్లు ₹19 వేల కోట్లను అధిగమించి, 36 శాతానికి పైగా వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.



సమ్మిళిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు స్వయత్‌, స్టార్టప్‌ రన్‌వే 2.0, వుమనియా, సారస్‌ కలెక్షన్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలను జెమ్‌ ప్రవేశపెట్టింది. అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు, తగిన అవకాశాలు అందని ఇతర వర్గాలకు ఈ కార్యక్రమాలు మార్కెట్‌ సదుపాయాలను మెరుగుపరుస్తాయి.

స్వయత్‌ కార్యక్రమం: స్వయత్‌ (ఈ–లావాదేవీల ద్వారా అంకుర సంస్థలు, మహిళలు, యువతకు ప్రయోజనం) సమ్మిళిత ప్రభుత్వ సేకరణను ప్రోత్సహించే జెమ్‌ ప్రధాన కార్యక్రమం. అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ–చిన్న సంస్థలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలుదారులకు విక్రయించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

వుమనియా: మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను జెమ్‌లో ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ సేకరణ అవకాశాలను పొందడంతో పాటు తమ మార్కెట్‌ పరిధిని విస్తరించుకునేందుకు వారికి సహాయపడుతుంది. వుమనియా గురించి ఇక్కడ మరింత చదవండి.

సారస్‌ కలెక్షన్‌: ప్రత్యేక మార్కెట్‌ విభాగం కింద గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన రోజువారీ వినియోగ ఉత్పత్తులను సారస్‌ కలెక్షన్‌ ప్రదర్శిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారుల మార్కెట్‌ను అందించడం దీని లక్ష్యం.

స్టార్టప్‌ రన్‌వే 2.0: వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రభుత్వ కొనుగోలుదారులకు ప్రదర్శించి, ప్రభుత్వ సేకరణలో పాల్గొనేందుకు అంకుర సంస్థలకు ఇది ప్రత్యేక మార్కెట్‌ను అందిస్తుంది.

మరింత తెలివైన ప్రభుత్వ సేకరణ దిశగా
జెమ్‌ 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ మరింత తెలివైన, ఏకీకృత ప్రభుత్వ సేకరణ వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ, విస్తృత భాగస్వామ్యం పారదర్శకత, సామర్థ్యం, పాలనను మరింత బలోపేతం చేస్తాయి. ప్రభుత్వ డిమాండ్‌ను స్థానిక సంస్థలతో అనుసంధానించడం ద్వారా వోకల్‌ ఫర్‌ లోకల్‌, మేక్‌ ఇన్‌ ఇండియా, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని జెమ్‌ ముందుకు తీసుకెళ్తోంది. డిజిటల్‌ సాధికారత, స్వావలంబనతో కూడిన ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ ప్రయాణానికి జెమ్‌ నిరంతరం మద్దతు ఇస్తోంది.

 

References

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201284&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2274872&reg=3&lang=1

https://doe.gov.in/files/circulars_document/FInal_GFR_upto_31_07_2024.pdf

https://assets-bg.gem.gov.in/resources/upload/shared_doc/gem-chronicle-december-2025-edition_1766729032.pdf

https://eprocure.gov.in/cppp/newsletterdisp/kbadqkdlcswfjdelrquehwuxcfmijmuixngudufgbuubgubfugbububjxcgfvsbdihbgfGhdfgFHytyhRtNjI2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1897442&reg=48&lang=2

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/mar/doc202131041.pdf

 

PIB Archives

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156611&ModuleId=3&reg=3&lang=1

https://www.pib.gov.in/factsheetdetails.aspx?id=148586&reg=48&lang=2

Click here to see PDF

 

****

(तथ्य सामग्री आईडी: 150820) आगंतुक पटल : 9


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Malayalam , Bengali , Assamese , Kannada