• Sitemap
  • Advance Search
Economy

సేవ‌ల‌ ఉత్పత్తి సూచీ

प्रविष्टि तिथि: 14 JUL 2026 21:01 PM

భారత సేవా రంగ ఆర్థిక‌ పురోగతికి కొల‌మానం
 


ఉత్పత్తి సేవల సూచిక: సేవా రంగ పనితీరును ప్రతిబింబించే అద్దం

భారతదేశం గత దశాబ్ద కాలంలో తన గణాంక, పరిపాలనా డేటా వ్యవస్థను విశేషంగా బలోపేతం చేసింది. అందుబాటులోకి వచ్చిన అధిక-ఫ్రీక్వెన్సీ జీఎస్టీ డేటా, ఇన్ కార్పొరేటెడ్ సేవా రంగ సంస్థల వార్షిక సర్వే(ఏఎస్ఐఎస్ఎస్ఈ) ప్రారంభం, డిజిటల్ పరిపాలనా డేటాబేస్‌ల విస్తరణ వంటివి ప‌టిష్ట‌మైన‌ ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనకు గణనీయంగా దోహదపడుతున్నాయి.

ఈ సంస్కరణల విస్తరణలో భాగంగా ప్రభుత్వం 'ఉత్పత్తి సేవల సూచీ'(ఐఎస్‌పీ) అనే కొత్త స్థూల ఆర్థిక సూచికను ప్రవేశపెట్టింది. సేవా రంగ ఉత్పత్తిని కొలవడానికి ప్రత్యేకించిన భారత తొలి అధిక-ఫ్రీక్వెన్సీ సూచిక ఇది. ఒక నిర్దిష్ట ఆధార సంవత్సరంతో పోలిస్తే అధికారిక సేవా రంగం ఉత్పత్తి చేసే పరిమాణంలో వచ్చే స్వల్పకాలిక మార్పులను ఇది నమోదు చేస్తుంది.

భారత ఆర్థిక వ్యవస్థలో సేవల భాగస్వామ్యమే అత్యధికం కాబట్టి, ఈ సూచిక ఆర్థిక పర్యవేక్షణను బలోపేతం చేస్తుందని, జాతీయ గణాంకాల అంచనాలను మెరుగుపరుస్తుందని, మరింత సమర్థవంతమైన విధాన నిర్ణయాలకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.

తొలి విడుదల: ట్రయల్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్
ప్రభుత్వం ఏప్రిల్ 2026 నాటికి 19 ఉప-రంగాల కోసం తొలి ఉప-రంగాంశ విచారణాత్మక(ట్రయల్) సూచికను విడుదల చేసింది. ఇది సేవా రంగంలో సుమారు 60 శాతాన్ని కవర్ చేస్తుంది.

ఈ 19 ఉప-రంగాలలో 14 రంగాలు ఏప్రిల్ 2025తో పోలిస్తే ఏప్రిల్ 2026లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

నెలవారీ ప్రాతిపదికన బలమైన వృద్ధిని కనబరిచిన మొదటి 5 ఉప-రంగాలలో వసతి-ఆహార సేవలు(37.2%), చిల్లర వ‌ర్త‌కం(30.8%), అడ్మినిస్ట్రేటివ్‌, స‌పోర్ట్ స‌ర్వీసులు(28.7%), రియల్ ఎస్టేట్(27.7%), టెలికమ్యూనికేషన్స్ (22.8%) ఉన్నాయి.

2025-26 సంవత్సరానికి గాను వార్షిక ప్రాతిపదికన టాప్ 5 ఉప-రంగాలలో వసతి-ఆహార సేవలు(35.6%), చిల్లర వ‌ర్త‌కం(30.5%), మరమ్మతు సేవలు(25.1%), హోల్ సేల్ వ్యాపారం(23.6%), రోడ్డు రవాణా (22.6%) నిలిచాయి.

సూచిక ముఖ్య లక్షణాలు
ఈ సూచిక ప్రవేశపెట్టడంతో భారతదేశం తన గణాంక వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తోంది. ఈ సూచిక ప్రధాన లక్షణాలు ఇవి:
* ఈ సూచిక ఆధార సంవత్సరంగా 2024-25ను ఎంపిక చేశారు. ఇది నూతన వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ఇతర ఉప-రంగాల సిరీస్‌తో సరిగ్గా సరిపోలుతుంది.
* జాతీయ లెక్కింపు విభాగాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖలు, విభాగాల‌తో పాటు పరిశోధకులు, విషయ నిపుణులు ఈ సూచికను ప్రధానంగా వినియోగిస్తారు.
* క్రమబద్ధమైన నెలవారీ ట్రయల్ సూచీలు దాదాపు 60 రోజుల ఆలస్యంతో విడుదలవుతాయి. ప్రతి నెలా 29వ తేదీన లేదా ఆ రోజు సెలవు దినమైతే తదుపరి పనిదినాన డేటా అందుబాటులోకి వస్తుంది.
* ప్రస్తుతం ఈ సూచిక సేకరణకు విభిన్న ధరల సంకోచకాల(ప్రైస్ డిఫ్లేటర్స్)ను ఉపయోగిస్తున్నారు.
* హోల్ సేల్ వ్యాపారానికి హోల్ సేల్ ధరల సూచీ(డ‌బ్ల్యూపీఐ)ని ఉపయోగిస్తున్నారు.
* మిగిలిన చాలా రంగాలకు సంబంధిత వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) లేదా దానికి అత్యంత సమీపంలోని సీపీఐని ఉపయోగిస్తున్నారు.
* మరమ్మతులు-నిర్వహణ, బ్యాంకింగ్, బీమా రంగానికి సీపీఐ-జనరల్‌ను వర్తింపజేస్తున్నారు.
* ప్రత్యేక సీపీఐ లేని రంగాలకు సీపీఐ-సేవలను ఉపయోగిస్తున్నారు.

డిఫ్లేటర్ అవసరం
ఈ సూచిక సేవల ఉత్పత్తి పరిమాణంలో వచ్చే స్వల్పకాలిక మార్పులను పర్యవేక్షిస్తుంది. ప్రాథమిక సేవల డేటా సాధారణంగా ద్రవ్య రూపంలోనే సేకరిస్తారు కాబట్టి అది ధరలు, విలువ జోడింపు రెండింటి ప్రభావాలను చూపుతుంది. కాబట్టి నామమాత్రపు సేవా రాబడి నుంచి ధరల మార్పుల ప్రభావాన్ని తొలగించడానికి ప్రైస్ డిఫ్లేటర్ అవసరం.

ప్రైస్ డిఫ్లేటర్ అనేది "విలువ-ఆధారిత" డేటాను "పరిమాణ-ఆధారిత" డేటాగా మారుస్తుంది. కాలక్రమేణా వచ్చే నిజమైన మార్పుల నిఖార్సయిన కొలతను అందిస్తుంది.

భారత ఐఎస్‌పీ చట్రం నిర్మాణం
గ‌ణాంక‌, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఈ సూచిక భావనాత్మక, విధానపరమైన చట్రాన్ని అభివృద్ధి చేయడానికి మే 2025లో ఒక సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ)ని ఏర్పాటు చేసింది. ఇందులో సేవా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యావేత్తలు, పరిశ్రమ సంఘాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రతిపాదిత చట్రాన్ని అంతర్జాతీయ ఉత్తమ విధానాల ఆధారంగా రూపొందించారు.

ఓఈసీడీ ప్రచురించిన కంపైలేషన్ మ్యాన్యువల్ ఫర్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్(2007) అనేది ఈ సూచిక సేకరణపై అత్యంత సమగ్రమైన మార్గదర్శకాల సమాహారం. యూరోపియన్ యూనియన్ గణాంక కార్యాలయమైన 'యూరోస్టాట్' కూడా ఈ సూచిక తయారీకి మరొక ప్రధాన ప్రపంచ మార్గదర్శిగా ఉంది.

ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్, స్లోవేనియా వంటి అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు క్రమం తప్పకుండా ఈ సూచికను లేదా దానికి సమానమైన సూచికలను ప్రచురిస్తాయి. యూరోపియన్ యూనియన్ కాకుండా దక్షిణ కొరియా నెలవారీ 'సర్వీస్ ఇండస్ట్రీ యాక్టివిటీ ఇండెక్స్'ను ప్రచురిస్తుండగా, యునైటెడ్ కింగ్‌డమ్ సమగ్రమైన 'మొంత్లీ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్'ను రూపొందిస్తోంది.



సేవల ఉత్పత్తి సూచిక పరిధి
విశ్వసనీయమైన, అధిక-ఫ్రీక్వెన్సీ డేటా అందుబాటులో ఉన్న సేవా ఉప-రంగాలను ఈ సూచీ ప్రారంభంలో కవర్ చేస్తుంది.

 



ఈ సూచీ పరిధి నుంచి మినహాయించిన ఉప-రంగాలు- ప్రభుత్వ పాలన, రక్షణ, బ్యాంకింగ్, బీమా మినహా ఆర్థిక సేవలు(కేంద్ర బ్యాంకు కార్యకలాపాలు, మనీ మార్కెట్ ఫండ్స్ వంటివి), నివాస సౌకర్యం లేని సామాజిక సేవా కార్యకలాపాలు, సభ్యత్వ సంస్థల సేవలు, వ్యక్తిగత సేవలు, పనివారలున్న ప్రైవేట్ గృహాల కార్యకలాపాలు, ప్రాంతీయేతర సంస్థల కార్యకలాపాలు, ప్రభుత్వం అందించే ఆరోగ్య, విద్యా సేవలు, జూదం, బెట్టింగ్ కార్యకలాపాలు.

ఈ రంగాలు ప్రభుత్వ కీలక కార్యకలాపాలకు సంబంధించినవి లేదా మార్కెటేతర కార్యకలాపాలు, అసంఘటిత రంగ ఆధిపత్యం ఉన్నవి.

ఐఎస్‌పీ శక్తిమంతమైన డేటా వ్యవస్థ
ఈ సూచీక సేకరణకు అడ్మినిస్ట్రేటివ్ డేటా, జీఎస్టీ, ఏఎస్ఐఎస్ఎస్ఈ అనే మూడు ప్రధాన డేటా మూలాలను ఉపయోగిస్తారు-
* విమాన రవాణా, రైల్వే రవాణా, బ్యాంకింగ్, బీమా రంగానికి సంబంధించిన పరిపాలనా/ద్వితీయ డేటా.
* ఆరోగ్య, విద్యా(ప్రభుత్వ రంగాలు మినహా) రంగాలకు సంబంధించి ఏఎస్ఐఎస్ఎస్ఈ డేటా(అందుబాటులోకి వచ్చాక) వాడతారు. ఏప్రిల్ 2026లో ప్రారంభమైన ఇది ఇన్ కార్పొరేటెడ్ సేవా రంగానికి చెందిన సమగ్ర డేటాబేస్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మీకు తెలుసా?
గణాంకాల అప్లికేష‌న్ల‌లో జీఎస్టీ డేటాను ఉపయోగించడం ఇదే తొలిసారి.

హోల్ సేల్ వ్యాపారం, చిల్లర వ్యాపారం, మరమ్మతులు-నిర్వహణ, వసతి-ఆహారం, రోడ్డు రవాణా, జల రవాణా, వేర్‌హౌసింగ్, రవాణాకు మద్దతు ఇచ్చే కార్యకలాపాలు, పోస్టల్-కొరియర్, టెలికమ్యూనికేషన్స్, సమాచారం-ప్రసారం, రియల్ ఎస్టేట్, సమాచారం-కంప్యూటర్ సంబంధిత సేవలు, ఆర్ అండ్ డీతో సహా వృత్తిపరమైన, శాస్త్రీయ, సాంకేతిక సేవలు, పరిపాలనా-మద్దతు సేవలు, కళలు, వినోదం మొదలైన వాటికి జీఎస్టీ డేటాను ఉపయోగిస్తారు.

ఐఎస్‌పీ ఎందుకు ముఖ్యం?
భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా గణనీయ‌మైన‌ నిర్మాణ మార్పుకు గురైంది. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి, ప్రపంచ మార్కెట్లతో పెరుగుతున్న అనుసంధానం దీనికి చోదకశక్తిగా నిలిచాయి. ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు సేవా రంగం ఒక కీలక చోదక శక్తిగా మారింది.
* 2013-14 నుంచి స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో 50 శాతానికి పైగా కాంట్రిబ్యూట్ చేస్తూ భారత జీడీపీకి అతిపెద్ద సహకార రంగాలుగా నిలిచింది. 2024-25లో సేవల జీవీఏ వాటా దాదాపు 52.9 శాతంగా ఉంది.
* ఈ రంగం భారతదేశ వ్యాప్తంగా మొత్తం ఉపాధిలో ~30% వాటాను కలిగి ఉంది. గత ఆరు సంవత్సరాలలో దాదాపు 4 కోట్ల‌ ఉద్యోగాలను సృష్టించింది.
* 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రంలో భారతదేశ సేవా ఎగుమతులు బలమైన వేగాన్ని కొనసాగించాయి. ఏప్రిల్-జూన్ 2026-27 వ్యవధిలో సేవా ఎగుమతులు 103.41 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇది సంవత్సరానికి 6.16% వృద్ధిని నమోదు చేసింది.
* 2047 నాటికి అంతర్జాతీయ సేవల్లో 10% వాటాను లక్ష్యంగా చేసుకుని భారతదేశాన్ని సేవా రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశ వృద్ధికి సేవా రంగం అత్యంత ప్రధానమైనది కాబట్టి, దాని పనితీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక స్వల్పకాలిక సూచీ అత్యవసరంగా మారింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) కేవలం పారిశ్రామిక కార్యకలాపాలను మాత్రమే కొలుస్తుంది. సేవా రంగంలోని స్వల్పకాలిక పోకడలను అంచనా వేయలేదు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ సూచీని ప్రవేశపెట్టింది.

భారత ఆర్థిక లెక్కింపులో కొత్త మైలురాయి
వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా తన గణాంక చట్రాన్ని ఆధునికీకరించడానికి భారతదేశం కట్టుబడి ఉందనే విషయానికి ఈ సూచీ ప్రారంభం నిదర్శనం. అధిక-ఫ్రీక్వెన్సీ డేటా, బలమైన పద్ధతులను ఒకచోట చేర్చడం ద్వారా ఈ సూచిక భారతదేశపు అతిపెద్ద ఆర్థిక రంగానికి సంబంధించిన సమయానుకూల గ‌ణాంకాల‌ను అందిస్తుంది. ఒక నెలవారీ సూచీగా ఇది ఆర్థిక పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది. విధానపరమైన స్పందనలను మెరుగుపరుస్తుంది. భారతదేశ వృద్ధి పథంపై అవగాహనను మరింత పెంపొందిస్తుంది.

 

References

Ministry of Statistics & Programme Implementation

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284450&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2277392&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255933&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269286&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249336&reg=3&lang=1

 

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284139&reg=3&lang=1

 

PIB Archives

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157804&ModuleId=3&reg=48&lang=2

Click here to see pdf 

 

***

(तथ्य सामग्री आईडी: 150787) आगंतुक पटल : 150


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Urdu , Assamese , Bengali , Manipuri , Malayalam , Kannada