Energy & Environment
విస్తరిస్తున్న భారతదేశ హరిత పాదముద్ర
प्रविष्टि तिथि:
24 OCT 2025 18:56 PM
జీఎఫ్ఆర్ఏ ర్యాంకుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత్‌కు 9వ స్థానం, వార్షిక నికర అటవీ విస్తరణలో 3వ స్థానం, ఎఫ్ఏఓ ప్రకారం కార్బన్ డయాక్సైడ్ శోషక దేశాల్లో 5వ స్థానం
కీలకాంశాలు
- జీఎఫ్ఆర్ఏ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటవీ విస్తీర్ణంలో 9వ స్థానానికి చేరిన భారత్
- వార్షిక నికర అటవీ విస్తరణలో 3వ స్థానంలో కొనసాగుతున్న భారత్
- ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ శోషక దేశాల్లో భారత్‌కు 5వ స్థానం, 2021-25 మధ్య 150 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించిన భారత్‌లోని అడవులు
- మొత్తం ప్రపంచ అటవీ విస్తీర్ణం 4.14 బిలియన్ హెక్టార్లు, మొత్తం భూభాగంలో ఇది 32 శాతం
- 10.7 మిలియన్ హెక్టార్ల(1990-2000) నుంచి 4.12 మిలియన్ హెక్టార్లు(2015-2025)కి తగ్గిన వార్షిక నికర అటవీ నష్టం
పరిచయం
ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) అక్టోబర్ 22, 2025న విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్‌మెంట్(జీఎఫ్ఆర్ఏ) 2025లో మొత్తం అటవీ విస్తీర్ణం విభాగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానానికి చేరుకుంది. తద్వారా ప్రపంచ అటవీ గణాంకాల్లో కీలకమైన మైలురాయిని భారత్ అందుకుంది. గత మదింపులో భారత్ 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు వార్షిక నికర అటవీ విస్తరణలో ప్రపంచవ్యాప్తంగా 3వ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది.
ఎఫ్ఏఓ అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ. ఇది అడవులతో పాటు సహజ వనరుల సుస్థిర నిర్వహణను పెంపొందించడానికి, ఆకలిని ఓడించడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తుంది. జీఎఫ్ఆర్ఏ అనేది ప్రపంచంలోని అడవుల స్థితిపై ఎఫ్ఏవో చేపట్టే కాలానుగుణ మదింపు. అటవీ విస్తీర్ణం, మార్పు, నిర్వహణ, వినియోగంపై ఇది సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.
జీఎఫ్ఆర్ఏ 2025: ప్రపంచ కోణంలో భారత్
- ప్రపంచ అటవీ విస్తార్ణం: ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) విడుదల చేసిన తాజా జీఎఫ్ఆర్ఏ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటవీ విస్తీర్ణం 4.14 బిలియన్ హెక్టార్లు. ఇది మొత్తం భూభాగంలో దాదాపు 32 శాతం. సుమారుగా ఒక వ్యక్తి 0.5 హెక్టార్ల అడవిగా భావించవచ్చు.
- భారత్‌లో 72,739 వేల హెక్టార్ల అడవి ఉంది. ఇది ప్రపంచ మొత్తం అటవీ విస్తీర్ణంలో దాదాపుగా 2 శాతం.
- ఐరోపాలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉంది. మొత్తం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు 25 శాతం ఐరోపాలో ఉంది. దక్షిణ అమెరికాలో అత్యధిక అటవీ నిష్పత్తి ఉంది. ఇక్కడి మొత్తం భూభాగంలో 49 శాతం అడవి ఉంది.
- ప్రపంచంలోని మొత్తం అటవీ ప్రాంతంలో సగానికి పైగా(54 శాతం) ఐదు దేశాలతో కూడిన రష్యా సమాఖ్యలోనే ఉంది.
ప్రపంచ అటవీ వనరుల మదింపు(జీఎఫ్ఆర్ఏ)
ప్రపంచ అటవీ వనరుల మదింపు అనేది అధికార సమాచారం ఆధారంగా జరిగే ప్రపంచవ్యాప్త మదింపు. సహజంగా పునరుత్పత్తి, నాటడం ద్వారా పెరిగిన అడవి అనే రెండు విస్తృత విభాగాలను ఎఫ్ఆర్ఏ గుర్తిస్తుంది. ఈ విభాగాల్లో కేవలం స్థానిక జాతులే ఉండే ప్రాథమిక అడవులను సహజంగా పునరుత్పత్తి అవుతున్న ఉపవర్గంగా గుర్తిస్తుంది. నాటిన అడవుల ఉపవర్గాలుగా తోటల అడవులు(ఉదాహరణకు రబ్బరు), ఇతర నాటిన అడవులను(నాటిన అడవులే అయినప్పటికీ తోటల అడవిగా ప్రమాణాలకు తగ్గట్టుగా లేనివి) గుర్తిస్తుంది.
నాటిన అడవుల విస్తరణలో భారతదేశ విజయం
- వెదురు తోటలు: ప్రపంచవ్యాప్తంగా వెదురు వనరులు 30.1 మిలియన్ హెక్టార్లలో ఉన్నాయని అంచనా. ఇందులో 21.2 మిలియన్ హెక్టార్లు(70 శాతం) ఆసియాలోనే ఉన్నాయి. ఇందులో భారత్ వాటా 11.8 మిలియన్ హెక్టార్లు. ప్రపంచవ్యాప్తంగా వెదురు అడవుల విస్తీర్ణం 1990 నుంచి 2025 మధ్య 8.05 మిలియన్ హెక్టార్లు పెరిగింది. భారత్, చైనాలో విస్తీర్ణం భారీగా పెరగడమే ఇందుకు కారణం.
- రబ్బర్ తోటలు: ప్రపంచవ్యాప్తంగా 10.9 మిలియన్ హెక్టార్ల రబ్బర్ తోటలు ఉండగా భారత్‌లో 831 వేల హెక్టార్లలో ఉన్నాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా భారత్ 5వ స్థానంలో ఉంది.
భారత్‌లో వ్యవసాయక అటవీకరణ
వ్యవసాయక అటవీ విస్తీర్ణం: ఆసియాలోని వ్యవసాయక అటవీ విస్తీర్ణంలో దాదాపు 100 శాతం భారత్, ఇండోనేషియాలోనే ఉంది. భారత్‌లో ఇది సుమారు 39.3 మిలియన్ హెక్టార్లు.
ప్రపంచంలో వాటా: ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యవసాయక అటవీ విస్తీర్ణంలో 55.4 మిలియన్ హెక్టార్లతో భారత్, ఇండోనేషియా వాటా దాదాపు 70 శాతం.
అటవీ నిర్మూలన, నికర మార్పులు
- 1990-2025 మధ్య భారత్ నికర అటవీ పెరుగుదలను నమోదు చేసింది. నష్టాన్ని అటవీ పెంపకం ద్వారా విస్తరణ అధిగమించింది.
- ప్రపంచ కలప తొలగింపుల్లో 2023 నాటికి 9 శాతం వాటాతో భారత్ 2వ స్థానంలో ఉంది.
అడవిలో పడిపోయిన తర్వాత తొలగించే కలపను కలప తొలగింపు అంటారు. తొలగించిన కలపను రౌండ్‌వుడ్ లేదా వంటచెరుకు ఉత్పత్తి కోసం వినియోగించవచ్చు.
అటవీ ఉద్గారాలు, తొలగింపు చర్యలు 1990-2025(ఎఫ్ఏవో విశ్లేషణ)
ప్రపంచ దృశ్యం
- 2025 అటవీ వనరుల మదింపు ప్రకారం 2021-2025 మధ్యకాలంలో నికరంగా కార్బన్ డయాక్సైడ్‌ను శోషించాయి. అటవీ ప్రాంతంలో వార్షికంగా 3.6 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను శోషించాయి.
- 2021-2025 మధ్యకాలంలో అటవిని ఇతర వినియోగాలకు మార్చడం(అడవిని ధ్వంసం చేయడానికి సూచిక) వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.8 గిగాటన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వెలువడ్డాయి. ఈ ఉద్గారాలు కొంతవరకు అడవుల కార్బన శోషక ప్రభావానికి వ్యతిరేకంగా పనిచేశాయి.
- ఫలితంగా అటవీ కార్బన్ నిల్వల మొత్తం పెరిగింది. 2021-2025 మధ్యకాలంలో వాతావరణం నుంచి వార్షికంగా 0.8 గిగాటన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించాయి. కానీ, దశాబ్దం క్రితం నికర తొలగింపులు దాదాపు రెండింతలు(1.4 గిగాటన్నులు) ఉండేవి.
- 2021-2025 మధ్యకాలంలో ఐరోపా, ఆసియాలో అడవులు కార్బన్‌ను ఎక్కువగా శోషించాయి(ఏడాదికి ఐరోపా 1.4 గిగా టన్నులు, ఆసియా 0.9 గిగా టన్నులను తొలగించాయి).
భారతదేశ విజయాలు
- ప్రపంచవ్యాప్తంగా కార్బన శోషణలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2021-2025 మధ్య 150 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను ప్రతి యేటా అడవులు తొలగించాయి.
- 2021-2025 మధ్యకాలంలో భారత్ సహా ఆసియాలో అటవీ నిర్మూలన ఉద్గారాలు గణనీయాంగా తగ్గడంతో కార్బన శోషణ ఏడాదికి 0.9 గిగా టన్నులకు పెరిగింది.

భారతదేశ అటవీ స్థితి, మార్పులు
1. మొత్తం అటవీ విస్తీర్ణం: ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్) 2023 ప్రకారం భారతదేశ మొత్తం అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు. దేశ మొత్తం భూభాగంలో ఇది 21.76 శాతం.
2. అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు: అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్(77,073 చదరపు కిలోమీటర్లు), అరుణాచల్ ప్రదేశ్(65,882 చదరపు కిలోమీటర్లు), ఛత్తీస్‌గఢ్(55,812 చదరపు కిలోమీటర్లు).
3. మడ అడవుల విస్తీర్ణం: భారత్‌లో దాదాపు 4,992 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించాయి. ఎక్కువగా అండమాన్, నికోబార్ ఐలాండ్స్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో మడ అడవులు ఉన్నాయి.
4. జీవవైవిధ్య, సంరక్షిత ప్రాంతాలు: భారత్‌లో 106 జాతీయ ఉద్యానవనాలు, 573 వన్యప్రాణుల అభయారణ్యాలు, 115 సంరక్షణ ప్రాంతాలు, 220 సామాజిక పరిరక్షణ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వైవిధ్యమైన జంతుజాలాన్ని రక్షిస్తున్నాయి.
అటవీ విస్తీర్ణం పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యలు
1. బడ్జెట్ కేటాయింపులు
- 2025-26 బడ్జెట్: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రూ.3,412.82 కోట్లు కేటాయించింది. ఇది 2024-25 సవరించిన అంచనా రూ.3,125.96 కోట్ల కంటే 9 శాతం అధికం.
- రెవెన్యూ వ్యయం: 3,276.82 కోట్లు(మొత్తం కేటాయింపులో 96%), ఇది గతం కంటే 8% అధికం.
2. నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా(జీఐఎం)
- ప్రారంభం, లక్ష్యం: వాతావరణ మార్పులపై జాతీయ కార్యచరణ ప్రణాళిక(ఎన్ఏపీసీసీ) కింద 2014 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అటవీ, పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, జీవవైవిధ్యాన్ని పెంచడం, కార్బన శోషణ పెంచడం జీఐఎం లక్ష్యం.
- లక్ష్యాలు: 5 మిలియన్ హెక్టార్ల మేర అటవీ, పచ్చదనాన్ని విస్తరించడం, మరో 5 మిలియన్ హెక్టార్ల మేర అటవీ, అటవీయేతర భూముల్లో పచ్చదనం నాణ్యత పెంచడం.
- పర్యావరణం, జీవనోపాధి పెంపొందించడం: జీవవైవిధ్యం, నీరు, కార్బన్ నిల్వ వంటి వాటిని పెంపొందించడంతో పాటు అడవులపై ఆధారపడిన 3 మిలియన్ కుటుంబాల జీవనోపాధి ఆదాయాన్ని పెంచడంపై దృష్టి.
3. జాతీయ అటవీకరణ కార్యక్రమం
- లక్ష్యం: దేశంలో క్షిణించిపోయిన అడవులు, వాటి పరిసరాల్లో అడవుల పునరుద్ధరణ.
- అమలు తీరు: రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఎస్ఎఫ్‌డీఏ), అటవీ డిజిన్ స్థాయిలో అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీఏ), గ్రామ స్థాయిలో ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీల(జేఎఫ్ఎంసీ) ద్వారా అమలు
4. మిషన్ లైఫ్(పర్యావరణ అనుగుణ జీవనశైలి)
- ఐరాస పర్యావరణ అసెంబ్లీ తీర్మానం: మిషన్ లైఫ్(పర్యావరణ అనుగుణ జీవనశైలి) సూత్రాల ఆధారంగా స్థిరమైన జీవనశైలిపై తీర్మానాన్ని ఆమోదించింది.
- మెరీలైఫ్ పోర్టల్: వ్యక్తిగతంగా, ఉమ్మడిగా సుస్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు పోర్టల్ ఆవిష్కరణ.
- ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం: తల్లి, మాతృభూమిపై ప్రేమను జోడించడం ద్వారా మొక్కలు నాటేలా ప్రోత్సహించేందుకు చేపట్టిన భావోద్వేగ పిలుపు.
కొన్ని దేశాల్లో అడవుల నిర్మూలనను తగ్గించడం, మరికొన్ని దేశాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ప్రపంచం గుర్తించదగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని అటవీ విస్తీర్ణ డేటా చెప్తోంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానానికి ఎదిగింది. వార్షిక నికర విస్తరణలో 3వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది బలమైన జాతీయ నిబద్ధత ఎలాంటి విజయాలు సాధించగలదో నిరూపిస్తోంది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, స్థిరంగా అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం, జీఐఎం వంటి మిషన్లను అమలు చేయడం వంటి స్థిరమైన ప్రయత్నాలు పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాతావరణ మార్పుల పట్ల భారత్ నిబద్ధతను చాటుతున్నాయి.
Press Information Bureau:
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181416
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1894898
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1941073
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2088477
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2086742
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2115836
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2107821
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2041462
Ministry of Environment, Forest and Climate Change (MoEFCC), Government of India:
9. https://moef.gov.in/uploads/pdf-uploads/English_Annual_Report_2024-25.pdf
10. https://moef.gov.in/green-india-mission-gim
Ministry of External Affairs:
11. https://www.mea.gov.in/press-releases.htm?dtl%2F38161%2FThe_3rd_Voice_of_Global_South_Summit_2024
Food and Agriculture Organizationof the United Nations / Global Forest Data:
12. https://www.fao.org/newsroom/detail/global-deforestation-slows--but-forests-remain-under-pressure--fao-report-shows/en
13. https://www.fao.org/home/en/
14. https://www.fao.org/forest-resources-assessment/en/
15. https://openknowledge.fao.org/server/api/core/bitstreams/2dee6e93-1988-4659-aa89-30dd20b43b15/content/FRA-2025/forest-extent-and-change.html#forest-area
16. https://openknowledge.fao.org/server/api/core/bitstreams/2dee6e93-1988-4659-aa89-30dd20b43b15/content/cd6709en.html
17. https://openknowledge.fao.org/server/api/core/bitstreams/12322cae-5b20-4be2-927a-72a86fd319e9/content
18. https://www.fao.org/4/ae352e/AE352E11.htm
Download in PDF
***
(तथ्य सामग्री आईडी: 150441)
आगंतुक पटल : 37
Provide suggestions / comments