ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ వృద్ధి ప్రయాణం బలంగా, స్థిరంగా, విశ్వసనీయంగా ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్-2026లో ఈ రోజు కేంద్ర మంత్రి ప్రసంగించారు. భారత్ ఆర్థిక పనితీరు, నిరంతర సంస్కరణలు, విస్తరిస్తున్న వాణిజ్య అవకాశాలతో పాటు దేశాభివృద్ధి లక్ష్యాలకు అండగా నిలవడంలో రుణ మార్కెట్లకు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించిందని మంత్రి తెలియజేశారు. రెండో త్రైమాసికంలోనూ అదే వృద్ధి వేగాన్ని కొనసాగించే దిశగా దేశం పయనిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థూల స్థిర మూలధన కల్పన సుమారు 12 శాతం పెరగ్గా, ఎగుమతులు ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లోనే 570 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది ఊహకందనిదిగా, ఆకాంక్షాత్మకంగా కనిపించిందన్నారు. కానీ ఆ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే దిశలోనే భారత్ ఉందని చెప్పారు. సుమారు 19 శాతం రుణ వృద్ధి నమోదు కావడం మరో సానుకూల సంకేతమని, ముఖ్యంగా రుణ మార్కెట్లకు ఇది శుభపరిణామమని ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రెండు యుద్ధాలు, చమురు ధరల కుదుపు, సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి, సముద్ర మార్గాల్లో అవాంతరాలు, విమాన ప్రయాణాలను ప్రభావితం చేస్తున్న చెదురుమదురు దాడుల నడుమ కూడా భారత్ తన స్థిరత్వాన్ని చాటుకుందని శ్రీ గోయల్ అన్నారు. ఈ సవాళ్లన్నింటినీ తట్టుకుని నిలబడటం వల్ల భారత్ వృద్ధిపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం స్థిరంగా ఉందని, ఆ నమ్మకాన్ని దేశం నిలబెట్టుకుందని ఆయన తెలియజేశారు.
భారత్ ప్రక్రియలను నిరంతరం సంస్కరిస్తోందని, నూతన విధానాలను ప్రవేశపెడుతోందని, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తోందని తెలియజేశారు. అలాగే వ్యాపారవేత్తలు, భాగస్వాములతో చర్చించడానికి సిద్ధంగా ఉండే విధానాన్ని అవలంబిస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో పాటు వచ్చే 20 నుంచి 25 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. దేశంలో పుట్టే ప్రతి బిడ్డకూ మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, విస్తృతమైన అవకాశాలు అందేలా చూడటమే వీటి ప్రధానోద్దేశం అని వివరించారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) ఖరారు చేసే ప్రక్రియను భారత్ కొనసాగిస్తోందని, జీఎస్టీ వ్యవస్థను మరింత సరళతరం చేస్తూ, పన్ను రేట్లను తగ్గించేలా సంస్కరణలు తెస్తోందని మంత్రి తెలిపారు. దీనివల్ల దేశంలో వినియోగం పెరుగుతోందన్నారు. జీఎస్టీ వసూళ్లు నిరంతరం పెరుగుతున్నాయని, అక్టోబర్ నెలలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని ఆయన తెలియజేశారు. ఒక్క అక్టోబర్‌లోనే ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో 90 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయని వివరించారు.
ఇంకా అనేక ముఖ్యమైన ఎఫ్‌టీఏలు అమల్లోకి రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇండియా-ఈయూ ఎఫ్‌టీఏపై ఈ ఏడాది చివర్లో సంతకాలు జరిగే అవకాశం ఉందని, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి అది అమల్లోకి రావచ్చని చెప్పారు. ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని, ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియ, మార్గం రూపుదిద్దుకుంటున్నాయని ఆయన వివరించారు.
డెట్ క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థ మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సదస్సు నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ సదస్సు ఇతివృత్తమైన 'కెటలిస్ట్స్, అపెక్స్ అండ్ క్రెడిట్' ప్రస్తుత కాలానికి తగినట్టుగా ఉందని, భారత్ వృద్ధికి ఎంతో కీలకమైనదని అభిప్రాయపడ్డారు. బాండ్, రుణ మార్కెట్లు నమ్మకానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. అవి రుణగ్రహీతల విశ్వసనీయతపైనే ఆధారపడి ఉండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రాధాన్య, ద్వైపాక్షిక, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారత్ చురుగ్గా పాల్గొనడానికి ప్రపంచ దేశాలతో ఉన్న విశ్వసనీయ భాగస్వామ్యమే కారణమని శ్రీ గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయి నుంచి 30 ట్రిలియన్ డాలర్ల దిశగా పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థ అందిస్తున్న అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వాములకు భారత్ అందిస్తున్న విశ్వసనీయ సహకారమే దేశ వృద్ధి ప్రయాణానికి బలమైన ఆధారాలని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రెండు నుంచి మూడు దశాబ్దాల పాటు ప్రాధాన్య భాగస్వామిగా, ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా, నమ్మకమైన మిత్రదేశంగా భారత్ ఎదిగిందని మంత్రి అన్నారు. దేశంలో విస్తరిస్తున్న తయారీ, ఎగుమతి సామర్థ్యాలు, ఎఫ్‌టీఏల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడం, మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న నివాస, వాణిజ్య భవనాల మొత్తం సంఖ్య కంటే ఎక్కువ భవనాలను వచ్చే 30 ఏళ్లలో భారత్ నిర్మించే అవకాశం ఉందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థాయిని, వివిధ రంగాల్లో కొత్తగా వస్తున్న అవకాశాలను ఇది ప్రతిబింబిస్తోందని మంత్రి తెలియజేశారు.
పెరుగుతున్న చమురు ధరలు ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నప్పటికీ, దేశంలో చోటు చేసుకుంటున్న ఆర్థిక మార్పులను కూడా పరిగణించి భారత దీర్ఘకాలిక వృద్ధిపై దాని ప్రభావాన్ని అంచనా వేయాలని శ్రీ గోయల్ అన్నారు. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం వద్ద విదేశీ మారక నిల్వలు, విదేశాల నుంచి వచ్చే నగదు బదిలీలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం బాగా పెరిగాయన్నారు.
భారతదేశం 700 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఎగుమతులు చేస్తోందని, ఈ ఏడాది మొత్తం ఎగుమతుల విలువ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. దేశ జీడీపీ 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని, ప్రపంచంలోని అయిదు లేదా ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. కొనుగోలు శక్తిలో సమానత్వం ఆధారంగా భారత్ జీడీపీ సుమారు 18 నుంచి 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, వస్తు సేవలను వినియోగించుకునే సామర్థ్యంతో పాటు పోటీ ధరలకు ఉత్పత్తి చేయగల శక్తి దేశానికి ఉందని ఇది తెలియజేస్తోందన్నారు.
భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్థాయి వద్ద చమురు ధరల్లో కొన్ని డాలర్ల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అవి దేశ దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్ణయించలేవని మంత్రి అన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ జాతీయ రుణ భారం ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతోందన్నారు. మొత్తం రుణంలో విదేశీ రుణ వాటా మరింత తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలన్నీ భారత్ వృద్ధికి ఉన్న సుస్థిరతను తెలియజేస్తున్నాయన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా బాధ్యతల విషయంలో భారత్ ఎన్నడూ విఫలం కాలేదని స్పష్టం చేశారు.
భారత్‌లో వడ్డీ రేట్లు ఇప్పటికీ మితమైన స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న సమయంలోనూ, మార్కెట్లలో ఒడుదొడుకులు నెలకొన్నప్పటికీ దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారులు మార్కెట్లకు అండగా నిలిచారని పేర్కొన్నారు. భారత్ వృద్ధి ప్రస్థానం సురక్షితమైనది, బలమైనది, స్థితిస్థాపకమైనది, విశ్వసనీయమైనదని అన్నారు.
గత 12 ఏళ్లుగా నిరంతరంగా చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల్లో అమలు చేసిన పరివర్తనాత్మక కార్యక్రమాల ఫలితంగానే భారత్ ఆర్థికంగా రూపాంతరం చెందిందని మంత్రి స్పష్టం చేశారు. ఇది యాదృచ్ఛికంగా లేదా అదృష్టం వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఆహారం, దుస్తులు, నివాసం, వైద్యం, విద్య, మంచి రహదారులు, నాణ్యమైన విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ వంటి పౌరుల నిత్యావసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.
ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ నీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. 12 ఏళ్లలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం గణనీయమైన విజయమని పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు పెరిగి, వారు కొత్త మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లోకి చేరుతున్న కొద్దీ మార్కెటులో భారీ అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న వినియోగం, ఆర్థిక వృద్ధితో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కొత్త మార్కెట్లను తెరవడం వల్ల భారతీయ తయారీదారులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు, సేవల రంగ సంస్థలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని శ్రీ గోయల్ అన్నారు. నిరంతర సంస్కరణలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్థిరమైన ప్రయత్నాలతో భారత్ వృద్ధి కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ఎగుమతులను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రపంచస్థాయిలో పోటీపడగల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తయారీ రంగంలో పెట్టుబడులను పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఉత్పత్తులకు విలువ జోడింపు, నాణ్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో అగ్రగామిగా నిలిచేలా ప్రతిభావంతులైన నిపుణుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు.
భారత్ ప్రపంచ దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏల) ద్వారా ప్రాధాన్య మార్కెట్ ప్రవేశ అవకాశాలు విస్తరిస్తున్నాయని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 2014 వరకు భారత్ కుదుర్చుకున్న ఎఫ్‌టీఏలు సుమారు 10 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన దేశాలకు మాత్రమే వర్తించేవని, అప్పట్లో ప్రపంచ జీడీపీ సుమారు 115 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేదన్నారు. గత నాలుగున్నర నుంచి అయిదేళ్లలో ఖరారైన తొమ్మిది ఎఫ్‌టీఏలు 38 అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తున్నాయని, వాటి మొత్తం జీడీపీ 60 లక్షల కోట్ల డాలర్లని తెలిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కలిపితే, ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో 70 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థలతో భారత్‌కు ప్రాధాన్య మార్కెట్ ప్రవేశం లభిస్తోందని వివరించారు.
మరో ఎనిమిది లేదా తొమ్మిది ఒప్పందాలపై భారత్ చర్చలు జరుపుతోందని, వీటి ద్వారా అదనంగా 15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ప్రవేశ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. దీంతో 115 నుంచి 120 లక్షల కోట్ల డాలర్ల ప్రపంచ జీడీపీలో భారత్‌కు అందుబాటులో ఉండే మార్కెట్ విలువ 85 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్పారు. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశమూ భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవాలని కోరుకుంటోందని, ఇది విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదుగుతున్న తీరును, భారతీయ వ్యాపార సంస్థలకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతిబింబిస్తోందని అన్నారు.
సదస్సు ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమష్టిగా కొత్త వృద్ధి అవకాశాలను సృష్టిస్తున్నాయని శ్రీ గోయల్ చెప్పారు. రెండు రంగాల్లోనూ అధిక మూలధన వ్యయానికి మార్గాలను తెరుస్తున్నాయని పేర్కొన్నారు. రుణాల వృద్ధిలో కనిపిస్తున్న పెరుగుదల భారత్ వృద్ధి ప్రస్థానంపై ఉన్న ఆకర్షణను, పెట్టుబడులకు తిరిగి అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ప్రతిబింబిస్తోందని అన్నారు.
సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు, విద్యుత్ గ్రిడ్‌లు, డేటా సెంటర్లు, ముంబై వెలుపల వధావన్‌లో నిర్మాణమవుతున్న కొత్త ఓడరేవు వంటి ప్రాజెక్టుల విస్తరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో భారీగా రుణాల అవసరం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ వృద్ధికి నిధులు సమకూర్చడంలో రుణ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రానున్న రెండు, మూడు దశాబ్దాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాల స్థాయి, వైవిధ్యం, కాలపరిమితికి అనుగుణంగా దేశ ఆర్థిక వనరుల సమీకరణ వ్యవస్థ ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చేందుకు వేగవంతమైన, సమర్థవంతమైన నిధుల సమీకరణతో పాటు ఆకర్షణీయమైన, వినూత్న ఆర్థిక సాధనాలు అవసరమని చెప్పారు.
రానున్న సంవత్సరాల్లో ప్రైవేటు పెట్టుబడులు నిధుల సమీకరణకు మరింత కీలకమైన వనరుగా మారతాయని కేంద్రమంత్రి అన్నారు. ప్రపంచ బాండ్ సూచీల్లో భారత్‌కు చోటు లభించడం కూడా రుణ మార్కెట్ల వృద్ధికి ముఖ్యమైన తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు.
రుణ మూలధన మార్కెట్ వ్యవస్థ అభివృద్ధికి అయిదు కీలక ప్రాధాన్యాలను మంత్రి వివరించారు:
మొదటిది: దీర్ఘకాలిక ప్రాజెక్టులతో సహా మూలధన వ్యయానికి అవసరమైన నిధుల కోసం పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు బాండ్ మార్కెట్‌ను తమ తొలి ఎంపికగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాటి నిధుల అవసరాలను తీర్చేందుకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రెండోది: దీర్ఘకాలిక రుణాలు, విస్తృత రుణ వ్యవస్థకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వాలని కోరారు. బీమా సంస్థలు, పెన్షన్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, ప్రావిడెంట్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టగల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. ఏఏఏ రేటింగ్ ఉన్న సాధనాలకే పరిమితం కాకుండా ఇతర అవకాశాలనూ పరిశీలించాలని సూచించారు.
మూడోది: షేర్ల మార్కెట్ తరహాలో బాండ్ల ట్రేడింగ్‌ను సులభతరం చేయాలని, లావాదేవీలు తక్షణమే పూర్తయ్యేలా చూడాలని మార్కెట్ వర్గాలకు పిలుపునిచ్చారు.
నాలుగోది: ఎఫ్‌టీఏల ద్వారా ఏర్పడిన అవకాశాలను ఎగుమతిదారులు, వారికి ఆర్థిక సహాయం అందించే సంస్థలు పెట్టుబడి నిర్ణయాలుగా మలచుకోవాలని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరారు.
అయిదోది: అన్ని వర్గాలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మరిన్ని సంస్కరణలు, మెరుగుదల కోసం ఈ రంగానికి చెందినవారు తమ సూచనలు, ఆలోచనలను అందించాలని ఆహ్వానించారు.
భారత్ నిరంతర వృద్ధి, స్థితిస్థాపకతపై విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య సహకారం ఎంతో ముఖ్యమని చెబుతూ కేంద్రమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
***