రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సంయుక్తంగా తదుపరి తరం రక్షణ పరికరాల అభివృద్ధి, ఉత్పత్తులను వేగవంతం చేసేందుకు భారత్, యూఏఈ అంగీకారం: అబుదాబిలో జేడీసీసీ 14వ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 8:00PM by PIB Hyderabad

భారత్ - యూఏఈ సంయుక్త రక్షణ సహకార కమిటీ (జేడీసీసీ) 14వ సమావేశం 2026 నవంబర్ 26న అబుదాబిలో జరిగింది. భారత్ తరపున రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, యూఏఈ తరఫున ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహీం నాజర్ ఎం. అల్ అలావి సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

2026 మే నెలలో భారత ప్రధానమంత్రి యూఏఈ పర్యటన సందర్భంగా కుదిరిన ‘భారత్-యూఏఈ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య చట్రం’ కింద చేపట్టిన కార్యక్రమాలకు ఈ సమావేశం వ్యూహాత్మక దిశానిర్దేశాన్ని అందించింది. రక్షణ పరిశ్రమ, రక్షణ రంగంలో ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, సైనిక శిక్షణ, నౌకా వాణిజ్య భద్రత వంటి విస్తృత రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తదుపరి తరం రక్షణ పరికరాల సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వామ్యాలను వేగవంతం చేయాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి.

తదుపరి జేడీసీసీ సమావేశం లోపు రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఇరు దేశాల సహాధ్యక్షులు నిర్ణయించారు. భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ, భారత సాయుధ దళాలు, జాతీయ భద్రతా మండలి సచివాలయం, విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధులు ఉన్నారు.

ఇరుదేశాల సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా.. జేడీసీసీ బృందంతోపాటు భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధి బృందం కూడా అబుదాబి వెళ్లింది. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య వాణిజ్యపరమైన చర్చలు జరిగాయి. భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధి బృందం తవాజున్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి.. తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్‌తో సమావేశమై యూఏఈ భాగస్వాములతో పరస్పర సహకారానికి గల అవకాశాలపై చర్చించింది.

రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో.. యూఏఈ రక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ ముబారక్ ఫదెల్ అల్ మజ్రోయ్‌తో సమావేశమైంది. గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఇరుపక్షాల ప్రతినిధి బృందాలు చర్చించాయి. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తరఫున రక్షణ శాఖ కార్యదర్శి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు యూఏఈ సేవలో ప్రాణాలర్పించిన వీరసైనికుల స్మారకార్థం ఏర్పాటు చేసిన అబుదాబిలోని వహత్ అల్ కరమా వద్ద రక్షణ శాఖ కార్యదర్శి వినమ్ర పూర్వకంగా నివాళి అర్పించారు.

వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలతోపాటు బలమైన ప్రజా సంబంధాలు శతాబ్ధాలుగా భారత్ - యూఏఈ మైత్రికి ప్రాతిపదికలుగా నిలుస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి విస్తరించగా.. ప్రస్తుతం వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం అందులో భాగమైంది.  

***


(రిలీజ్ ఐడి: 2342973) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil