57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వేదికగా గోవాలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ జ్యూరీ ఛైర్‌పర్సన్, భారత సినీ రూపకర్త ఆనంద్ ఎల్ రాయ్, ఇతర జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు. గోల్డెన్ పీకాక్ పురస్కారం కోసం బరిలో నిలిచిన 15 ఫీచర్ ఫిల్మ్‌లను సమీక్షించిన తమ విశేష అనుభవాలను వారు మీడియాతో పంచుకున్నారు. విభిన్న సినీ దృక్పథాలు, సాంస్కృతిక ఆలోచనలను పరస్పరం పంచుకోవడం, నేటి కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతున్న సినిమా కథన శైలిపై జ్యూరీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
జ్యూరీ అనుభవాన్ని ఒక విజ్ఞానదాయకమైన ప్రయాణంగా ఆనంద్ ఎల్ రాయ్ అభివర్ణించారు. భిన్న దేశాలు, వైవిధ్యమైన సంస్కృతుల నుంచి వచ్చిన చిత్రాలను చూడటం, వాటిపై తోటి జ్యూరీ సభ్యులతో విశ్లేషణాత్మక చర్చలతో... ఆయా దర్శకుల సృజనాత్మక నిర్ణయాలు, సామాజిక-సాంస్కృతిక కోణాలను లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలిగిందని ఆయన తెలిపారు. "నేను జ్యూరీ సభ్యుడిగా ఇక్కడకు వచ్చాను... కానీ ఈ సినిమాలను వీక్షిస్తూ మళ్లీ సినిమా పాఠాలు నేర్చుకునే విద్యార్థిలా మారిపోయాను" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.
జ్యూరీ నిర్ణయాల వెనక సుదీర్ఘంగా సాగిన చర్చల తీరును ఆనంద్ ఎల్ రాయ్ వివరిస్తూ.. ఎలాంటి ముందస్తు అంచనాలకు తావివ్వకుండా, సినిమా ఏ దేశానిదనే భేదం చూడకుండా అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా చర్చించి అవార్డులను ఎంపిక చేశామన్నారు. సభ్యులంతా తమ ఆలోచనలను నిస్సంకోచంగా పంచుకోవడంతో ఎంపిక ప్రక్రియ చాలా సహజంగా సాగిందన్నారు. "నా దృష్టిలో ఇదంతా చాలా సహజసిద్ధంగా సాగిపోయింది. దాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియదు. మేమంతా మనసు విప్పి మాట్లాడుకున్నాం" అని రాయ్ పేర్కొన్నారు. సినిమాలోని ఒకే అంశాన్ని సభ్యులు వేర్వేరు కోణాల్లో విశ్లేషించినా, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి నిర్ణయానికి రావడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు.
సినిమా నిరంతరం పరిణామం చెందుతున్న ఒక కళా రూపమని ఆనంద్ ఎల్ రాయ్ స్పష్టం చేశారు. ఏ భాష సినిమా కోసం పనిచేస్తున్నా... మారుతున్న సినిమా కథన రీతులను దర్శకనిర్మాతలు అందిపుచ్చుకోవాలని సూచించారు.. "సినిమా అంటే ఒక అనుభూతి... ఒక భావోద్వేగపు అనుభవం లేదా దాని వ్యక్తీకరణ. ప్రతి సినిమా ప్రేక్షకుడిపై ఏదో ఒక ప్రభావాన్ని చూపాలి. సినిమా చూసిన తర్వాత మీరు మునుపటిలా ఉండకూడదు. అది మీ అంతరంగంలో ఏదో ఒక మార్పును తీసుకురావాలి" అని ఆయన అన్నారు. సినిమా భాషను అంతిమంగా భాషలు కాకుండా, దర్శకనిర్మాతలే తీర్చిదిద్దుతారని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఎడిషన్‌లో తన సినిమా ముగింపు చిత్రంగా ప్రదర్శితమైన తర్వాత... ఈ ఏడాది జ్యూరీ సభ్యునిగా ఐఎఫ్ఎఫ్ఐలో పాలుపంచుకుంటున్న థాయ్ దర్శకనిర్మాత రాట్చాపూమ్ బూన్‌బుంచాచోక్ తన అనుభవాలను పంచుకున్నారు. జ్యూరీ సభ్యుల విభిన్న నేపథ్యాలు తమ చర్చలను మరింత సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు. కేవలం సాంకేతిక నైపుణ్యం కంటే ఒక సినిమా కలిగించే భావోద్వేగ ప్రభావమే అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. "ప్రేక్షకులను భావోద్వేగపరంగా కదిలించడానికి దర్శకుడు ఆ సాంకేతికతను ఎలా ఉపయోగించుకున్నాడనేదే ఇక్కడ ముఖ్యం" అని ఆయన వ్యాఖ్యానించారు.
పోస్ట్-ప్రొడక్షన్ సాంకేతిక నిపుణురాలి కోణంలో తనకు ఈ జ్యూరీ అనుభవం ప్రత్యేకమైన సంతృప్తినిచ్చిందని కొలంబియన్ సౌండ్ డిజైనర్ మారియా అలెజాండ్రా రోజాస్ పేర్కొన్నారు. జ్యూరీ సభ్యుల మధ్య జరిగిన చర్చలు ఎంతో ఆలోచింపజేసేలా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. సినిమా పూర్తయ్యాక గదిలో ఆవరించే ఆ కాసేపటి నిశ్శబ్దమూ తమ విశ్లేషణలకు మరింత సమగ్రతను అందించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవంలో ప్రదర్శించే చిత్రాల ఎంపికలో విభిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించడం అభినందనీయమని అర్జెంటీనా సినిమా రూపకర్త, స్క్రీన్‌రైటర్ సోల్ బెరుజో పిచాన్-రివియర్ వ్యాఖ్యానించారు. పెద్ద స్థాయి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అంతగా ప్రాచుర్యం పొందని సినిమాలతో పాటు... భిన్న దేశాలు, సంస్కృతులు, చిన్న-పెద్ద నిర్మాణ స్థాయిల నుంచి వచ్చిన చిత్రాలకూ ఐఎఫ్ఎఫ్ఐ చక్కని వేదికగా నిలిచిందని ఆమె కొనియాడారు.
పోటీ విభాగానికి ఎంపికైన చిత్రాలన్నీ అత్యంత శక్తిమంతమైనవిగా ఉన్నాయని రొమేనియన్ రచయిత, దర్శకనిర్మాత బొగ్డాన్ మురెషాను కొనియాడారు. భిన్న దేశాలకు చెందిన జ్యూరీ సభ్యుల ఆలోచనలు, అభిరుచులు ఇంతలా కలవడం విశేషమని ఆయన అన్నారు. ప్రదర్శనల అనంతర చర్చలను గుర్తుచేసుకుంటూ... "ఒక్కో సినిమా ముగియగానే అందులోని మంచిచెడులపై తక్షణమే చర్చించేవాళ్ళం. ఆ కథల మాయలోంచి త్వరగా బయటకు రాలేకపోయాం. మరో కొత్త సినిమా ప్రయాణం మొదలయ్యే లోపు ఆ అనుభూతిని మరికొంతసేపు ఆస్వాదించే అవకాశం మాకు కలిగింది" అని వివరించారు. తోటి సభ్యుల విశ్లేషణలు వినడం వల్ల ఒకే చిత్రాన్ని విభిన్నమైన కోణాల్లో అర్థం చేసుకునే వీలు కలిగిందని ఆయన పేర్కొన్నారు.
విభిన్న సినీ సంస్కృతుల మధ్య సంభాషణలకు వారధిగా నిలుస్తూ... పరస్పరం నేర్చుకోవడానికి, కళను ఆస్వాదించడానికి చక్కని వేదికను అందించడంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ప్రాముఖ్యతను జ్యూరీ సభ్యుల మాటలు మరోసారి స్పష్టం చేశాయి.
ఈ మీడియా సమావేశానికి శ్రీ రజిత్ చంద్రన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
* * *