ఆర్యన్ దృష్టిలో: మాక్ డాక్యుమెంటరీ కథనశైలి, వ్యక్తిగత ప్రేరణలు, ‘అజయంతే మరణం: ఒరు కేస్ స్టడీ’ చిత్ర రూపకల్పనపై శ్రీహరి హరిదాస్ మనోగతం
తొలి చిత్రంతోనే ‘ఉత్తరం’ సినిమాకు దర్శకుడి ఘన నివాళి
గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ‘ఇండియన్ పనోరమా - న్యూ హారిజన్స్’ విభాగంలో శ్రీహరి హరిదాస్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘అజయంతే మరణం: ఒరు కేస్ స్టడీ’ ఈ రోజు ప్రదర్శితమైంది.
పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్రీహరి హరిదాస్, తన తొలి ఫీచర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చలనచిత్రోత్సవంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై ప్రోత్సాహం అందిస్తారని తాను ఊహించలేదని చెప్పారు.

అజయన్ అనే పాత్ర చుట్టూ సాగే వ్యక్తిత్వ చిత్రణగా ఈ సినిమాను అభివర్ణించిన శ్రీహరి హరిదాస్, దీన్ని డాక్యుమెంటరీ తరహాలో రూపొందించిన కల్పిత కథాచిత్రంగా (మాక్ డాక్యుమెంటరీ) తెరకెక్కించినట్లు తెలిపారు. మలయాళ చిత్రసీమలో ఈ తరహా కథనశైలిని ఇంతవరకూ పెద్దగా అన్వేషించలేదని పేర్కొన్నారు. ఈ విభిన్నమైన విధానం చిత్రీకరణ, నిర్మాణ దశల్లో తనకు కొన్ని సవాళ్లను కూడా తీసుకొచ్చిందని ఆయన అంగీకరించారు.
కథనం గురించి వివరిస్తూ, అజయన్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, అతడి మరణానికి దారితీసిన పరిస్థితులను ఆర్యన్ అనే ఔత్సాహిక చిత్ర దర్శకుడు పరిశోధించే క్రమంలో కథ సాగుతుందని శ్రీహరి హరిదాస్ తెలిపారు. ఆర్యన్ పాత్రను రూపొందించే సమయంలో తన వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలను కూడా అందులో పొందుపరిచానని వెల్లడించారు. అలాగే అజయన్ పాత్రలోనూ తనకు దగ్గరగా అనిపించే కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పారు. “ఆర్యన్ పాత్రలో నా వ్యక్తిత్వ ఛాయలు కనిపిస్తాయి. అజయన్ పాత్రలోనూ నాకు సంబంధించిన కొన్ని పోలికలు ఉన్నాయి” అని ఆయన అన్నారు.
స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడుతూ, మొదటి ప్రతిని కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేశానని, ఆ తర్వాత తుది స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి దాదాపు నెల రోజుల పాటు కృషి చేశానని హరిదాస్ గుర్తుచేసుకున్నారు. ఇతరుల అనుభవాలను ఆవిష్కరించడానికి ఒక ప్రధాన పాత్రను కథన సాధనంగా ఉపయోగించుకోవడం తాను తరచూ అనుసరించే పద్ధతి అని వివరించారు. పాత్రలు, కథన నిర్మాణాలు మారవచ్చని, అయితే వ్యక్తుల చుట్టూ కథలను అల్లుతూ, వారి జీవిత ప్రయాణాలను అనుసరించడం తనకు ఇష్టమని ఆయన తెలిపారు.

తన దర్శకత్వంలో రూపొందిన ‘అజయంతే మరణం: ఒరు కేస్ స్టడీ’ చిత్రం మలయాళ సినిమా ‘ఉత్తరం’కు నివాళిగా నిలుస్తుందని హరిదాస్ పేర్కొన్నారు. తన తొలి చిత్ర నిర్మాణంపై ‘ఉత్తరం’ చూపిన ప్రభావాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
తన చిత్రానికి లక్ష్యంగా ఎంచుకున్న ప్రేక్షకులు, విడుదల ప్రణాళికలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ సినిమాను ప్రధానంగా చలనచిత్రోత్సవాల వేదికను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ దశలో సంప్రదాయ పద్ధతిలో థియేటర్లలో విడుదల చేయడం కంటే, చలనచిత్రోత్సవాల ద్వారా ప్రేక్షకులకు చేరువ కావడానికే చిత్ర బృందం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
విలేకరుల సమావేశానికి శ్రీమతి గోపిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Watch the full press conference:
***
***