గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో ‘ది కాస్టింగ్ మ్యాజిక్: ఆడిషన్స్ అన్‌ప్లగ్డ్’ అనే అంశంపై నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో ఔత్సాహిక నటీనటులకు ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రా విలువైన సూచనలు, ఆచరణాత్మక సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల్లో నటనా రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహికులు, నటనను వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్న మధ్యస్థాయి అనుభవం కలిగిన నిపుణులు, రచయితలు, వర్ధమాన చిత్ర దర్శకులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు గోవాకు చెందిన స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంచి నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఆడిషన్‌లో ఎలా రాణించాలి? నటీనటుల ఎంపిక ప్రక్రియలోని వివిధ అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి అనేక ప్రశ్నలను అడుగుతూ వారు ముఖేశ్ ఛాబ్రాతో ఉత్సాహంగా సంభాషించారు.
ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్.. ముఖేశ్ ఛాబ్రా ను పరిచయం చేస్తూ, “ముఖేశ్‌లో నాకు నచ్చిన విషయం పాత్రలను అంచనా వేయడంలో ఆయనకున్న ప్రత్యేక దృష్టి. ఆయా పాత్రలకు సరిపోయే నటీనటులను గుర్తించేందుకు ఆయన ఎంత దూరమైనా వెళతారు” అని అన్నారు.
_20261126164744_1baf9f.jpeg)
300కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ముఖేశ్ ఛాబ్రా మాట్లాడుతూ , నటీనటుల ఎంపిక ప్రక్రియ ఎంత విస్తృతమైనదో, ఎంతటి శ్రమతో కూడుకున్నదో వివరించారు. సరైన నటుడిని గుర్తించడం అంటే కేవలం అందుబాటులో ఉన్న నటీనటుల వివరాలను పరిశీలించడం లేదా పరిచయమున్న ముఖాలనే ఎంపిక చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. “మన దేశంలో అపారమైన ప్రతిభ ఉంది. గతంలో కాస్టింగ్ డైరెక్టర్లు లేని సమయంలో నటీనటులను ఎంపిక చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రతిభావంతులను గుర్తించేందుకు నా బృందాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తాను. ప్రతిభను వెతకాలంటే మన మూలాల వరకు వెళ్లాలి. మన దేశంలో ఎన్నో సంప్రదాయ కళారూపాలు, విభిన్న ఉపసంస్కృతులు ఉన్నాయి. వాటిలో అపారమైన సహజసిద్ధమైన ప్రతిభ కనిపిస్తుంది” అని ఆయన అన్నారు.
నటీనటుల ఎంపికలో తన విధానాన్ని వివరిస్తూ, ఒక సినిమా స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత సాధారణంగా దర్శకుడు మొదట సంప్రదించేది తననేనని ముఖేశ్ ఛాబ్రా తెలిపారు. ముందుగా స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివి, అందులోని పాత్రలు, దర్శకుడి దృక్పథంపై చర్చిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయా పాత్రలకు ఇప్పటికే గుర్తింపు పొందిన నటుడు సరిపోతాడా, కొత్త నటుడిని ఎంపిక చేయాలా అన్నది నిర్ణయిస్తానని వివరించారు. అనంతరం కథ జరిగే ప్రాంతానికి వెళ్లి, అక్కడి స్థానిక సమాజాల్లోని ప్రతిభావంతులను గుర్తిస్తానని తెలిపారు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం, దానికి సరిపోయే వ్యక్తిత్వాన్ని గుర్తించడం, దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఉండే నటుడిని సిఫారసు చేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. “నా దగ్గరున్న నటీనటుల వివరాల కోసం కాదు.. నా అభిప్రాయం, నా ఆలోచనల కోసం దర్శకులు నన్ను నియమించుకుంటారు” అని ఆయన వ్యాఖ్యానించారు. నటుడికి, దర్శకుడికి మధ్య అనుసంధానకర్తగా తాను వ్యవహరిస్తానని తెలిపారు.
ఈ ఎంపిక ప్రక్రియ ఎంత విస్తృతంగా ఉంటుందో వివరిస్తూ, ‘దంగల్’ చిత్రానికి నటీనటులను ఎంపిక చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని ముఖేశ్ ఛాబ్రా గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలోని పాత్రల కోసం సుమారు 14 వేల మంది బాలికలు ఆడిషన్లకు హాజరయ్యారని తెలిపారు. ‘రామాయణ’ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియ ఆరేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. తన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రానికి ఏకంగా 384 మందిని ఎంపిక చేసిన అనుభవాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. “గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ నా జీవితాన్నే మార్చేసింది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ చిత్ర దర్శకులతో కలిసి పనిచేసిన తన అనుభవాలను పంచుకుంటూ, ప్రతి దర్శకుడికి తనదైన ప్రత్యేక దృక్పథం, పని విధానం ఉంటాయని ముఖేశ్ ఛాబ్రా తెలిపారు. చిత్ర దర్శకుడు ఊహించిన పాత్రలకు నటీనటులు సరిగ్గా సరిపోయేలా చూడటమే తన బాధ్యతని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో నటీనటుల ఎంపిక ప్రక్రియ కథా రచనపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. ‘కై పో చే!’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, గట్టు పాత్రను రాజ్‌కుమార్ రావును దృష్టిలో ఉంచుకునే రచయితలు రూపొందించారని అన్నారు. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనోజ్ బాజ్‌పేయి వంటి ప్రతిభావంతులైన నటులు తమదైన ప్రత్యేకతలను పాత్రలకు జోడిస్తారని, ఒక్కోసారి వారి నటనా సామర్థ్యం దర్శకులను పాత్రలను మళ్లీ ఆలోచించి, కొత్తగా మలచుకునేలా ప్రేరేపిస్తుందని వివరించారు.
రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన ప్రయాణాన్ని వివరిస్తూ, తన పనిని తొలుత గుర్తించిన వారిలో నటుడు ఆమిర్ ఖాన్ ఒకరని ముఖేశ్ ఛాబ్రా తెలిపారు. కొత్త ప్రతిభను వెలికితీయాలన్న నిరంతర ఆసక్తి, అభిరుచే తన వృత్తి ప్రయాణానికి ప్రధాన చోదకశక్తిగా నిలిచాయని చెప్పారు. రాబోయే రెండు, మూడేళ్లలో మరో వందకు పైగా సినిమాలకు నటీనటులను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియ పట్ల తన ఆసక్తి, అంకితభావం ఏమాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు.
నటీనటుల ఎంపికలో కాస్టింగ్ డైరెక్టర్ విస్తృత దృక్పథం
నటీనటుల ఎంపిక అనేది నిరంతరం మారుతూ ఉండే సృజనాత్మక ప్రక్రియ అని ముఖేశ్ ఛాబ్రా పేర్కొన్నారు. ప్రతి సినిమా, ప్రతి కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక అవసరాలు మారుతుంటాయని వివరించారు. ఒక పాత్రకు మరొక నటుడు మరింత సరిపోతాడని భావించినప్పుడు, చివరి నిమిషంలోనైనా గతంలో ఎంపిక చేసిన నటుడి స్థానంలో మరొకరిని తీసుకోవాల్సి రావచ్చని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు కూడా సృజనాత్మక ప్రక్రియలో భాగమేనని, సినిమా అవసరాలను దృష్టిలో ఉంచుకునే వాటిని తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ముఖేశ్ ఛాబ్రాకు నటీనటుల ఎంపిక అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు.. అదొక జీవన విధానం. “నాకు కాస్టింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు. జీవనోపాధి కోసం చేసే పని మాత్రమే కాదు.. అదే నా జీవితం. ఈ దేశానికి ఆస్కార్ అవార్డు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నా పని నేను నిజాయతీగా చేస్తాను” అని ఆయన అన్నారు.
తిరస్కరణ కూడా ప్రయాణంలో ఒక భాగమే
నటనలోకి రావాలనుకునే ఔత్సాహికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటైన తిరస్కరణ గురించి ముఖేశ్ ఛాబ్రా బహిరంగంగా మాట్లాడారు. దాన్ని తట్టుకుని ముందుకు సాగే పట్టుదల ఎంత ముఖ్యమో వివరించారు. “తిరస్కరణ అనేది జీవితంలో ఒక భాగం. దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఒక పాత్రకు సరిపోయే సరైన ప్రతిభను గుర్తించడమే మా పని. ప్రతిసారీ తిరస్కరణకు గురయ్యామని బాధపడుతూ, నిరాశలో ఉంటే ఎన్నో అవకాశాలను కోల్పోతారు” అని ఆయన అన్నారు.
తన స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ, చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ముఖేశ్ ఛాబ్రా వెల్లడించారు. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన తాను ప్రధానంగా నటీనటుల ఎంపిక బాధ్యతలు చేపట్టానని, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో పలువురు దర్శకులు తనను తిరస్కరించారని, వారిలో కొందరే ఇప్పుడు తనతో కలిసి పనిచేస్తున్నారని గుర్తుచేసుకున్నారు. “ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో పోరాటం చేయాల్సిందే. నా కష్టాల గురించి చెప్పుకోవాలని నాకు లేదు. కానీ నిజంగా నేను చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను” అని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
నటనకు వయసుతో సంబంధం లేదు.. ప్రతిభ ఒక్కటే ముఖ్యం
ఔత్సాహిక నటీనటులు తమ కెరీర్ నెమ్మదిగా సాగుతోందని నిరుత్సాహపడకుండా, సహనంతో, సానుకూల దృక్పథంతో ఉంటూ తమ కళ పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని ముఖేశ్ ఛాబ్రా సూచించారు. “మీకు నటించగలననే నమ్మకం ఉంటే, ఆ పనిలోకి దిగండి. ధైర్యంగా ముందుకు సాగండి” అని అన్నారు. నటనకు వయసుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతిభ ఒక్కటే ముఖ్యమని స్పష్టం చేశారు. “నటనకు వయసుతో సంబంధం లేదు.. ప్రతిభ ఒక్కటే ముఖ్యం” అని పేర్కొన్నారు. 40, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా నటనను వృత్తిగా ఎంచుకోవాలని ప్రోత్సహించారు. అన్ని తరాల వారికీ చెందిన నటీనటుల అవసరం చిత్ర పరిశ్రమకు ఉందని ఆయన వివరించారు.
ఒక నటుడిని ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలేమిటి?
ఒక పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేసే విషయంలో కేవలం ప్రతిభ ఒక్కటే ప్రామాణికం కాదని ముఖేశ్ ఛాబ్రా అభిప్రాయపడ్డారు. వ్యక్తిత్వం, నిజాయతీ, నిరాడంబరతతో పాటు దర్శకుడి సూచనలను స్వీకరించి, వాటికి అనుగుణంగా నటించగల సామర్థ్యం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. “నటుడు దర్శకుడి సూచనలకు అనుగుణంగా తన నటనను మార్చుకోగలగాలి. సూచనలను పాటించడం చాలా ముఖ్యం. నిజాయతీగా ఉండటం, చెప్పిన సూచనలను అనుసరించడం అవసరం” అని ఆయన అన్నారు. “జీవితాన్ని, మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోగలిగితే నటనను కూడా అర్థం చేసుకున్నట్లే” అని ఆయన పేర్కొన్నారు.
ఆడిషన్‌లో ఎంపిక కావాలంటే ఏం చేయాలి?
ఆడిషన్‌కు వెళ్లే ఔత్సాహిక నటీనటులు ముందుగా తాము పోషించబోయే పాత్రను, దాని నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ముఖేశ్ ఛాబ్రా సూచించారు. “ఆ సన్నివేశాన్ని మనసులోనే ఊహించుకుని, దానికి అనుగుణంగా మలచుకోవడం చాలా ముఖ్యం. నటుడి ఆలోచనా సామర్థ్యాన్ని కూడా మేము అంచనా వేస్తాం. కాబట్టి ఆడిషన్‌కు వెళ్లే ముందు పాత్ర గురించి పూర్తిగా అధ్యయనం చేసి, అవసరమైన సన్నద్ధతతో వెళ్లండి” అని ఆయన అన్నారు.
టేప్ చేసి పంపే (సెల్ఫ్ టేప్) ఆడిషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసిన ముఖేశ్ ఛాబ్రా, నేపథ్యం ఎలాంటి హంగులూ లేకుండా ఉండాలని సూచించారు. అనవసరమైన మేకప్‌కు దూరంగా ఉండాలని, నటనపైనే ప్రధానంగా దృష్టి నిలిచేలా చూసుకోవాలని చెప్పారు. నటుడితో పాటు సంభాషణలు చదివే వ్యక్తి తగిన సమయాల్లో సరైన సూచనలు అందించాలని పేర్కొన్నారు. కెమెరా ఫ్రేమింగ్‌లో నటుడి కళ్లను, ముఖ కవళికలను స్పష్టంగా చూపించే క్లోజప్ షాట్ ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాలో నిరంతరం ఇతరుల ప్రశంసలు, ఆమోదం కోసం ఎదురుచూడవద్దని యువ నటీనటులకు ఆయన సూచించారు. నటనా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, అనుభవాన్ని సంపాదించడంపై మాత్రమే దృష్టి పెట్టాలని అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి రంగస్థలం చక్కని వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. వయసుతో సంబంధం లేకుండా, గతంలో నటనలో అనుభవం ఉన్నా లేకపోయినా ఔత్సాహిక నటీనటులు నాటక సమూహాల్లో చేరి, రంగస్థల ప్రదర్శనల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు.
ఔత్సాహిక నటీనటులు తమలోని సహజత్వాన్ని, నిజాయతీని కాపాడుకుంటూ, నిరంతరం నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగాలని ముఖేశ్ ఛాబ్రా సూచించారు. తొందరపాటు లేదా తక్షణ గుర్తింపు పొందాలన్న ఆరాటం ప్రయాణానికి ఆటంకం కలిగించకుండా చూసుకోవాలని అన్నారు. “ఇదంతా సహనం, సానుకూల దృక్పథానికి సంబంధించిన విషయం. మీకు దక్కాల్సిన అవకాశం తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది” అని ఆయన చెప్పారు. వర్ధమాన నటీనటులకు మరో ముఖ్యమైన సూత్రాన్ని కూడా వివరించారు. “సహజంగా, నిరాడంబరంగా ఉండండి” అని సూచించారు.
ముఖేశ్ ఛాబ్రా నిర్వహించిన ఈ మాస్టర్‌క్లాస్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తెరపై ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే ప్రతి పాత్ర వెనుక ఎంతో శ్రమతో కూడిన అన్వేషణ, ముందస్తు సన్నద్ధత, సమష్టి కృషి ఉంటాయి. నటనలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా మనుషులను అర్థం చేసుకోవడం, నటనాకళను గౌరవించడం, సరైన పాత్ర కోసం సహనంతో ఎదురుచూడటంతోనే ప్రారంభమవుతుంది.
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***